నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపుతాం
చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దుకు ప్రయత్నాలు
నెలలో ఒక రోజు చేనేత వస్త్రాలు ధరించి నేతన్నలను ప్రోత్సహిద్దాం
గత ప్రభుత్వం చేనేతలకు ఇచ్చే ప్రోత్సాహకాలన్నీ రద్దు చేసింది
ఐదేళ్ల పాలనలో ఏ శాఖలో చూసినా విధ్వంసమే కనిపిస్తోంది
ఫోటోలకు వందల కోట్లు తగలేసిన గత ప్రభుత్వం..చేనేతల సంక్షేమంపై దృష్టి పెట్టలేదు.
చేనేత కార్మికుల గృహాలకు సౌరవిద్యుత్ సదుపాయం కల్పిస్తాం
ఆగస్టు 15 నుండి మళ్లీ అన్న క్యాంటీన్లు
రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో జలకళ సంతోషకరం
-సీఎం నారా చంద్రబాబు నాయుడు
విజయవాడలో జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్న సీఎం
తన సతీమణి భువనేశ్వరికి రెండు చీరలు కొనుగోలు చేసిన సీఎం చంద్రబాబు
న్యూస్‌తెలుగు/విజయవాడ : నెలలో ఒక రోజు అందరం చేనేత వస్త్రాలు ధరించి చేనేత కార్మికుల ప్రగతికి తోడ్పాటును అందిద్దామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడ మేరీస్ స్టెల్లా కళాశాలలో జరిగిన వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాల మాల్ ను సందర్శించారు. కార్మికుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చేనేత కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘టీడీపీ ఆవిర్భావం నుంచి అన్ని వేళలా చేనేతలు అండగా నిలిచారు. చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించడం నా బాధ్యత. మా ప్రభుత్వం చేనేత కార్మికులకు పూర్తీ అండగా ఉంటుంది. నాడు స్వాతంత్య్రోద్యమంలో స్వదేశీ వస్త్రాలను ప్రోత్సహించడం ఒక ఉద్యమంలా జరిగింది. అది అంతిమంగా క్విట్ ఇండియా ఉద్యమానికి దారితీసింది. 2015లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, నాడు సీఎంగా ఉన్న నేను చేనేత అంతర్జాతీయదినోత్సవానికి శ్రీకారం చుట్టాం. రాష్ట్రంలో చేనేత కార్మికులందరికీ ఒక భరోసా కల్పిండం కోసం నేను ఈ రోజు ఇక్కడికి వచ్చానను. గత ప్రభుత్వం నేతన్న నేస్తం అని చెప్పి నేత కార్మికుడికి రూ.24 వేలు ఇచ్చేసి దాంతోనే అంతా బాగుపడిపోతారని అనుకున్నారు. మీకు రావాల్సిన అన్ని రకాల పథకాలను రద్దు చేశారు. ఆప్కో ద్వారా చేసే చేనేత వస్త్రాల కొనుగోళ్లు ఆపేశారు. నూలు, రంగులపై ఇచ్చే రాయితీలు తీసేశారు. అన్ని రకాల రుణాలు తీసేసి చేనేత కార్మికులు పొట్ట కొట్టారు. గత ప్రభుత్వం పోతూ పోతూ చేనేత రంగానికి, కార్మికులకు రూ.266 కోట్లు అప్పు పెట్టి వెళ్లిపోయింది.’’ అని సీఎం విమర్శించారు.
