Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ అనుమ‌తి లేని వాట‌ర్‌ ప్లాంట్ల సీజ్‌

అనుమ‌తి లేని వాట‌ర్‌ ప్లాంట్ల సీజ్‌

0

అనుమ‌తి లేని వాట‌ర్‌ ప్లాంట్ల సీజ్‌

తాసిల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు ఆధ్వర్యంలో సోదాలు

సుర‌క్షిత త్రాగునీరు అందించేందుకు క‌లెక్ట‌ర్ చ‌ర్య‌లు

అన్ని అనుమతులు ఉన్న ప్లాంట్లు 17 మాత్రమే

ట్రస్టులు పేరుతో జోరుగా విక్రయాలు

న్యూస్‌తెలుగు/విజయనగరం : జిల్లా ప్ర‌జ‌ల‌కు సుర‌క్షిత త్రాగునీటిని అందించ‌డానికి క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్ శ్రీ‌కారం చుట్టారు. దీనిలో భాగంగా అన‌ధికారిక ఆర్ఓ వాట‌ర్ ప్లాంట్ల‌పై దృష్టి సారించారు. జిల్లాలో అన్ని వాట‌ర్ ప్లాంట్ల‌ను త‌నిఖీ చేయాల‌ని ఆదేశించారు. దీంతో ఈ ప్ర‌క్రియ జిల్లా వ్యాప్తంగా సోమ‌వారం నుంచి మొద‌ల‌య్యింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాట‌ర్ ప్లాంట్ల‌ను తాశిల్దార్లు, ఆర్‌డ‌బ్ల్యూఎస్ అధికారులు త‌నిఖీలు చేశారు. మున్సిప‌ల్ ప్రాంతాల్లో క‌మిష‌న‌ర్ల ఆధ్వ‌ర్యంలో ఈ త‌నిఖీలు కొన‌సాగుతున్నాయి. మంగ‌ళ‌వారం నాటికి అన్ని ప్లాంట్ల‌ను త‌నిఖీ చేసి, నివేదిక అంద‌జేయాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించ‌డంతో, ప్ర‌స్తుతం మున్సిప‌ల్ యంత్రాంగాలు ఈ ప్ర‌క్రియ‌లో నిమ‌గ్న‌మై ఉన్నాయి.

జిల్లాలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్, ఫుడ్ సేఫ్టీ వారి నుంచి అనుమతి పొందిన ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంటు కేవలం 17 ఉన్నాయి. ఈ ప్లాంటు ప్రభుత్వ నిబంధనలు ప్రకారం నిర్వహిస్తున్నారు. ఇవి కాకుండా మరో 63 ప్లాంటు ఎటువంటి అనుమతులు లేకుండానే నీటిని ప్యాక్ చేసి, ప్యాకెట్లు, లీటరు బాటిల్లలో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఇటువంటి ఆర్వో ప్లాంట్లపై ఇప్పుడు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు చర్యలకు ఉపక్రమించారు. అనుమతి లేని ప్లాంట్ల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ట్రస్ట్ ల పేరుతో చాలా చోట్ల వాటర్ ప్లాంటు నిర్వహిస్తున్నారు. వీరు 20 లీటర్ల క్యాన్లతో త్రాగు నీటిని విక్రయిస్తున్నారు. ఇంటింటికి కూడా ఈ క్యాన్లలో నీటిని సరఫరా చేస్తున్నారు. ఇలా లక్షల రూపాయల నీటి వ్యాపారం జరుగుతుంది. వాస్తవానికి ట్రస్టుల ద్వారా ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేసి నీటిని విక్రయించేవారు, క్యాన్లలో నీటిని సరఫరా చేయకూడదు. ప్లాంటు వద్ద నామమాత్రపు రుసుం తీసుకొని, వినియోగదారులు తెచ్చుకున్న పాత్రలో నీటిని నింపి ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి సేవా దృక్పథంతో నిర్వహిస్తున్న ఆర్వో ప్లాంట్లు తక్కువగానే ఉన్నాయి.

జిల్లా క‌లెక్ట‌ర్ అంబేద్క‌ర్‌ ఆదేశాల మేర‌కు ఆర్ఓ ప్లాంట్ల‌ను త‌నిఖీ చేయ‌గా, అన‌ధికారికంగా నిర్వ‌హిస్తున్న ప‌లు వాట‌ర్ ప్లాంట్లు బ‌య‌ట‌ప‌డ్డాయి. కేవ‌లం ఆర్‌డ‌బ్ల్యూఎస్ అధికారులే మొత్తం 31 వాట‌ర్ ప్లాంట్ల‌ను త‌నిఖీ చేయ‌గా, వీటిలో 4 ప్లాంట్ల‌కు మాత్ర‌మే అనుమ‌తి ఉన్న‌ట్లు తేలింది. అనుమ‌తులు లేని వాటిని రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ఇలా ప్ర‌తీ మండ‌లంలో తాశిల్దార్ల ఆధ్వర్యంలో చేసిన త‌నిఖీల్లో, ఎక్కువ ప్లాంట్లు అన‌ధికారికంగా ప్యాకేజ్ వాటర్ ను విక్రయిస్తున్నట్లు తేలింది. వీట‌న్నిటిపైనా అధికారులు చ‌ర్య‌లు తీసుకోనున్నారు. దీనిలో భాగంగా ఆయా ప్లాంట్లు ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా తక్ష‌ణ‌మే అన్ని ర‌కాల‌ అనుమ‌తులను తీసుకోవాల‌ని, ఆ త‌రువాతే ప్లాంట్ల‌ను నిర్వ‌హించాల‌ని, అంత‌వ‌ర‌కు నీటి విక్ర‌యాల‌ను ఆపివేయాల‌ని య‌జ‌మానుల‌కు నోటీసులు ఇచ్చారు. కొన్ని ప్లాంట్లు ఇత‌ర శాఖ‌ల అనుమ‌తులు తీసుకున్ప‌ప్ప‌టికీ, జిల్లాలో కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి నుంచి అనుమతి తీసుకోలేదు. ఉదాహ‌ర‌ణ‌కు కొత్త‌వ‌ల‌స మండ‌లంలో మొత్తం 12 ఆర్ఓ ప్లాంట్ల‌ను త‌నిఖీ చేయ‌గా, వాటిలో 9 ప్లాంట్ల‌కు అనుమ‌తులు లేవ‌ని తేలింది. బొండ‌ప‌ల్లి మండ‌లంలో ప‌ది వాట‌ర్ ప్లాంట్ల‌ను త‌నిఖీ చేసి, అన్నిటికీ కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి నుంచి అనుమ‌తులు తీసుకోవాల‌ని అధికారులు ఆదేశించారు.

సురక్షిత నీటిని మాత్రమే అందించాలి:కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్
ఆర్వో ప్లాంట్ల ద్వారా ప్రజలకు సురక్షిత త్రాగునీరు మాత్రమే అందించాలి. ప్లాంటుకు ప్రభుత్వ నిభందనలు ప్రకారం అనుమతులు తప్పనిసరి. అనుమతులు లేని ఆర్వో ప్లాంట్లను మూసివేస్తామని తెలిపారు. (Story : అనుమ‌తి లేని వాట‌ర్‌ ప్లాంట్ల సీజ్‌)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version