వేటపాలెం స్ట్రైట్ కట్ ఆక్రమణ
– నిద్రావస్తలో రెవిన్యూ, డ్రైనేజీ శాఖలు
– ఆర్డీవో విచారణ తరువాత కూడా ఫెన్సింగ్ ఏర్పాట్లు పూర్తి
– వీఆర్వో కు షోకాజ్ నోటీసుతో సరి
– ప్రభుత్వం భూములు, కరకట్టలు కబ్జాలు
న్యూస్‌తెలుగు/వేటపాలెం: వేటపాలెం మండలంలో ప్రభుత్వ భూములు, కరకట్టలు భూకబ్జాలకు పాల్పడుతున్నా రెవెన్యూ, డ్రైనేజీ శాఖలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. వేటపాలెం స్ట్రైట్ కట్, కరకట్టలు ఆక్రమణలకు గురయ్యాయని గత సోమవారం జిల్లా కలెక్టర్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు అందిన మేరకు వేటపాలెంలో పలు భూకబ్జాలు ఆక్రమణలను చీరాల ఆర్డీవో వేటపాలెం తహాసీల్దారు మరియు సిబ్బంది తో ఫీల్డ్ కి వెళ్లి పరిశీలించిన అనంతరం విఆర్ఓకు షోకాజ్ నోటిస్ తో సరిపెట్టారు. ఈరోజు వరకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం మరియు రెవెన్యూ అధికారులు బదిలీలు జరుగుతూ ఉండటంతో భూకబ్జాదారులకు ఉత్సాహం ఊపందుకుని ఆక్రమణలకు ఇనుపకంచెలతో ఫెన్సింగ్ పూర్తి చేసుకుంటున్నారు. అయినప్పటికీ రెవెన్యూ అధికారులు చట్టపరమైన చర్యలు చేపట్టకుండా కాలయాపన చేస్తున్నారు. డ్రైనేజీ అధికారులు సిబ్బంది లేరు అనే సాకుతో కనీసం పర్యవేక్షణ కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. గతంలో రిటైర్డ్ అయిన తహసిల్దారులను అడ్డం పెట్టుకుని స్థానిక వీఆర్వో సహకారంతో కరకట్టలు, పోరంబోకు, సొసైటీ భూములు ఆక్రమణలు చేసి అక్రమంగా మట్టి తరలిస్తున్నప్పటికీ రెవిన్యూ, డ్రైనేజీ శాఖల అధికారులు పట్టినట్టు వ్యవహరించడంపై స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేటపాలెం మండలం నాయినపల్లి సర్వే నెంబరు 514 లో సుమారు ఒకటిన్నర ఎకరం భూమిని ఆక్రమించి ఇనుపకంచెలతో ఫెన్సింగ్ వేస్తున్న విషయం రెవెన్యూ అధికారుల దృష్టికి స్థానికులు తీసుకువెళ్లినప్పటికీ ఈరోజు వరకు స్పందించకపోవడం రెవెన్యూ అధికారుల పనితీరుపై అనేక అనుమానాలకు తావిస్తోంది. (Story : వేటపాలెం స్ట్రైట్ కట్ ఆక్రమణ)