ఆ 5 రోజులూ ఆధార్ క్యాంప్‌లు!
న్యూస్‌తెలుగు/అమరావతిః రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాలు, స్కూళ్లు, కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు. ఈ క్యాంపుల్లో కొత్త ఆధార్ కార్డులకు నమోదు చేయడంతో పాటు ఐదేళ్లు దాటిన చిన్నారులకు బయోమెట్రిక్ అప్డేట్ చేయనున్నారు. అలాగే పదేళ్లుగా ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకోని వారికి కూడా అప్డేట్ చేయనున్నారు. బయోమోట్రిక్ అప్డేట్‌తో పాటు పేరు, అడ్రస్, మొబైల్ నంబర్ లో మార్పులు చేయనున్నారు. ఆగస్టు 20 నుంచి 24 వరకు ఆధార్ క్యాంపులు ఉంటాయి.
ఇటీవల పుట్టిన వారికి కొత్త ఆధార్ కార్డులు జారీ, గతంలో ఆధార్ కార్డులు తీసుకుని నిబంధనల మేరకు అప్డేట్ చేసుకోవాల్సిన వారు 1.83 కోట్ల మంది ఉన్నారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. వారి కోసం ఆగస్టు 20 నుంచి 24వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ప్రభుత్వం ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనుంది. ఆధార్ జారీ చేసే యూఐడీఏఐ సంస్థ నిబంధనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లుగా ప్రతినెలా గ్రామ, వార్డు సచివాలయాల ఆధ్వర్యంలో ఆధార్ క్యాంపులు నిర్వహిస్తుంది. ఆగస్టులో ఆధార్ ప్రత్యేక క్యాంపుల నిర్వహణపై గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు కాలేజీలు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రత్యేక క్యాంపుల నిర్వహించనున్నారు.