మంచి సేవలు అందించే ప్రయత్నం చేస్తా
జిల్లాలో శిక్షణ పూర్తిచేసుకున్న ట్రైనీ సహాయ కలెక్టర్ సహాదిత్ వెంకట్ త్రివినాగ్
న్యూస్‌తెలుగు/విజయనగరం: విజయనగరం జిల్లాలో గత ఏడాది కాలంలో వివిధ హోదాల్లో పొందిన శిక్షణ ద్వారా ఎన్నో పరిపాలనపరమైన అంశాలను నేర్చుకున్నానని, యీ అనుభవంతో రానున్న రోజుల్లో ప్రజలకు మంచి సేవలు అందించే ప్రయత్నం చేస్తానని జిల్లాలో శిక్షణ పూర్తిచేసుకున్న ట్రైనీ సహాయ కలెక్టర్ బి.సహాదిత్ వెంకట త్రివినాగ్ అన్నారు. జిల్లాలో పనిచేసిన కాలంలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణతో పాటు రైలు ప్రమాద దుర్ఘటన, ఇతర విపత్తుల సమయంలో ఏవిధంగా వ్యవహరించాలనే అంశాలను నేర్చుకున్నట్టు చెప్పారు. జిల్లాలో గత ఏడాది మే 25వ తేదీన శిక్షణకోసం చేరానని, నిన్నటితో శిక్షణ పూర్తయిందన్నారు. జిల్లాలో చీపురుపల్లిలో ఆర్.డి.ఓ.గా, మెంటాడలో తహశీల్దార్‌గా శిక్షణ పొందానని పేర్కొన్నారు. వివిధ హోదాల్లో, వివిధ ప్రభుత్వ శాఖల్లో ఏయే విధులు నిర్వహిస్తారనే అంశాలపై అవగాహన కలిగిందన్నారు. అదేవిధంగా ప్రోటోకాల్ నిర్వహణ అంశాలపై కూడా అవగాహన ఏర్పరచుకున్నట్టు చెప్పారు.
ఎన్నికల నిర్వహణలో భాగంగా ఓటర్లను చైతన్యపరిచేందుకు చేపట్టిన స్వీప్ కార్యక్రమాల్లో భాగస్వాములయ్యానని, యీ కార్యక్రమాల ద్వారా జిల్లాలో ప్రస్తుత ఎన్నికల్లో రెండు శాతం మేరకు ఓటింగ్ పెంచగలిగామన్నారు. ఎన్నికల సందర్భంగా తనను జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్ మెంబర్‌గా నియమించారని ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీని నియంత్రించేందుకు పలు చోట్ల దాడులు నిర్వహించి, మద్యం నిల్వలను స్వాధీనం చేసుకునే దిశగా తమ బృందం పనిచేసిందన్నారు. నెల్లిమర్లలో వున్న మద్యం డిపో నుంచి మద్యం నిల్వలపై పర్యవేక్షణ చేయడం జరిగిందన్నారు.
జిల్లాలో శిక్షణ పొందిన కాలంలో జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ లు మయూర్ అశోక్, కార్తీక్‌లు తనకు ఎంతగానో సహకరించి ప్రోత్సహించారని చెప్పారు.
విజయనగరం జిల్లాకు రానున్న ఎంతో భవిష్యత్తు వుందన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు కార్యకలాపాలు మొదలయ్యాక యీ ప్రాంతంలో ఆర్ధిక పరంగా వృద్ధి చెందుతుందన్నారు. మెటలర్జీలో బి.టెక్ పూర్తిచేసిన తనకు తన తండ్రి బి.జయకుమార్ సివిల్ సర్వీసెస్‌లో చేరేందుకు ఎంతగానో స్ఫూర్తినిచ్చారని చెప్పారు.
ట్రైనీ సహాయ కలెక్టర్ వచ్చే రెండునెలల కాలంలో కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక మంత్రిత్వశాఖలో శిక్షణ చేపట్టేందుకు న్యూఢిల్లీ వెళ్లనున్నారు. (Story: మంచి సేవలు అందించే ప్రయత్నం చేస్తా)