వివాదాస్పద ఏపీ భూ హక్కు చట్టాన్ని ఎందుకు రద్దు చేశారో తెలుసా?
న్యూస్ తెలుగు/అమరావతి: వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ -2022ను అమల్లోకి తీసుకువచ్చారు. అయితే ఇది కేంద్ర ప్రభుత్వ ఒత్తిడితోనే తీసుకువచ్చామని వైఎస్ఆర్‌సీపీ చెపుతూ వచ్చింది. కానీ కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం అందుకు విరుద్ధమైన ప్రకటన చేసి తప్పించుకున్నది. భూ హక్కు చట్టాన్ని తీసుకురావాలని కోరామా తప్ప ఇలాంటి నీచమైన చట్టాన్ని అమలు చేయాలని తాము ఏనాడూ కోరలేదని ఎన్‌డీఏ ప్రతినిధులు ప్రకటించి స్పష్టత ఇచ్చారు. ఏదేమైనప్పటికీ, ఈ చట్టంపై ఏపీ ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. దీంతో ఈ చట్టాన్ని రద్దు చేస్తామని టీడీపీ, జనసేన ఎన్నికల హామీ ఇచ్చాయి. అందుకు అనుగుణంగానే అధికారంలోకి రాగానే టీడీపీ ప్రభుత్వం మంగళవారం క్యాబినెట్ సమావేశంలో ఇందుకు సంబంధించి ఏకగ్రీవ తీర్మానం చేసింది. భూ హక్కు చట్టాన్ని రద్దు చేస్తూ తీర్మానం చేసింది. ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. ఇంతకీ టీడీపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని ఎందుకు రద్దు చేసిందో తెలుసా? అందుకు గల కారణాలను ప్రభుత్వం స్పష్టంగా వెల్లడించింది.
భూ హక్కు చట్టం రద్దుకు కారణాలేమిటంటే?
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ -2022 పై ప్రజలకు పలు సందేహాలు, అనుమానాలు, భయాలు ఉన్నాయన్న విషయం పలు పత్రికలు, ఇతర మీడియా సంస్థల ద్వారా తేటతెల్లమైందని ల్యాండ్ టైటిలింగ్ అథారిటీ తెలిపింది. దీంతో ఈ చట్టాన్ని రద్దు పర్చాలని భూయజమానుల నుండి తీవ్రస్థాయిలో ఒత్తిడి మొదలైంది.
ఈ చట్టాన్ని రద్దు పరచడానికి ఏపీ టైటిలింగ్ అథారిటీ ప్రస్తావించిన కారణాలు :
నీతి ఆయోగ్ రూపొందించిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం టీఆర్ వో గా ప్రభుత్వ అధికారి ఉండాలి. కానీ ఆ స్థానంలో గత ప్రభుత్వం ఎటువంటి అర్హత లేని వ్యక్తులను కూర్చోబెట్టేందుకు అవకాశం కల్పించే విధంగా మార్పులు చేసింది.
ఈ యాక్ట్ ప్రకారం సివిల్ కోర్టుల ప్రమేయం పూర్తిగా తుడిచివేయబడుతుంది. టీఆర్ వో దగ్గర సమస్య ఉత్పన్నమైతే నేరుగా వ్యయప్రయాసలకోర్చి హైకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి.
టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారులు చేసే వారసత్వ ఆస్తుల బదలాయింపులు సివిల్ కోర్టుల ద్వారా చేయబడవు.
ఈ చట్టం అమల్లోకి వస్తే ప్రస్తుత ఉన్న రిజిస్ట్రేషన్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ మరియు న్యాయ వ్యవస్థ కనుమరుగయ్యే పరిస్థితి.
ఈ చట్టం చాలా హడావిడిగా స్టేక్ హోల్డర్స్ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా చేయబడింది
ఈ చట్టం ద్వారా రిజిస్ట్రేషన్ పొందిన భూయజమానికి జిరాక్స్ కాపీలు మాత్రమే ఇస్తారు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ సదరు టీఆర్ వో వద్దే ఉంటాయి. దీని వల్ల ప్రభుత్వం సదరు ఆస్తులను తనఖా పెట్టుకునే అవకాశం ఉందని భూయజమానులు భయాందోళనకు గురయ్యారు.
ఇది ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా చేస్తుందని భూ యజమానులు సంఘ విద్రోహ శక్తుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడేలా చేస్తుంది.
టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (టీఆర్ వో)లు జారీ చేసే జనరల్ పవర్ ఆఫ్ అటార్ని (జీపీఏ) లు భూయజమానులను ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంది. ఎలాంటి శిక్షణ, అవగాహన లేని టైటిలింగ్ రిజిస్ట్రేషన్ అధికారుల వల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మరిన్ని అవరోధాలు, గొడవలు ఉత్పన్నమయ్యే పరిస్థితి.
టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారులు, టైటిల్ అప్పిలేట్ అధికారులు స్థానిక రాజకీయ నాయకుల ఒత్తిడికి తలొగ్గి వారి ఇష్టాయిష్టాలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ లు, మ్యూటేషన్ లు చేసే పరిస్థితి దాపురించే అవకాశం.
ఈ నేపథ్యంలో ప్రజలకు ఈ చట్టంపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత కేబినెట్, ప్రజా ప్రతినిధులు మరియు మనందరిపైన ఉందని ముఖ్యమంత్రి సూచించారు. (Story: వివాదాస్పద ఏపీ భూ హక్కు చట్టాన్ని ఎందుకు రద్దు చేశారో తెలుసా?)