హైవే రోబరీకి పాల్పడిన నిందితులను అరెస్టు చేసిన సిసిఎస్ పోలీసులు
జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
న్యూస్‌తెలుగు/విజయనగరం: జిల్లా పూసపాటిరేగ పోలీసు స్టేషను పరిధిలో జాతీయ రహదారిపై మే నెలలో జరిగిన హైవే రోబరీ కేసులో పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను సిసిఎస్ పోలీసులు అరెస్టు చేసి, వారి వద్ద నుండి రూ.17.35 లక్షల నగదు, రూ. 5లక్షల విలువైన బంగారు వస్తువులను రికవరీ చేసినట్లుగా జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – 16వ జాతీయ రహదారిపై పూసపాటిరేగ మండలం చోడమ్మ అగ్రహారం ఫై ఓవర్ బ్రిడ్జిపైన మే నెలలో జరిగిన హైవే రోబరీ కేసు జరిగిందన్నారు. ఒడిస్సా రాష్ట్రం పర్లాకిమిడికి చెందిన బియ్యం వ్యాపారి కోట్ల వంశీకృష్ణ అనే వ్యక్తి వ్యాపారుల నుండి వసూలు చేసి, కారులోరూ. 50 లక్షలను తీసుకొని వస్తుండగా, నిందితులు చోడమ్మ అగ్రహారం వద్ద కారును అడ్డగించి, కారం జల్లి, కోట్ల వంశీకృష్ణ నుండి రూ.50 లక్షలు తీసుకొని పరారీకాగా, వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పూసపాటిరేగ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినారు. ఈ కేసులో వంశీకృష్ణ కారు డ్రైవరు ఇచ్చిన సమాచారం మేరకే నిందితులు ఒక బృందంగా ఏర్పడి, దోపిడికి పాల్పడినట్లుగా విచారణలో గతంలోనే వెల్లడయ్యిందన్నారు. ఈ కేసులో కారు డ్రైవరుతో సహా ఆరుగురు నిందితులను గతంలోనే అరెస్టు చేసి, 5.70 లక్షలను రికవరీ చేసామన్నారు. కానీ, ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన పర్లాకిమిడి ప్రాంతానికి చెందిన రుద్రపంక్తి మధు దోపిడీలో దోచుకున్న డబ్బులో ఎక్కువ మొత్తంను తీసుకొని, పరారీ అయ్యాడన్నారు. అప్పటి నుండి నిందితుడి కోసం సి.సి.ఎస్. పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారన్నారు. సిసిఎస్ పోలీసులు చేసిన కృషి ఫలితంగా పరారీలో ఉన్న నిందితుడు రుద్రపంక్తి మధును కందివలస సంత వద్ద అదుపులోకి తీసుకొని, అతని వద్ద నుండి రూ. 12.10 లక్షల నగదు, రూ.5 లక్షల విలువైన బంగారు వస్తువులను రికవరీ చేసి, విచారణ చేపట్టారన్నారు. విచారణలో నిందితుడు రుద్రపంక్తి మధు ఇచ్చిన సమాచారం మేరకు దోచుకున్న డబ్బులలో రూ. 5లక్షలు ఖర్చు చేసి బంగారు వస్తువులను కొనుగోలు చేసినట్లు, మిగిలిన సొమ్మును తన జల్సాలకు ఖర్చు చేసినట్లు, ఇంకనూ మిగిలిన సొమ్ముతో భూమి కొనుగోలు చేసేందుకు వెళ్ళుతుండగా పోలీసులకు పట్టుబడినట్లు, ఈ నేరం చేసేందుకు తనతో పథకాన్ని రూపొందించినది దారపు గోపాలకృష్ణ అనే లాయరని వెల్లడించారు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు దారపు గోపాలకృష్ణ అనే లాయరును కూడా అరెస్టు చేసి, అతని వద్ద నుండి రూ.5.25 లక్షలను రికవరీ చేసినట్లుగా తెలిపారు. విచారణలో నిందితులు రుద్రపంక్తి మధు, దారపు గోపాలకృష్ణ పథక రచన చేసి ఎక్కువ మొత్తంలో నగదు తీసుకొని విశాఖపట్నం నుండి పర్లాకిమిడి వచ్చే కోట్ల వంశీకృష్ణ వద్ద నుండి డబ్బులు దోచుకోవాలని భావించి, రోబరీకి పాల్పడినట్లు, దోచుకున్న మొత్తంలో సహాయపడిన నిందితులకు రూ.10 లక్షలను పంచి, చెరో రూ. 20 లక్షలు తీసుకొని పరారైనట్లుగా వెల్లడించారని తెలిపారు. ఈ కేసులో ఎంతో శ్రమించి, ప్రధాన నిందితులన అరెస్టు చేయుటలో ప్రతిభ కనబర్చిన విజయనగరం డిఎస్పీ ఆర్. గోవిందరావు, సిసిఎస్ సిఐ ఎ.సత్యన్నారాయణ, ఎస్ఐ బి. భాగ్యం, ఎఎస్ఐ ఎ. గౌరీ శంకర్, హెడ్ కానిస్టేబుళ్ళు ఎం.రామకృష్ణారావు, డి. శ్రీనివాసరావులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ అభినందించి, ప్రోత్సాహక నగదు బహుమతులను అందజేసారు. ఈ మీడియా సమావేశంలో విజయనగరం డిఎస్పీ ఆర్. గోవిందరావు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఎ.సత్యన్నారాయణ, ఎస్బి సిఐ ఈ. నర్సింహమూర్తి, సిసిఎస్ ఎస్ఐ బి.భాగ్యం మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. (Story : హైవే రోబరీకి పాల్పడిన నిందితులను అరెస్టు చేసిన సిసిఎస్ పోలీసులు)