ఒకే సారి రెండు లక్షల లోపు రైతు రుణమాఫీ చేసి చరిత్ర దేశంలో ఏదీ లేదు
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
న్యూస్ తెలుగు/నల్లగొండ బ్యూరో : ఒకేసారి 31 వేల కోట్ల రూపాయలు రెండు లక్షల లోపు రైతు రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించిన రాష్ట్రం దేశంలో ఏదీ లేదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల రూపాయల లోపు బ్యాంకు రుణాలు ఉన్న రైతుల రుణాలను మాఫీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసిన నేపథ్యంలో మొదటి విడత లక్ష రూపాయల లోపు రుణాల నిధుల విడుదల సందర్బంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని రైతు వేదికలో నిధుల విడుదల కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది.ఇందులో భాగంగా నల్గొండ జిల్లా కేంద్రంలో ఎం ఎన్ ఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుండి ఆయా జిల్లాల లోని రైతులతో రుణమాఫీపై ముఖాముఖి మాట్లాడారు. నల్గొండ జిల్లా, తిప్పర్తి మండలానికి చెందిన రాజు అనే రైతుతో సైతం రాష్ట్ర ముఖ్యమంత్రి రుణమాఫీ పై మాట్లాడారు.ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ సందర్భంగా నిర్వహిస్తున్న సదస్సులో భాగంగా 5 కిలోమీటర్ల మేర నల్గొండ జిల్లా కేంద్రంలో ర్యాలీ తీయడం జరిగిందని, తనే స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ వేదిక వద్దకు రాగా, వేలాది మంది రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చారని తెలిపారు. రైతు రుణమాఫీ ద్వారా నల్గొండ జిల్లాలో 83121 మంది రైతుల బ్యాంకు ఖాతాలలో 78,757 కుటుంబాలకు రుణమాఫీ జరిగిందని, 481.63 కోట్ల రూపాయలు ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం నల్గొండ జిల్లాకు కేటాయించిందని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం 31 వేల కోట్ల రూపాయల రైతుల రుణాలు మాఫీ చేయడం దేశ చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో చేసిన సాహసోపేత కార్యక్రమం అన్నారు. రైతులు అప్పులపాలు కాకూడదన్న ఉద్దేశంతోనే రుణమాఫీ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. పేదవాడికి, ఆపదలో ఉన్న వాడికి ,ప్రజలకు ఎల్లప్పుడూ తను అండగా ఉంటానని, రుణ మాఫీ కింద అత్యధికంగా నల్గొండ జిల్లాకు 481.63 కోట్ల రూపాయలు రాష్ట్రంలోనే అత్యధికంగా ఎక్కువ మొత్తంలో నిధులు వచ్చింది నల్గొండ జిల్లాకే నని, రాబోయే రోజులలో వివిధ పథకాల కింద మరిన్ని ఎక్కువ నిధులు తీసుకువచ్చి జిల్లా ప్రజలకు అండగా ఉంటానని తెలిపారు. రుణమాఫీకి సంబంధించి రైతుల ఖాతాలలో నిధులు జమ కాకపోయినా, లేదా ఎవరైనా బ్యాంకరు పాత బాకీ కింద జమ చేసుకున్న నేరుగా తనకు గాని, జిల్లా కలెక్టర్ కు గాని ఫోన్ చేయవచ్చని మంత్రి వెల్లడించారు. మరో వారం రోజుల్లో లక్షన్నర లోపు రుణాలు ఉన్న వారి రైతుల రుణాలు మాఫీ అయితాయని,, ఆ తర్వాత వారంలో 2 లక్షల వరకు రుణాలు ఉన్న రైతుల రుణమాఫీ చేయడం జరుగుతుందని, ఆగస్టు చివరినాటికి రెండు లక్షల లోపు రుణాలు ఉన్న రైతులందరి రుణాలను మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పన ,తరగతి గదుల నిర్మాణం వంటి వాటికీ 60 కోట్ల రూపాయలతో పనులు చేపట్టడం జరిగిందని, అన్ని పాఠశాలల్లో డిజిటల్ తరగతుల నిర్వహణకు సమాలోచన చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.ఎస్ ఎల్ బి సి సొరంగం , బ్రాహ్మణ వెల్లేముల ప్రాజెక్టు పూర్తి కోసం గ్రీన్ ఛానల్ లో నిధులను పెట్టించి 26 నెలల్లో పనులు పూర్తిచేసేలా రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని మంత్రి వెల్లడించారు.జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రైతు పంట రుణాల మాఫీలో భాగంగా లక్ష రూపాయల లోపు రుణాలు ఉన్న రైతులందరికీ ఈరోజే వారి బ్యాంకు ఖాతాలలో నిధులు జమ అవుతాయని తెలిపారు. ఈ విషయమై గురువారం ఉదయమే బ్యాంకర్లతో సమావేశం నిర్వహించడం జరిగిందని, లక్ష వరకు రుణమాఫీ ఖాతాలలో జమ చేయాలని ఎట్టి పరిస్థితులలో రైతు రుణమాఫీ నిధులను ఇతర లోన్లకు పట్టుకోవద్దని స్పష్టం చేశామని, నేరుగా రైతుల ఖాతాలోని వేయాలని, రైతులను ఇబ్బందులు పెట్టవద్దని కోరినట్లు తెలిపారు. ఏదైనా సాంకేతిక సమస్య వల్ల రైతుల ఖాతాలలో నిధులు జమ కానట్లయితే జిల్లా స్థాయిలో ఐదు మంది అధికారులతో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయడం జరిగిందని ,ఆ సెల్ లో ఏర్పాటు చేసిన సెల్ ఫోన్ నెంబర్ 7288800023 నంబర్ కు ఫోన్ ద్వారా సంప్రదించాలని ఆయన కోరారు. వచ్చే సోమవారం నుండి వారం రోజులపాటు రుణమాఫీ పొందిన రైతుల రుణాలను రెన్యువల్ చేసే స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టాలని బ్యాంకర్లతో కోరినట్లు ఆయన వెల్లడించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, మాజీ జెడ్పిటిసి ,మార్కెట్ కమిటీ చైర్మన్,ఇతర ప్రజా ప్రతినిధులు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్, వ్యవసాయ అధికారులు, తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. (Story : ఒకే సారి రెండు లక్షల లోపు రైతు రుణమాఫీ చేసి చరిత్ర దేశంలో ఏదీ లేదు)