శిశు సంరక్షణా కేంద్రాల ఆకస్మిక తనిఖీ
న్యూస్‌తెలుగు/విజయనగరం : విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశాల మేరకు జిల్లాలోని శిశు సంరక్షణా కేంద్రాలను, బాలల అనాధ శరణాలయాలను ఐసిడిఎస్ అధికారులు, జిల్లా బాలల సంరక్షణా విభాగం సిబ్బంది బుధవారం జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ ఆశ్రమాలలో పిల్లలకు అందిస్తున్న ఆహారం, త్రాగునీరు, వసతి సౌకర్యాలు, విద్య, ఆరోగ్యం, రక్షణ, భద్రతా విషయాలను, పరిసరాలను, రికార్డులను పరిశీలించారు. వీటికి జెజె యాక్ట్ ప్రకారం అనుమతులు తీసుకున్నదీ లేనిదీ తనిఖీ చేశారు. అనుమతి లేకుండా ఆశ్రమాలను నడపకూడదని స్పష్టం చేశారు. తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విజయనగరం పట్టణంతోపాటు, బొబ్బిలి తదితర ప్రాంతాల్లో కూడా ఈ తనిఖీలు జరిగాయి. కణపాకలోని నవజీవన్ హాస్టల్, కెఎల్‌పురం వద్ద మిరియం హోం, కామాక్షినగర్, నల్లమారమ్మ గుడివద్ద అనధికారికంగా ఆశ్రమాలను నిర్వహిస్తున్నట్లు గుర్తించి, హెచ్చరించారు.
ఈ తనిఖీల్లో స్త్రీశిశు సంక్షేమశాఖ పథక సంచాలకులు బి.శాంతకుమారి, ఇన్‌ఛార్జి డిసిపిఓ వై.నాగరాజు, పిఓ బి.రామకోటి, కౌన్సిలర్ వెన్నెల సంధ్య తదితరులు పాల్గొన్నారు. (Story : శిశు సంరక్షణా కేంద్రాల ఆకస్మిక తనిఖీ)