ఇంటి ఆవరణ ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా జాగ్రత్త వహించాలి
నగరపాలక కమిషనర్ ఎంఎం నాయుడు
న్యూస్‌తెలుగు/ విజయనగరం :ఇంటి ఆవరణ ప్రాంతాలలో చుక్కనీరు కూడా నిల్వ లేకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎంఎం నాయుడు ప్రజలకు అవగాహన కల్పించారు. శనివారం బొండాడ వీధి, చిన్న వీధి, ఉసిరికల సత్రం జంక్షన్ తదితర ప్రాంతాలలో ఆయన పర్యటించి ఆయా ప్రదేశాలను పరిశీలించారు. నీరు నిల్వ లేకుండా పరిశుభ్రంగా ఉన్నట్లయితే దోమలు వృద్ధి కాకుండా ఉంటుందన్నారు. ఎక్కడైతే నీరు చేరి నిల్వ ఉంటుందో అక్కడ లార్వా పెరిగి దోమలుగా రూపాంతరం చెందుతాయన్నారు. కొన్ని ఇళ్లకు వెళ్లి ఆయా ఇంటి ఆవరణలో రోళ్ళు, కుండీలలో నిల్వ ఉన్న నీటిని తొలగించి వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణంగా ఫ్రిడ్జ్ ల అడుగుభాగంలో, ఎయిర్ కూలర్లలో ,కొబ్బరి చిప్పలు, టైర్లు, పెంకులు,కుండీలలో నీరు నిల్వ ఉంటుందని అవే దోమల వృద్ధికి కేంద్రాలని ప్రజలు గమనించాలన్నారు. నీరు నిల్వ లేకపోతే లార్వా ఉత్పత్తి తగ్గుతుందన్నారు. కావున ప్రజలు మరింత చైతన్యవంతులై పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బవిరెడ్డి సతీష్, పారిశుధ్య పర్యవేక్షకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. (Story : ఇంటి ఆవరణ ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా జాగ్రత్త వహించాలి. )