రుణ మాఫీ చేసి ఆదుకున్నాం
చరిత్ర ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. టీడీపీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా చేనేత కార్మికుల కోసం అవిశ్రాంత పోరాటం చేసింద. 2007లో చేనేతలకు రూ.372 కోట్ల రుణాలు మాఫీ చేయకుండా ఆనాటి ప్రభుత్వం మోసం చేస్తే పోరాడాం. మా తమ పోరాట ఫలితంగా 2009లో ముఖ్యమంత్రి రోశయ్య రూ.109 కోట్లు రుణాలు మాఫీ చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే చేనేతలకు రూ.110 కోట్లు రుణాలు మాఫీ చేసి చేనేతలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు. 2014లో చేనేతలకు రూ.250 కోట్లు బడ్జెట్ కేటాయించాం. 90,795 చేనేత కుటుంబాలకు వంద యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చాం. చేనేత కార్మికులకు చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలు వస్తున్నాయని తెలిసీ 50 ఏళ్లకే పింఛన్లు ఇచ్చిన ఘనత కూడా టీడీపీదే. నూలు, రంగులపైన సబ్సిడీ 20 శాతం ఉంటే దాన్ని 40 శాతానికి పెంచాం. మగ్గాలపై 50 శాతం రాయితీ ఇచ్చి రూ.80 కోట్లు ఖర్చు చేశాం. 70 వేల మంది చేనేత కార్మికులకు మోటరైజ్డ్ జకార్డ్ లిఫ్టింగ్ సదుపాయం కల్పించామన్నారు. చేనేత పరిశ్రమ పట్ల, చేనేతల పట్ల మాకున్న శ్రద్ధకు ఇది నిదర్శనం చేనేతలకు ఇచ్చిన అన్ని హామీలు నిలబెట్టుకుంటాం’’ అని సీఎం స్పష్టం చేశారు.
బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం
రాష్ట్రంలో బీసీల రక్షణ కోసం ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. బీసీల్లో చాలా ఉప కులాలున్నాయని, వారంతా చాల వెనుకబడి ఉన్నారని, ఎక్కువ మంది కుల వృత్తులపైనే ఆధారపడి జీవిస్తున్నారని వారందర్నీ ఆదుకుంటామన్నారు. బీసీ సబ్ ప్లాన్ ద్వారా రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు. తద్వారా బీసీ జీవితాల్లో వెలుగులు నింపుతామన్నారు. స్థానిక సంస్థల్లో మళ్లీ బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు తీసుకొస్తామన్నారు. చట్టసభల్లో వెనుకబడిన వర్గాలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేలా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని, ఇది పార్లమెంటులో చట్టమయ్యేంత వరకు బీసీల తరఫున పోరాటం చేస్తామని తెలిపారు. నామినేటెడ్ పోస్టుల్లో కూడా బీసీలకు ప్రాధాన్యమిస్తామని చెప్పారు. టీడీపీ రాష్ట్ర పార్టీ అధ్యక్ష, అసెంబ్లీ స్పీకర్ ఇద్దరూ బీసీలేనని గుర్తు చేశారు.
ఎక్కడ చూసినా విధ్వంసమే
చేనేత దినోత్సవం సందర్భంగా చేనేతలకు ఎన్నో చెప్పాలని అనుకున్నానని, అడిగినదానికంటే ఎక్కువ ఇవ్వడం తన స్వభావమన్నారు. కానీ గత రెండు నెలలుగా ప్రభుత్వాన్ని చూస్తుంటే బాధేస్తోందని చెప్పారు. రాష్ట్ర ఖజానాను గత ప్రభుత్వం దివాలా తీయించిదన్నారు. రూ.10లక్షల కోట్లు అప్పు పెట్టిందని, దానికి వడ్డీ, అసలు చెల్లించడానికే ప్రతి యేటా రూ.80వేల కోట్లు కావాలన్నారు. ఎక్కడ చూసినా విధ్వంసం, వ్యవస్థలను సర్వనాశనం చేశారన్నారు. ప్రభుత్వంలో ఇప్పుడు చూస్తున్న ఇబ్బందులను తన అనుభవంలో ఎన్నడూ చూడలేదన్నారు. అయినా సరే ఇబ్బందులున్నాయని వెనుకడుగు వేయబోయమన్నారు. సంపద సృష్టించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం తొలి రోజే 5 హామీల అమలుపై సంతకాలు చేశానని తెలిపారు. 65 లక్షల మందికి ప్రతి నెలా రూ.2,737 కోట్లు పింఛన్లు చెల్లిస్తున్నామని, రాబోయే ఐదు ఏళ్లలో పింఛన్ల కిందే ప్రభుత్వం రూ.1.65 లక్షల కోట్లు పంపిణీ చేయబోతోందన్నారు.
