పర్యాటక రంగం అభివృద్ధికి చర్యలు
జిల్లా కలెక్టర్ వెంకట మురళి
న్యూస్‌తెలుగు/ బాపట్ల : నిజాంపట్నంలో పర్యాటక రంగం, ఆక్వా రంగం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి చెప్పారు. సూర్యలంక ఆదర్శనగర్ బ్రిడ్జి వద్ద నుంచి నిజాంపట్నం హార్బర్ వరకు బకింగ్ హామ్ కెనాల్ లో 14 కిలోమీటర్ల మేర మోటరైజ్డ్ బోట్ లో జిల్లా కలెక్టర్ ఆదివారం విస్తృతంగా పర్యటించారు. మత్స్యకారుల వేట ప్రక్రియ, స్థితిగతులు, నిజాంపట్నం హార్బర్ నిర్మాణ పనులు, ఆక్వా పార్కు ప్రతిపాదిత అభివృద్ధి ప్రాంతాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. హార్బర్ లో బోట్లు నిలుపుదల చేసే జెట్టి, మత్స్య సంపద గ్రేడింగ్ చేసి ప్రాంతాలను ఆయన పరిశీలించారు మత్స్య శాఖ అధికారులు, మత్స్యకారులతో ఆయన మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
సముద్రంలోని వనరులు అందుబాటులోకి తెచ్చి మత్స్య సంపదను అభివృద్ధి చేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. పర్యాటక రంగం అభివృద్ధికి చాలా అనువైన ప్రాంతం అని ఆయన చెప్పారు. పర్యాటక రంగ అభివృద్ధికి అన్ని వనరులు అందుబాటులో ఉండగా మడ అడవుల పరిశీలన కొరకు వచ్చామన్నారు. 192 ఎకరాలలో ఆక్వా పార్కు అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. పార్కు అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతం ఎంతో ప్రాచుర్యం పొందుతుందని వివరించారు. 100 ఎకరాల భూమి పార్కు కొరకు కేటాయించేలా ప్రభుత్వం నుంచి అధికారిక అనుమతి రావాల్సి ఉందన్నారు. ఈ అంశంపై రెవెన్యూ మంత్రితో మాట్లాడామని, ఆయన సానుకూలంగా స్పందించి తక్షణమే అంగీకారం తెలిపారన్నారు. అనుమతి రాగానే అభివృద్ధి పనులు ప్రారంభమవుతాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్దేశాలను అనుసరించి అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. నిజాంపట్నం హార్బర్ లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, 2.5 హెక్టార్ల అటవీ భూమిని భూ సేకరణ చేయాల్సి ఉందన్నారు. అలాగే గుంటూరు జిల్లా దుర్గికి 90 ఎకరాలు ఇస్తే 100 ఎకరాలు బాపట్ల జిల్లాలో వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. బాపట్ల జిల్లాలో బీచ్ ల వద్ద మరణాలు పూర్తిగా అరికట్టేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ అన్నారు. ఇప్పటికే ఆయా తీర ప్రాంతాలలో పర్యటించి వారి పరిస్థితులను అధ్యయనం చేస్తున్నామన్నారు. మత్స్యకారుల స్థితిగతులను పరిశీలించామన్నారు. తుపాను వంటి పర్యావరణ విపత్తుల సమయంలో మత్స్యకార గ్రామాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే వ్యవస్థను క్షేత్రస్థాయిలో పరిశీలించామన్నారు. మత్స్యకార గ్రామాలలో నివాసాలు, వారి జీవనశైలి, ఆ కుటుంబాల ఆరు సుభిక్షంగా జీవించే పరిస్థితులు కల్పించనున్నామన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడటమే ముఖ్య ఉద్దేశంగా యంత్రాంగం పనిచేస్తుందన్నారు. బాపట్ల జిల్లా తీర ప్రాంతం సరిహద్దులను పరిశీలించామని ఆయన వివరించారు. మత్స్యకారుల అనుభవాలను గుర్తించామని ఆయన తెలిపారు. ఆయన వెంట మత్స్యశాఖ జిల్లా అధికారి పి సురేష్, బాపట్ల ఆర్డిఓ జి రవీందర్, మత్స్య శాఖ అధికారులు, తదితరులు ఉన్నారు. (Story :పర్యాటక రంగం అభివృద్ధికి చర్యలు)