23న జరిగే గ్రామసభల్లో ప్రజలంతా పాల్గొనాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్
న్యూస్‌తెలుగు/విజయనగరం : జిల్లా వ్యాప్తంగా ఈ నెల 23న జరగనున్న గ్రామసభలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పిలుపునిచ్చారు. ఈ సభల్లో ప్రజలంతా పాల్గొనేలా చూడాలని, ఉపాధిహామీ పథకం క్రింద ప్రతిపాదించిన పనులపై విస్తృతంగా ఈ గ్రామ సభల్లో చర్చించాలని నోడల్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా వ్యాప్తంగా జరగాల్సిన గ్రామ సందర్శన కార్యక్రమాన్ని ఈ విడత వాయిదా వేసుకొని, శుక్రవారం జరిగే గ్రామసభల్లో ప్రతీ నోడల్ అధికారీ విస్తృతంగా పాల్గొనాలని సూచించారు. గ్రామాలను సుస్థిర అభివృద్ది దిశగా నడిపించేవిధంగా ఈ ఉపాధి పనులను గుర్తించాలన్నారు. ఈ గ్రామసభలపై గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని కోరారు.
రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ గ్రామసభల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాల్గొన్నారు. అనంతరం మండల నోడల్ అధికారులతో మాట్లాడుతూ, జిల్లాలో 775 గ్రామ పంచాయితీల్లో ఒకేరోజున గ్రామసభలను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సభల్లో అర్ధవంతమైన చర్చ జరగాలని, ప్రతీ గ్రామ సభకు ఒక ప్రత్యేకాధికారిని నియమించాలని సూచించారు. జెడ్‌పి సిఇఓ శ్రీధర్‌రాజా, పిడి డిఆర్‌డిఏ ఎ.కల్యాణచక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. (Story : 23న జరిగే గ్రామసభల్లో ప్రజలంతా పాల్గొనాలి)