త్వరలో చేనేత సహకార సంఘాల ఎన్నికలు
‘రాష్ట్రంలోని చేనేత సహకార సంఘాల పాలకమండళ్ల కాల పరిమితి ముగిసిపోతుందని, త్వరలోనే వాటికి ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి అన్నారు. అయితే చేనేత రంగ అభివృద్ధి కోసం మేలు చేసేవారినే మీరు సభ్యులుగా ఎన్నుకోవాలని చేనేత కార్మికులకు సూచించారు. రాష్ట్రంలో 100 ఆప్కో షో రూములున్నాయని, గత ప్రభుత్వం పెట్టిన ఆప్కో బకాయిలు కూడా త్వరలో చెల్లిస్తామన్నారు. చేనేతల ప్రతి ఇంటికి సౌర విద్యుత్తు సదుపాయం కల్పిస్తామన్నారు. చేనేత కార్మికులకు పైసా ఖర్చు కాకుండా పీఎం సూర్య ఘర్ పథకం కింద ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నారు. అవసరాలకు పోను మిగిలిన విద్యుత్ ను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. అన్ని వేళలా తనకు పార్టీకి అండగా ఉన్న చేనేత కార్మికులు తన ఆత్మబంధువులన్నారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ భారంగా ఉందని, దాన్ని తొలగించాలని చేనేత కార్మికులు కోరుతున్నారని, కేంద్రం, జీఎస్టీ కౌన్సిల్ లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించి జీఎస్టీ తొలగించేలా చేస్తామన్నారు. ఒకవేళ కేంద్రం జీఎస్టీ తొలగించడానికి ముందుకు రాకపోతే చేనేతలు చెల్లించే జీఎస్టీ మొత్తాన్ని వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వమే రియింబర్స్ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా చేయిస్తామని దానికి రూ.10 కోట్లు అవసరమవుతుందని అధికారులు అంటున్నారని, ఈ కార్యక్రమం కూడా చేపడతామన్నారు. రాష్ట్రంలో 64 చేనేత క్లస్టర్ల అభివృద్ధికి సమగ్ర విధానం తీసుకొస్తామన్నారు. 92,724 మంది చేనేతలకు 50 ఏళ్లకే పింఛను అందిస్తున్నామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఆలోచన తీరు మారుతోందని, ఒకప్పడు అందరూ ఇండస్ట్రియల్ కాటన్ దుస్తులు ధరించేవారని, ఇప్పుడు ఖద్దరు, చేనేత దుస్తులు ధరించాలని ముందుకొస్తున్నారని దీన్ని మనం ఒక అవకాశంగా తీసుకుని సరైన డిజైన్లు రూపొందించి మన ప్రతిభ నిరూపించుకుని అధిక ఆదాయం పొందే స్థితికి చేరుకోవాలన్నారు. ఈ చేనేత పరిశ్రమకు చేయూతనిచ్చే బాధ్యత ప్రభుత్వానిదన్నారు.
సతీమణి భువనేశ్వరికి రెండు చీరలు కొనుగోలు చేసిన సీఎం
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మేరీస్ స్టెల్లా కాలేజీలో ఏర్పాటు చేసిన చేనేత ప్రదర్శనను ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించారు. అక్కడ చేనేత కార్మికులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం తన సతీమణి నారా భువనేశ్వరికి ఉప్పాడ, వెంకటగిరి చీరలు కొనుగోలు చేశారు. తన సతీమణి కోసం ఎన్నడూ చీరలు కొనలేదని, ఎందుకో ఇక్కడికి రాగానే భువనేశ్వరి గుర్తుకు వచ్చారని, అందుకోసం ఆమెకు రెండు చీరలు కొన్నానని సరదాగా అన్నారు. తాను ఎమ్మెల్యే అయినప్పుడు పొందూరు ఖద్దరు బాగా ఇష్టపడేవాడినని గుర్తు చేశారు. (Story : నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపుతాం)