కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీరని ద్రోహం
బడ్జెట్ ప్రతులను దహనం చేసి సిపిఐ నిరసన
న్యూస్‌తెలుగు/వనపర్తి :కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు నిధుల కేటాయింపులు వివక్షకు నిరసనగా సిపిఐ వనపర్తి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రం అంబేద్కర్ చౌక్ లో కేంద్ర బడ్జెట్ ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పదవులకు రాజీనామా చేయాలని, బడ్జెట్ను సవరించి, విభజన హామీల అమలుకు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. బిజెపి బడ్జెట్ తీరు సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీహరి, సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జే చంద్రయ్య, భారత జాతీయ మహిళా సమాఖ్య ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షురాలు పి కళావతమ్మ తదితరులు మాట్లాడారు. రూ.48 లక్షల కోట్ల బడ్జెట్ లో తెలంగాణకు నిధులను కేటాయించకుండా బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీరని ద్రోహం చేసిందన్నారు. బీహార్ కు రూ. 26 వేల కోట్లు, ఆంధ్రప్రదేశ్లో ఒక పోలవరం ప్రాజెక్టుకే 15 వేల కోట్లు కేటాయించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు మొండి చేయి చూశారన్నారు. రాష్ట్ర విభజన హామీలు బయ్యారం స్టీల్ ప్లాంట్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, తదితర విభజన హామీలకు నిధులు కేటాయించలేదన్నారు. మాచర్ల వయా వనపర్తి గద్వాల రైల్వే లైన్ కు కూడా బడ్జెట్లో కేటాయింపులు లేవన్నారు. బిజెపికి తెలంగాణ 8 మంది ఎంపీలను ఇచ్చిందని, వారి మద్దతుతోనే నరేంద్ర మోడీ అధికారంలో ఉన్నారని, నిధుల కేటాయింపులో వివక్ష చూపి వారి నమ్మకం పై దెబ్బ కొట్టారన్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే పార్లమెంటు సాక్షిగా నరేంద్ర మోడీ తప్పు పట్టారని, అదే వరవడి నిధుల కేటాయింపులో కనిపించిందన్నారు. తెలంగాణకు నిధులు రాబట్టడంలో ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని, నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బిజెపి ఎంపీలు తెలంగాణపై వివక్షకు నిరసనగా గళం ఎత్తాలన్నారు. పేదల రైతుల మహిళల నిరుద్యోగుల యువకుల వ్యతిరేక, కార్పొరేట్ శక్తులకు అనుకూల బడ్జెట్ను కేంద్రం ప్రవేశపెట్టిందని, బడ్జెట్లో సవరించకుంటే ప్రజల్లో బిజెపి విధానాన్ని ఎండగడతామని హెచ్చరించారు. సిపిఐ, ఏఐవైఎఫ్, మహిళా సమాఖ్య, వ్యవసాయ కార్మిక సంఘం, ఏఐటియుసి నాయకులు రాజనగరం కృష్ణయ్య, ఎత్తం మహేష్, బొలెమాని నాగన్న, రాములు, చిలక కృష్ణయ్య, k కురుమయ్య.వెంకటేష్. చంద్రశేఖర్.మోహన్ యాదవ్.లింగ స్వామి.అశోక్.సునీత తదితరులు పాల్గొన్నారు. (Story : కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీరని ద్రోహం)