పూడికతీత పనులను పరిశీలించిన కమిషనర్ ఎంఎం నాయుడు
న్యూస్‌తెలుగు/విజయనగరం: స్థానిక గంటస్తంభం ప్రాంతంలో ఉన్న ప్రధాన కాలువలో పూడిక తీత పనులను నగరపాలక సంస్థ కమిషనర్ ఎంఎం నాయుడు పరిశీలించారు. కాలువలో పేరుకుపోయిన పూడికతీత ప్రక్రియలో సాంకేతిక సమస్యలను గుర్తించి పరిష్కార మార్గాలను చూపారు. గత మూడు రోజులుగా జెసిబిలు సహాయంతో ప్రధాన కాలువలో పేరుకుపోయిన పూడికతీతను తొలగించి వేస్తున్నారు. అలాగే ప్రధాన రహదారులపై ఉన్న డివైడర్లలో కలుపు మొక్కలు విపరీతంగా పెరిగినట్లు కమీషనర్ గుర్తించారు. వాటిని వెంటనే ప్రక్షాళన చేయాలని వర్క్ ఇన్స్పెక్టర్లకు ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల రోజులుగా అన్ని కాలువల్లో పూడికతీత పనులను ముమ్మరం చేసామన్నారు. మిగిలి ఉన్న కాలువలలో కూడా పూడికతీత పనులు పూర్తి చేసి వర్షపు నీరు సజావుగా ప్రవహించే విధంగా చూస్తామన్నారు. గంటస్తంభం ప్రాంతంలో ఉన్న ప్రధాన కాలువలో పూడిక తీత సమస్య ప్రతిసారి ఉత్పన్నమవుతుందన్నారు. ప్రధానంగా రద్దీగా ఉన్న మార్కెట్ ప్రాంతం కావడంతో ప్రతి ఒక్కరు నిరుపయోగ వ్యర్ధాలను ప్రధాన కాలువలో పడి వేయడమే పూడిక చేరడానికి కారణంగా భావిస్తున్నామన్నారు. ఎక్కడికక్కడ జాలులు ఏర్పాటు చేసి వ్యర్ధాలకు అడ్డుకట్ట వేస్తామని తెలిపారు. (Story : పూడికతీత పనులను పరిశీలించిన కమిషనర్ ఎంఎం నాయుడు)