మన ఆరోగ్యం మన చేతుల్లోనే..
జలజీవన్ మిషన్ జిల్లా కోఆర్డినేటర్ T.రంగారావు
న్యూస్‌తెలుగు/బాపట్ల : బాపట్ల జిల్లా వేధులపల్లి గ్రామంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు సి. జయ కుమార్ అధ్యక్షతన జలజీవన్ మిషన్ ఆధ్వర్యంలో 500 మంది విద్యార్థు లతో గొప్ప ర్యాలీ అనంతరం సభ నిర్వహించడం జరిగినది. ముఖ్య అతిథిగా పాల్గొన్న జలజీవన్ మిషన్ జిల్లా కోఆర్డినేటర్ తొండమల్ల రంగారావు మాట్లాడుతూ మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉన్నదని, ఆరోగ్యమే మహాభాగ్యం అని అన్నారు. వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భోజనానికి ముందు మల విసర్జన అనంతరం రెండు చేతులను సబ్బుతో లేదా డెటాల్తో శుభ్రంగా కడుగుకోవాలి అని అన్నారు. అలాగే పరిసరాలను వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని చేతి వేళ్ళ గోర్లను ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలి అని అన్నారు. తాజా ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా డయేరియా లాంటి సీజనల్ వ్యాధుల నుండి కాపాడు కోవచ్చు అని అన్నారు. డయేరియా వ్యాధి సంభవించినప్పుడు వైద్యుల సలహాలు సూచనలు పాటిస్తూ తగిన మందులను తీసుకోవాలని ఓఆర్ఎస్ ద్రావణాన్ని తగిన మోతాదులో ఎప్పటికప్పుడు తాగుతూ నీరసం పడకుండా చైతన్యవంతంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్స్ శేషు కుమారి మాట్లాడుతూ చేతులు శుభ్రం చేసుకునే పద్ధతులు ఏడు రకాలుగా ఉంటాయని వివరించారు. తినే ఆహార పదార్థాలమీద ఈగలువాలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ గోరువెచ్చని నీళ్లను లేదా కాచి చల్లార్చిన నేలను మాత్రమే తాగాలని వాటర్ బాటిల్ ని స్కూలుకు వచ్చేటప్పుడు తెచ్చుకోవాలని సూచించారు. సచివాలయ సిబ్బంది ఇంజనీరింగ్ అసిస్టెంట్ హరిబాబు విద్యార్థులకు నీటి పరీక్షలను చేసి చూపించారు. మనం తాగే నీటిలో క్లోరిన్ శాతం ఎంత ఉండాలి నీటి పీహెచ్ విలువ ఎంత ఉండాలి అని చేసి పరీక్ష చేసి విద్యార్థులకు వాటి విలువలను తెలియజేశారు. అంగనవాడి మరియు ఆశా కార్యకర్తలు విద్యార్థులకు చేతులను శుభ్రపరచుకునే ఏడు విధానాలు చేసి చూపించారు అనంతరం విద్యార్థులతో కూడా చేపించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో విద్యార్థులు కాచి చల్లార్చిన నీటిని తాగుదాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, ఆరోగ్యమే మహాభాగ్యం, డయేరియా అంతం మనందరి పంతం అంటూ నినదిస్తూ స్కూలు ఆవరణ నుండి హైవే మీదుగా మెయిన్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం తలపెట్టారు. ఈ కార్యక్రమంలో వెదుళ్ళపల్లి పంచాయతీ సెక్రెటరీ సచివాలయ సిబ్బంది అంగన్వాడీ టీచర్లు ఆశా కార్యకర్తలు వైద్య ఆరోగ్య సిబ్బంది పాఠశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు. (Story : మన ఆరోగ్యం మన చేతుల్లోనే)