రూ.4వేల పింఛన్ పంపిణీకి రంగం సిద్ధం
బకాయిలతో సహా ఎన్‌టిఆర్ భరోసా చెల్లింపు
ఉ. 6 గంటల నుంచే ఇంటింటి పంపిణీ ప్రారంభం
న్యూస్‌తెలుగు/విజయనగరం: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తొలి సంతకం చేసిన పింఛన్ల పెంపు సోమవారం (జులై 1) నుంచి అమల్లోకి వస్తోంది. సోమవారం ఉదయం 6 గంటలు నుంచే పెరిగిన పింఛన్ ఇంటింటి పంపిణీ ప్రారంభమవుతుంది. దీనికోసం జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లను చేసింది. సచివాలయ సిబ్బందితోపాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగులు ఇంటింటికీ వచ్చి పింఛన్ సొమ్ము పంపిణీ చేయనున్నారు. మొదటిరోజే లబ్దిదారులందరికీ పింఛన్ అందించాలన్న ఉద్దేశ్యంతో, దానికి అనుగుణంగా ప్రణాళికను రూపొందించారు.
ఎన్‌టిఆర్ భరోసాగా పేరు మారిన ఈ పథకం క్రింద చెల్లించే సామాజిక పింఛన్ మొత్తం భారీగా పెరిగింది. రూ.3వేల నుంచి ఒకేసారి రూ.4వేలకు పెరిగింది. పింఛన్ పెంపును 2024 ఏప్రెల్ నుంచీ వర్తింపజేస్తూ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేయడంతో, మూడు నెలల బకాయితో కలిపి, ఈ నెల ఒకేవిడతగా రూ.7వేలు చెల్లించనున్నారు. ఈ ఎన్‌టిఆర్ భరోసా పథకం ద్వారా జిల్లాలో 2,81,713 మంది పేదలకు లబ్ది చేకూరుతోంది.
పింఛన్ పెంపు వల్ల వృద్దులు, వితంతువులు, ఒంటరి మహిళలు, డప్పు కళాకారులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు, రంగస్థల కళాకారులు, హిజ్రాల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. వీరికి మూడు నెలల బకాయిలతో కలిపి ఈ జులై 1 నుంచి పింఛన్ అందుతుండటంతో, వీరి ఆనందానికి అవధులు లేవు. దివ్యాంగులకు ఇచ్చే పింఛన్‌ను రూ.3వేలు నుంచి, కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా రూ.6వేలకు పెంచారు. వీరికి కూడా నేటి నుంచి ఈ పెంపు వర్తిస్తుంది. పూర్తిగా అంగవైకల్యం (మంచం, కుర్చీకి పరిమితమైనవారు) ఉన్నవారికి, బోదకాలు వ్యాధిగ్రస్తులు, కిడ్నీ, కాలేయ మార్పిడి జరిగినవారికి ఇస్తున్న నెలవారీ పింఛన్‌ను రూ.5వేలు నుంచి రూ.15వేలకు పెంచారు. జిల్లాలోని మొత్తం 15 కేటగిరీలకు చెందిన 2,81,713 మంది పింఛన్ దారులకు, గత మూడు నెలల బకాయిలతో కలిపి సుమారు రూ.186.87 కోట్లు పంపిణీ చేయనున్నారు. సచివాలయ సిబ్బంది, ఇతర శాఖల ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఈ పంపిణీ జరగనుంది. దీనికోసం ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లను చేసింది. పింఛన్ పంపిణీ కార్యక్రమంలో సుమారు 5,420 మంది ప్రభుత్వ సిబ్బంది భాగస్వాములు కానున్నారు. ఒక్కో ఉద్యోగి సుమారు 50 నుంచి 60 మంది ఇళ్లకు వెళ్లి పింఛన్ అందజేస్తారు.
పంపిణీకి ఏర్పాట్లు పూర్తిః డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జిల్లా కలెక్టర్
జిల్లాలో సోమవారం ఉదయం 6 గంటలు నుంచే పింఛన్ పంపిణీ ప్రారంభమవుతుంది. దీనికోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాం. పింఛన్ సొమ్ము కూడా ఆయా అధికారులవద్ద ఇప్పటికే పంపిణీకి సిద్దంగా ఉంది. మొదటిరోజే శతశాతం పంపిణీ పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. దీనికోసం జిల్లా స్థాయిలో ఒక మోనటరింగ్ సెల్‌ను ఏర్పాటు చేసి, పింఛన్ పంపిణీని పర్యవేక్షిస్తాం. (Story: రూ.4వేల పింఛన్ పంపిణీకి రంగం సిద్ధం)