జిల్లా సర్వజన ఆసుపత్రి అభివృద్దికి చర్యలు
6కెవి ఆక్సీజన్ ట్యాంకు ఏర్పాటు
కొత్తగా రెండు మరుగుదొడ్ల సముదాయాలు
అందుబాటులోకి వచ్చిన ఎంఆర్ఐ స్కానింగ్
ఎంపి నిధులతో ఘోషా ఆసుపత్రిలో లిఫ్ట్
మహారాజా సర్వజన ఆసుపత్రిగా పేరు మార్పునకు ప్రతిపాదన
జిజిహెచ్ అభివృద్దికమిటీ సమావేశాంలో నిర్ణయాలు
న్యూస్‌తెలుగు/ విజయనగరం : విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి అభివృద్ది దిశగా అడుగులు వేస్తోంది. ఈ ఆసుపత్రి ద్వారా రోగులకు అందుతున్న సేవలను మరింత మెరుగు పర్చాలని, అదనపు సౌకర్యాలు కల్పించాలని ఆసుపత్రి అభివృద్ది కమిటీ నిర్ణయించింది. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిజిహెచ్ అభివృద్ది కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. జిల్లా సర్వజన ఆసుపత్రి, ఘోషా ఆసుపత్రుల్లోని సమస్యలు, అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలను, విజయనగరం ఎంఎల్ఏ పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు కమిటీ ముందు ఉంచారు. వీటిపై చర్చించి, ఆసుపత్రి అభివృద్దికి పలు నిర్ణయాలు తీసుకున్నారు.
సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ, ఇటీవల మరమ్మతుకు గురైన ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్ సిద్దమై రోగులకు అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. ఆసుపత్రి ఆవరణలో కొత్తగా మరో బోరు వేయడానికి జిల్లా కలెక్టర్ నిధులను మంజూరు చేస్తూ, వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. స్వచ్చాంధ్ర కార్పొరేషన్ నుంచి కొత్తగా రెండు మరుగుదొడ్ల సముదాయాలను మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. సోలార్ పవర్ యూనిట్ సామర్ధ్యాన్ని 150 నుంచి 300 కిలోవాట్లకు పెంచడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆసుపత్రిలో సిబ్బంది కొరతను అధిగమించేందుకు, వార్డు సచివాలయాల నుంచి ఐదుగురు ఇంజనీరింగ్ అసిస్టెంట్లను డిప్యుటేషన్‌పై తక్షణమే పంపించాలని మున్సిపల్ కమిషనర్‌ను కలెక్టర్ ఆదేశించారు. ఆసుపత్రిలో అదనంగా 6 కెవి ఆక్సీజన్ ట్యాంకును ఏర్పాటు చేసి, మొత్తం 257 పడకలకూ పైప్‌లైన్ వేయాలని నిర్ణయించారు. సుమారు 2.5లక్షల వ్యయంతో 20 స్ట్రెచర్‌లు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఈ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఘోషాసుపత్రిలో ఎంపి నిధులు రూ.31లక్షలతో కొత్తగా భారీ లిఫ్ట్‌ను ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. ఇక్కడి రక్తనిల్వ కేంద్రాన్ని అభివృద్ది చేయాలని, సామర్ధ్యాన్ని పెంచాలని నిర్ణయించారు. ఫార్మసీ విభాగంలో కొత్తగా ఫ్రిజ్, ఎసి సదుపాయం కల్పించడానికి నిర్ణయించారు.పే వార్డుల్లోని ఛార్జీలను పెంచాలని అధికారులు ప్రతిపాదించగా, ఎంఎల్ఏ అదితి కోరిక మేరకు ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. రెండు ఆసుపత్రుల్లో ద్విచక్ర వాహనాల పార్కింగ్, కేంటిన్, రిటైల్ మెడికల్ షాప్ నిర్వహణకు టెండర్లు పిలవాలని కలెక్టర్ ఆదేశించారు. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన బలవర్ధక ఆహార పదార్ధాలను అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రెండు ఆసుప్రతుల్లో వైద్యులు, సిబ్బందినీ తమ అనుమతి లేకుండా బదిలీ చేయవద్దని కలెక్టర్ ఆదేశించారు. దాదాపు రూ.80లక్షలతో సర్వజన ఆసుపత్రి మరమ్మతుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. జిజిహెచ్‌ను మహారాజా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిగా పేరు మార్చేందుకు, ఆసుపత్రి ఆవరణలో డాక్టర్ పివిజిరాజు విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సభ్యులు ప్రతిపాదించగా, ఈ ప్రతిపాదనలను ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపించాలని నిర్ణయించారు.ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ, ఘాషా ఆసుపత్రిలో లిఫ్ట్ ఏర్పాటు చేయడానికి ఎంపి నిధులనుంచి రూ.31లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆసుపత్రి ప్రాంగణంలో పివిజి రాజు విగ్రహం ఏర్పాటుకు తన సొంత నిధులను వెచ్చించేందుకు ముందుకు వచ్చారు. తమది ప్రజాప్రభుత్వమని, ప్రజల సంక్షేమమే తమకు ముఖ్యమని ఎంపి పేర్కొన్నారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి, ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని ఎంపి కోరారు.
సమావేశంలో డిఆర్ఓ ఎం.సుమబాల, జిజిహెచ్ సూపరింటిండెంట్ డాక్టర్ అప్పలనాయుడు, డిఎంఅండ్‌హెచ్ఓ డాక్టర్ ఎస్.భాస్కరరావు, డిసిహెచ్ఎస్ డాక్టర్ గౌరీ శంకర్, మున్సిపల్ కమిషనర్ ఎం.మల్లయ్యనాయుడు, వైద్యకళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత, కమిటీ సభ్యులు డాక్టర్ విఎస్ ప్రసాద్ తదితరులు, పాల్గొన్నారు. (Story : జిల్లా సర్వజన ఆసుపత్రి అభివృద్దికి చర్యలు)