దోమల నివారణ పై విస్తృత అవగాహన కల్పించాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి :గ్రామాల్లో పరిశుభ్రత దోమల నివారణ పై విస్తృత అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ ఆదేశించారు. శుక్రవారం డ్రై డే సందర్భంగా రెవల్లి, గోపాల పేట మండలాల్లో పర్యటించి గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించారు. రేవల్లి మండలంలోని పాత తండా, తల్పనూర్, నాగపూర్, బండ్రాయిపాకుల గ్రామాలను సందర్శించి డ్రైడే నిర్వహణ కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో మురుగు కాలువల పూడిక ఎప్పటికప్పుడు తీస్తూ మురుగు నీరు సజావుగా పారే విధంగా చూసుకోవాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని దోమల నివారణ కు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాకాలంలో బయట పడిఉన్న కొబ్బరి చిప్పలు, పాత టైర్లు, మూతలు పడేయడం వల్ల వాటిలో నిలిచే కొద్దిపాటి వర్షం నీళ్ల లో డెంగ్యూ దోమలు గుడ్లు పెట్టీ వాటి సంతానం వ్యాప్తి చెందిస్తాయన్నారు. అందువల్ల వాటిని లేకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కాలువలు శుభ్రం చేసి సంబంధిత రిజిస్టర్ లో నమోదు చేయాలని అదేవిధంగా మంచి నీటి ట్యాంక్ ఎప్పటికప్పుడు శుభ్రం చేయించి రిజిస్టరు లో నమోదు చేయాలన్నారు. గ్రామపంచాయతీ లో రిజిస్టర్లను తనిఖీ చేశారు.
అనంతరం వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా గోపాల్ పేట మండలంలోని జడ్పి హైస్కూల్లో మొక్కలు నాటారు. కస్తూర్బా గాంధీ పాఠశాలను సందర్శించి సదుపాయాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదనపు కలెక్టర్ వెంట రేవల్లి మండల ప్రత్యేక అధికారి సుధీర్ రెడ్డి, ఎంపిడిఓ శంకర్ నాయక్, ఏపీఓ, పంచాయతీ సెక్రటరీ లు తదితరులు పాల్గొన్నారు. (Story : దోమల నివారణ పై విస్తృత అవగాహన కల్పించాలి)