భూసేకరణ చెల్లింపులు వేగంగా జరగాలి
విజయనగరం జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్. అంబేద్కర్
న్యూస్ తెలుగు/విజయనగరంః జిల్లాలో పలు ప్రాజెక్టులకు జరుగుతున్న భూ సేకరణ పనులు వేగంగా జరగాలని, అదే విధంగా చెల్లింపులు కూడా సత్వరమే జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్. అంబేద్కర్ తెలిపారు. శుక్రవారం అయన ఛాంబర్ లో భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులు, జాతీయ రహదారులు, రైల్వే పనులు, ఇరిగేషన్ ప్రాజెక్టుల పనుల పై ఆయా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులకు సంబంధించి మ్యాప్ లను పరిశీలించారు. ఆర్ అండ్ ఆర్ అంశాల పై ఆరా తీసారు. ఆర్.డి.ఓ సూర్య కళ మాట్లాడుతూ రన్ వే , అప్రోచ్ రోడ్ పనులు పురోభివృద్ధి లో ఉన్నాయని, ఆర్ అండ్ ఆర్ సమస్యలేమీ లేవని వివరించారు.
జాతీయ రహదారులకు సంబంధించి ప్యాకేజి 1 లో మ్యుటేషన్ సమస్యలు ఉన్నాయని, 3 లో రోడ్ పై విగ్రహాలు తొలగించవలసి ఉందని, చెల్లింపులు కొంత మేరకు పెండింగ్ ఉన్నాయని డిప్యూటీ కలెక్టర్లు తెలిపారు. రైల్వేస్ కు సంబంధించి భూ సేకరణ జరగవలసి ఉందని, పెదమానాపురం వద్ద గ్రామ కంఠం ఉందని, నోటిఫికేషన్ జారీ చేయవలసి ఉందని ఆర్.డి.ఓ సూర్య కళ తెలుపగా వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని కలెక్టర్ సూచించారు. అదే విధంగా పురిటిపెంట వద్ద చెల్లింపులు పెండింగ్ ఉన్నాయని, కోమటిపల్లి వద్ద భూ సేకరణ చేయవలసి ఉందని రైల్వే అధికారులు కలెక్టర్ దృష్టి కి తెచ్చారు. రైల్వే వారికీ అవసరమగు భూ సేకరణ తక్షణమే చేయాలని, అలాగే చెల్లింపులకు అవసరమగు నిధులను కూడా మంజురుకు లేఖ రాయాలని కలెక్టర్ తెలిపారు.
ఇరిగేషన్ ప్రాజెక్టులకు భూసేకరణ కోసం నిధులు లేవని , పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. పెందిద్న్గ్ వివరాల తో నోట్ సమర్పించాలని, ఇరిగేషన్ సెక్రటరీ కు లేఖ రాస్తామని తెలిపారు. తారకరక తీర్ధ సాగర్, తోటపల్లి, ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి పనులకు నిధులు లేక ఆగిపోయాయని , కొన్ని చోట్ల భూ సమస్యలు కూడా ఉన్నాయని కలెక్టర్ దృష్టికి అధికారులు తీసుకురాగా , జే.సి, ఆర్.డి.ఓ రైతులతో మాట్లాడి భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు.
ఈ సమావేశం లో జే.సి కార్తీక్, డి.ఆర్.ఓ అనిత, ఆర్.డి.ఓ సూర్య కళ, డిప్యూటీ కలెక్టర్లు ప్రమీల, మురళీ, జోసెఫ్ , జి ఎం ఆర్ సంస్థ నుండి రామ రాజు, రైల్వే అధికారులు, జాతీయ రహదారుల అధికారులు, ఇరిగేషన్ ఇంజనీర్లు, ఆయా మండల తహసిల్దార్లు పాల్గొన్నారు. (Story: భూసేకరణ చెల్లింపులు వేగంగా జరగాలి)