సీతం ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం తరగతుల ప్రారంభం
న్యూస్‌తెలుగు/విజయనగరం : స్థానిక గాజులరేగ పరిధిలో గల సీతం ఇంజనీరింగ్ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం తరగతుల ప్రారంభ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జేఎన్టీయూ-గురజాడ విజయనగరం ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. శ్రీ కుమార్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఇంటర్మీడియట్ చదువు తర్వాత విశ్రాంతి తీసుకోకుండా ఇంజినీరింగ్‌తోపాటు మూక్స్ కోర్సులపై దృష్టి సారించి నైపుణ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. అలాగే విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పరిశ్రమలకు సరిపోయే నైపుణ్యాలను అలవర్చుకోవాలన్నారు తెలివైన అభ్యాసకులుగా ఉండాలని సలహా ఇచ్చారు.కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ డాక్టర్ బొత్స ఝాన్సీలక్ష్మి మాట్లాడుతూ పిల్లల చదువు, ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనించాలని, విద్యార్థి జీవితంలో ఎన్.సి.సి, ఎన్.ఎస్.ఎస్ ప్రాముఖ్యతను గురించి వివరించారు. మెరుగైన ఉద్యోగ అవకాశాలు పొందడానికి అన్ని సబ్జెక్టులను మంచి మార్కులతో పూర్తిచేయాలని, అలాగే అన్ని సబ్జెక్టులపై పట్టు సాధించాలని విద్యార్థులకు సూచించారు.
బొత్స పూజిత మాట్లాడుతూ విద్యార్థులు ఉద్యోగ అవకాశాలను పొందడంలో కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు.పుస్తక పఠనం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కళాశాల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణరావు విద్యార్థులకు సూచించారు.కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి .వి.రామమూర్తి విద్యార్థులకు పలు విద్యాపరమైన సూచనలను, సలహాలను ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మొదటి సంవత్సరం విభాగాధిపతి డా.కె.శ్రీలత మాట్లాడుతూ ఇంజినీరింగ్ అధ్యయనంలో విద్యార్థుల జీవితాలను గూర్చి వివరించి, జీవితంలో వారు విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, ఇతర సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. (Story : సీతం ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం తరగతుల ప్రారంభం)