కమ్యూనిస్టు కార్యాలయాలు పోరాట కేంద్రాలుగా ఉండాలి
దేశంలో మోడిది బ్లాక్మెయిల్ రాజకీయం
ప్రతిపక్షాలను ప్రజలను గౌరవించని వారు ఇళ్లకే పరిమితమయ్యారు
రౌడీయిజం, అవినీతి, అహంభావం పెరిగితే పతనం తప్పదు
దేశానికి కమ్యూనిస్టుల అవసరాన్ని అంతా గుర్తిస్తున్నారు.
సిపిఐ జాతీయ కార్యదర్శి డా.కె నారాయణ
న్యూస్‌తెలుగు/భద్రాద్రి కొత్తగూడెం : కమ్యూనిస్టు కార్యాలయాలు పోరాట కేంద్రాలుగా విలసిల్లాలని సిపిఐ జాతీయ కార్యదర్శి డా.కె.నారాయణ అన్నారు. చుంచుపల్లి మండల సిపిఐ కార్యాలయాన్ని (రజబ్ అలి భవన్)ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపిఐ జెండాను ఎగురవేశారు. ఇందులో భాగంగా రజబ్ అలి భవన్ కార్యదర్శి కార్యాలయన్ని సిపిఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, చండ్ర సత్యం సమావేశ మందిరాన్ని ఏఐటియూసి సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియ్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అనతంరం జరిగిన సభలో నారాయణ మాట్లాడుతూ రజబ్ అలీ కాలం నాటి రాజకీయాలకు, ప్రస్తుత రాజకీయాలకు ఎంతో వ్యత్యాసం ఉందన, పవిత్రమైన రాజకీయాలు నేడు అపహాస్యం పాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు. దేశంలో నరేంద్రమోడి బ్లాక్మెయిల్ రాజకీయాలకు తెరలేపారని, బెదిరింపులకు పాల్పడుతూ పాలన సాగిస్తున్నారన్నారు. మొన్న ముగిసిన పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు వస్తాయని ప్రగల్బాలు పలికిన బిజేపికి కేవలం 240సీట్లే వచ్చాయని, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సంఖ్యా బలం లేకున్నప్పటికీ ఏపిలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబుతో, బిహార్లో సమాజ్వాద్ పార్టీ నితీష్ కుమార్తో జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారని, దేశ చరిత్రలో నరేంద్రమోడి అతి తక్కువ ఓట్లతో గెలిచిన రెండో ప్రధానిగా చరిత్ర పుటల్లోకి ఎక్కారని యద్దేవా చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ వారికే అనుకూలంగా ఉందని, అంబాని, అదానీలకు కావాల్సిన రీతిలో పద్దును తీర్చి దిద్దారని, సంపన్న వర్గాల వ్యాపారవేత్తలకు జిఎస్టి 33 శాతం నుండి 22 శాతానికి తగ్గించి, పేదలు వాడుకునే చెప్పులపై ఉండే 5 శాతం జిఎస్టిని 18 శాతానికి పెంచారని మండిపడ్డారు. ఇది ముమ్మారిటకీ పెద్దల పద్దే అని, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారాం పవిత్రమైన పార్లమెంట్ సాక్షిగా అన్ని అబద్ధాలే చెబుతున్నారని మండిపడ్డారు. రౌడీయిజం, అవినీతి, అహంభావం పెరిగిపోతే రాజకీయ పతనం తప్పదని, తెలంగాణ, ఏపిల్లో అచ్చం ఆదే జరిగిందన్నారు. తమకు ఎదురేలేదని, ప్రతిపక్షాలను గౌరవించకుండా తూలనాడిన కేసిఆర్, జగన్ను ప్రజలు ఇంటికి పంపారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీకి అడుగుపెట్టకుండా కేసిఆర్ చేస్తే ఇప్పుడు సీన్ తిరగబడి కేసిఆర్ ఓ మూలకు కూర్చునే పరిస్థితి వచ్చిందన్నారు. సిపిఐకి కొత్తగూడెం అసెంబ్లీ సీటు కావాలని అడిగితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్తగూడె O నుండి పోటీ చేసి గెలిస్తే తనముఖం చూస్తు ఉండలేనని సీటు, ఇవ్వలేనని తేల్చి చెప్పారని, కానీ ఇప్పుడు కేసిఆర్ ముఖమే కనబడకుండా పోతోందని అన్నారు. ప్రతిపక్షాలను అగౌరవ పరిచే సాంప్రదాయాన్ని మానుకోవాలని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తప్పిదాన్ని చేస్తోందని, తీరుమార్చు కోవాలని సూచించారు. పదవులు ఎవరికీ శాశ్వతం కాదని, ప్రజా తీర్పుకు ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందే అని చెప్పారు. ఎలాంటి పదవులు లేకున్నా కమ్యూనిస్టులు నిత్యం ప్రజలతోనే ఉంటారని చెప్పారు. దేశంలో నానాటికీ పెరిగిపోతున్న విపత్కర పరిస్థితులను చూస్తున్న ప్రజలు ఇప్పుడిప్పుడే కమ్యూనిస్టుల ఆవసరాన్ని గుర్తిస్తున్నారని, పవిత్రమైన రాజకీయ వ్యవస్థను కాపాడుకునేందుకు కమ్యూనిస్టులుగా పోరాటాలను మరింత పదునుపెట్టాలన్నారు.
