కష్టపడితే ఉత్తమ ఫలితాలను సాధించవచ్చు
ఎమ్మెల్సీ పి.రఘువర్మ రాజు
న్యూస్‌తెలుగు/విజయనగరం :
ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని,కష్టపడి చదివితే ఉత్తమ ఫలితాలను సాధించవచ్చని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మరాజు అన్నారు. చైతన్య యువజన సేవా సంఘం వ్యవస్థాపకులు మజ్జి కాంతారావు ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక కనపాకలో 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ రఘువర్మరాజు మాట్లాడుతూ విద్యార్థులు కష్టంతో పాటు ఇష్టంగా,ప్రణాళిక బద్ధంగా చదివితే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను పొందుతారని తెలిపారు. ఎన్నారై జూనియర్ కళాశాల సీఈవో ఎం.రాంబాబు మాట్లాడుతూ పుట్టుకతో ఎవరూ గొప్పవారు కాదని, ఒక లక్ష్యంతో ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగితే సమాజంలో ఒక మంచి గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. అనంతరం 500 మార్కులకు పైగా సాధించిన 18 మంది విద్యార్థులకు నగదు బహుమతులను,ఉత్తమ ఫలితాలు సాధించిన 45 మంది 10వ తరగతి విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎంవిఎన్ వెంకట్రావు, రఘు ఇంజనీరింగ్ కళాశాల సీఏవో ఏఎస్ ప్రకాష్ రావు,అయ్యప్ప కన్స్ట్రక్షన్స్ అధినేత మజ్జి ఆదిబాబు, ఎన్నారై జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, మజ్జి నల్ల సూరి, మజ్జి గణేష్, దీప్తి, పైడ్రాజు, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. (Story : కష్టపడితే ఉత్తమ ఫలితాలను సాధించవచ్చు)