ఆరోగ్య విధాత, అభయ ప్రదాత వైద్యుడు
న్యూస్ తెలుగు/విజయనగరం: సమాజంలో వైద్యుడు ఆరోగ్య విధాతగా అభయ ప్రదాతగా నిలిచి ఉన్నారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జెసి నాయుడు పేర్కొన్నారు .ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో కంటోన్మెంట్ లో గల గురజాడ విద్యాసంస్థల నందు జరిగిన జాతీయ వైద్యుల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ, ప్రాణాపాయంలో ఉన్నవారికి సరైన చికిత్స చేసి ప్రాణాలను కాపాడే వైద్యులను భగవంతుడితో సమానంగా గౌరవిస్తారని ,తల్లిదండ్రులు జన్మనిస్తే ,వైద్యులు పునర్జన్మ ని ఇస్తారని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. డాక్టర్ అందించిన సేవ, రోగి మనోఫలకంపై శాశ్వతంగా ముద్రించబడుతుందని అన్నారు. యూరాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ జాడా , ఆర్థోపెడిక్ డాక్టర్ భూపతి మాట్లాడుతూ మందులు రోగాలను నయం చేస్తాయి గాని ,వైద్యులు మాత్రమే రోగులను నయం చేయగలరని అన్నారు. ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ జి సన్యాసమ్మ మాట్లాడుతూ ప్రాణాలను సైతం పణంగా పెట్టి కోవిడ్ సమయంలో సేవలందించిన వైద్యుల విధి నిర్వహణ గురించి వైద్యుల చిత్తశుద్ధి గురించి ప్రస్తావించారు.సంఘం జిల్లా శాఖ అధ్యక్ష కార్యదర్శులు సముద్రాల గురు ప్రసాద్, సుభద్ర దేవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైద్యులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన క్విజ్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శేఖర్, రచయిత కాగుపాటి నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. (Story: ఆరోగ్య విధాత, అభయ ప్రదాత వైద్యుడు)