రోడ్డుపై వరినాట్లు వేస్తూ నిరసన
న్యూస్‌తెలుగు/కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా :చింతలమానెపల్లి మండలం డబ్బా గ్రామ పంచాయతీ పరిధిలో బారెగూడ గ్రామంలో సైడ్ డ్రైనేజీలు లేకపోవడంతో రోడ్డుపై నిలిచిన వరదనీరు, బురదతో గ్రామంలో దుర్వాసన వస్తుందని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.
పేరుకుపోయిన బురద దుర్వాసనతో రోగాల బారిన పడుతున్నామని, అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, రోడ్డుపై వరినాట్లు వేస్తూ గ్రామస్థులు నిరసన చేపట్టారు.
గ్రామంలో సైడ్ డ్రైనేజీలు లేకపోవడంతో రోడ్లపై వర్షపు నీరు అధికంగా చేరి, చెత్తా చెదారం పేరుకుపోయి రోడ్లపై బురద, పాములు, కప్పలు, దోమలు, ఈగలు గుడ్లు పెట్టీ దుర్వాసనతో చిన్నారులు రోగాల బారిన పడుతున్నారని ఆందోళన చెందుతున్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నామని , పాలకులకు, అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకున్న పాపాన పోలేదని గ్రామస్థులు అవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా ప్రజా ప్రతినిదులు మారినా అధికారులు మారినా ప్రజల తలరాతలు మారడం లేదని గ్రామస్థులు అవేదన చెందుతున్నారు. (Story : రోడ్డుపై వరినాట్లు వేస్తూ నిరసన)