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎంఎల్ఎ కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ సుమారు 40 ఏళ్ల పాటు ఈప్రాంతం కమ్యూనిస్టుల కంచుకోటని, తాను కొత్తగూడెం వచ్చిన తొలినాళ్ల నుండి ఇప్పటి వరకు ఈ ప్రాంత ప్రజలు కమ్యూనిస్టు పార్టీని అండదండగా ఉన్నారని తెలిపారు. ఎన్నో పోరాటాలు, నిర్భంధాలు, జైళ్లు, అనిచివేతలను తట్టుకుని నిలబడ్డామని, మొదట్లోఈ కార్యాలయాన్ని రేకుల షెడ్లో ఏర్పాటు చేసుకుని, ఇప్పుడు సరికొత్త హంగులతో నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని, భవోద్వేగాన్ని కలిగిస్తోందన్నారు. కొత్తగూడెం నియోజవర్గంలోని ప్రతీ అభివృద్ధిలో సిపిఐ కృషి ఉందని, ఇప్పుడు మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం లభించిందని, కనీవినీ ఎరుగని రీతిలో శాశ్వత అభివృద్ధికి బాటలు వేసుకుందామని, అందుకు అడుగులు కూడా పడ్డాయని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పాటుపడే పార్టీల మనుగడ శాశ్వతమని, తమకు పదవుల కంటే ప్రజా శ్రేయస్సు ముఖ్యమని కూనంనేని స్పష్టం చేశారు. సిపిఐ భద్రాద్రి, ఖమ్మం జిల్లాల కార్యదర్శులు ఎస్ కె సాబీర్ పాషా, పోటు ప్రసాద్, వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి శీతారామయ్య, కే రాజ్కుమార్లు సభలో మాట్లాడారు. సిహెచ్ మాధవరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కల్లూరి వెంకటేశ్వరరావు, చంద్రగిరి శ్రీనివాసరావు, నరాటి ప్రసాద్, దుర్గరాశి వెంకన్న, వాసిరెడ్డి మురళీ, పూర్ణచంద్రరావు, ఏ సాయిబాబు, బి కేశవరావు, కంజర్ల జమలయ్య, భానోత్ గోవింద్, పోలమూరి శ్రీనివాస్, వి. పద్మజ, కే రత్నకుమారి, ఉదయ్ భాస్కర్, ధనలక్ష్మీ, గెద్దాడి నగేష్, దీటి లక్ష్మీ పతి, బండి నాగేశ్వరరావు, భూక్యా శ్రీనివాస్, సుధాకర్, ఫహీమ్, చండ్ర పూర్ణ, చండ్ర మధు, విజయలక్ష్మీ, వివిధ పార్టీల నాయకులూ ఎంవి చౌదరి, నాగసీతారాములు, కనగాల అనంతరాములు, పౌలు, కూసపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. (Story :కమ్యూనిస్టు కార్యాలయాలు పోరాట కేంద్రాలుగా ఉండాలి)