ఆగష్టు 5 నుండి 9 వరకు స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమం
న్యూస్‌తెలుగు/వనపర్తి : ఆగష్టు 5 నుండి 9 వరకు వనపర్తి జిల్లాలో జరిగే స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పకడ్బందీగా ప్రణాళికలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం ఐ.డి. ఒ సి లోని సమావేశ మందిరంలో కార్యక్రమ అమలు పై మండల ప్రత్యేక అధికారులు , మున్సిపల్ కమిషనర్, ఎంపీడీఓలు, ఎంపీఒ లతో సమావేశం నిర్వహించి విధి విధానాలు తెలియజేశారు.
ప్రతి గ్రామము పరిశుభ్రంగా, పచ్చదనంతో కళకళలాడే విధంగా చేయడానికి ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్దేశించింది అన్నారు. ఆగష్టు 5 నుండి,9 వరకు ప్రతిరోజూ పారిశుధ్యం, చెట్లు నాటే కార్యక్రమం నిర్వహిస్తూ రోజుకో కార్యక్రమం పై ప్రత్యేక దృష్టి పెట్టే విధంగా కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు.
ఆగష్టు 5వ తేదీన ప్రారంభ రోజు అధికారులు, ప్రజాప్రతినిధులు, యువతను భాగస్వాములను చేస్తూ ఒక ర్యాలీ నిర్వహించి శ్రమదానం చేయాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ, మండల కేంద్రంలో ఒక గోడ పై స్వచ్చదనం పచ్చదనం ప్రతిబింబించే విధంగా చిత్రలేఖనం చేయించాలి. విద్యార్థులుతో వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలి. ప్రజలు చెత్తను ట్రాక్టర్ లో కాకుండా వీధుల్లో వేసే ప్రాంతాలను గుర్తించాలి. మొక్కలు నాటాలి.
ఆగష్టు 6 నాడు తాగు నీటి పై కార్యక్రమం
గ్రామంలోని అన్ని తాగు నీటి ఓవర్ హెడ్ ట్యాంకులను శుభ్రం చేయించాలి. నీటి పరీక్షలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలి. చెరువు కట్టల పొడవునా మొక్కలు నాటించాలి. సాముహిక ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయించాలి. 300 గజాలు ఆపైన స్థలంలో నిర్మించిన గృహాలకు ఇంకుడు గుంతలు ఉన్నాయా అని పనిచేస్తున్నాయా లేదా పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలి.
ఆగష్టు 7న మురుగు కాలువలు శుభ్రం
గ్రామం, మున్సిపాలిటీల్లో ఉన్న మురుగు కాలువల్లో పూడికతీత పనులు చేపట్టాలి. లోతట్టు ప్రాంతాల్లో నిలువ నీరు లేకుండా చేయించాలి. ఒకవేళ నీరు తొలగించలేని పక్షంలో ఆయిల్ బాల్ వేయడం, గంబుజియ చేపలు వదలడం వంటివి చేయాలి. ఓపెన్ ప్లాట్ల లో ఉన్న పిచ్చి మొక్కలు, మురికిని శుభ్రం చేయించాలి. ప్లాటు యజమాని శుభ్రం చేయించసి పక్షంలో అధికారులు శుభ్రం చేయించి జరిమాన వెయాలి. రోడ్ల పై ఉన్న గుంతలను పూడ్పించడం, మరమ్మతులు చేయించాలి.
ఆగష్టు 8నాడు ఆరోగ్య దినోత్సవం
ఆరోగ్య రీత్యా సీజనల్ వ్యాధుల పై పాఠశాలల్లో, కళాశాలల్లో గ్రామ పంచాయతీలో అవగాహన కల్పించాలి. దోమల వల్ల వచ్చే డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా వ్యాధులు ఏ విధంగా వ్యాప్తి చెందుతాయి అనేది చర్చించాలి. దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యల పై ప్రజలకు అవగాహన కల్పించాలి. ఫీవర్ సర్వే నిర్వహించాలి.
వీధి కుక్కలను నియంత్రించడానికి పశు వైద్యుల ద్వారా కుక్కలకు సంతాన నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయించాలి.
ఆగష్టు 9న డ్రై డే, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రణ
ప్రభుత్వ భవనాల పరిసరాలు శుభ్రం చేయించడం, పాడుబడిన ఇళ్ళు, రోడ్డు పక్కన ఎండిపోయిన చెట్లను తొలగించే కార్యక్రమం చేపట్టాలి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలి.
పచ్చదనంలో భాగంగా అయిదు రోజులు స్థలం దొరికిన ప్రతి చోట మొక్కలు నాటడం, ప్రతి ఇంటికి పళ్ళ మొక్కలు ఇచ్చి వాటిని నాటించడం వంటి కార్యక్రమాలు చేపట్టాలి.
ఊరికి స్వాగత మార్గంలో, ఊరి చివరి భాగంలో రోడ్డుకు ఇరువైపులా పెద్ద చెట్లు నాటించాలి. ఈ కార్యక్రమాల నిర్వహణకు ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటిలో కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇవ్వాళ రేపు మండల గ్రామ స్థాయిలో సభలు సమావేశాలు ఏర్పాటు చేసి చర్చించాలి. ప్రజలను భాగస్వాములు చేయాలి. ఆదివారం సాయంత్రం అన్ని గ్రామ పంచాయతీల్లో దండోరా వేయించాలి. చెత్త సేకరించి ట్రాక్టర్, ఆటో ల ద్వారా మైక్ ప్రచారం నిర్వహించాలి.
ప్రతి ఆధికారి, సిబ్బంది ఈ కార్యక్రమ అమలు పై ప్రణాళిక ప్రకారం కృషి చేసి స్వచ్చ వనపర్తి దిశగా అడుగులు వేయాలని కలెక్టర్ ఆదేశించారు.అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత గంగ్వార్, జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓ లు, మున్సిపల్ కమిషనర్లు , ఎంపీఓ లు పాల్గొన్నారు. (Story : ఆగష్టు 5 నుండి 9 వరకు స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమం )