Home టాప్‌స్టోరీ కెనడాలో ‘తెలుగు తల్లి’

కెనడాలో ‘తెలుగు తల్లి’

0

కెనడాలో ‘తెలుగు తల్లి’

ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగ‌డ‌రా నీ తల్లి భూమి భారతిని అన్నట్లు… కెనడా దేశంలో వున్న తెలుగు వారు తెలుగు తల్లి దినపత్రిక నడుపుతూ తేనె లోలికించే తెలుగుదనాన్ని తెలుగు భాషను కెనడా భావితరాలకు పరిచయం చేస్తూ 8 వసంతాలను పూర్తి చేసుకున్నారు.
1985 లో సరోజ కొమరవోలు గారిచే తెలుగుతల్లి అనే పత్రిక ప్రారంభించబడి, కొద్ది సంవత్సరాల అనంతరం నిలిపివేయబడింది. 2016 లో ఒక తెలుగుపత్రిక స్థాపించాలని అభిలాష కలిగిన శ్రీమతి లక్ష్మి రాయవరపు, సరోజ గౌరవార్థం అదే పేరుతో, తెలుగుతల్లి కెనడా అనే పేరుని లాభాపేక్ష లేని సంస్థగా రిజిస్టరు చేయడం జరిగింది. లయన్ విమలా ప్రసాద్ గుర్రాల భారత దేశ కరస్పాండెంట్ గా, కళ పిళ్ళారిశెట్టి, గంగాధర్ సుఖవాసి, విజయభాస్కర్ రెడ్డి పూడూరి మొదలైన వారు గౌరవ సభ్యులుగా ఈనాటి వరకూ సంస్థకి చేదోడు వాదోడుగా ఉంటున్నారు.

సాహితీ మాత చల్లని ఆశీస్సులు పుష్కలంగా ఉండడం వల్ల చిన్న చిన్న అడుగులు వేస్తూ ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎనిమిదవ పుట్టినరోజు జరుపుకుంది తెలుగుతల్లి కెనడా సంస్థ.

పత్రికతో మొదలైన ప్రస్థానం సంగీత సాహిత్య కార్యక్రమాలతో రోజురోజుకీ అభివృద్ధి చెందుతూ, దేశ వ్యాప్తంగా తెలుగు ప్రజల ప్రతిభని ఒక వేదిక మీదకి తీసుకువచ్చే ప్రయత్నంలో చాలావరకు సఫలీకృతం అయింది.

పత్రిక పరంగా ప్రస్తుతం కెనడా నించి 50 శాతము రచనలు వస్తున్నాయి. ఈ శాతాన్ని ఏ ఏటా పెంచాలన్నది వ్యవస్థాపకుల ముఖ్య ఉద్దేశ్యము. ఈ నిష్పత్తిని 70% కి తేవాలని, తద్వారా కెనడాలో ఉన్న రచయితలని ప్రపంచానికి పరిచయం చెయ్యాలని వారి తపన.

ప్రతి రచనని ప్రోత్సహించటం తెలుగుతల్లి కమిటీ నిర్ణయాలలో ఒకటి. వచ్చిన రచనలు తిప్పి పంపడం కాకుండా, కొత్త రచయితలకు తగిన సహకారం, ప్రోత్సాహం అందించి, రచన నచ్చని పక్షంలో వారికి సూచనలిచ్చి, తిరిగి వ్రాసి పంపమని కోరడం లేక చిన్న సవరణలు చెయ్యడం ద్వారా పత్రిక కొత్త రచయితలు తమ ప్రతిభని మరింత మెరుగు పరచుకునే అవకాశమిస్తోందని నిర్వాహకులు సగర్వంగా తెలియచేసారు.

పత్రికకి ఐదు సంవత్సరాలు పూర్తి అయ్యేవరకూ నాణ్యత మీద పూర్తి దృష్టి పెట్టడం జరిగిందనీ, అనంతరము తెలుగుతల్లి కెనడా యూ ట్యూబు ఛానల్ ప్రారంభించబడిందనీ వారు తెలియజేశారు. దీనిలో దేశవ్యాప్తంగా గాయకులు, నృత్య కళాకారులు, వాద్య కళాకారులు, రచయితలు, కవులు వారి ప్రతిభ కనబరుస్తూ ఉండగా, భగవద్గీత, పిల్లల కథలు మొదలైన వాటిలో పిల్లలు అద్భుతమైన ప్రజ్ఞ కనబరుస్తున్నారు. ఇవే కాకుండా హరికథ వంటి మరుగున పడుతున్న కళలని పరిచయం చెయ్యడం జరుగుతోంది. అష్టావధానాలు తరచుగా నిర్వహిస్తున్నారు. మొట్టమొదటి సారి కెనడా జాతీయ సదస్సు నిర్వహణ 2021 లో వంగూరి చిట్టెన్ రాజు సహాయంతో మొదలై, రెండవ కెనడా జాతీయ సాహితీ సదస్సు 2023 డిసెంబర్ లో నిర్వహించబడింది.

తెలుగుతల్లి వివాహ పరిచయ వేదిక ద్వారా 4 జంటలు ఒక ఇంటివారయ్యారు.

ప్రతి సంవత్సరమూ త్యాగరాజ, అన్నమయ్య ఆరాధనోత్సవాల నిర్వహణ జరుగుతోంది. త్యాగరాజ ఆరాధోత్సవాలలో భాగంగా సంగీతంలో ప్రతిభావంతులకి, జాతీయ సదస్సులలో భాగంగా సాహిత్యంలో ప్రతిభావంతులకి జీవన సాఫల్య పురస్కారాలు నెలకొల్పబడ్డాయి. 2023 లో పాడనా తెలుగు పాట అనే సినిమా పాటల రియాలిటీ కార్యక్రమము ఓంటారియో తెలుగు ఫౌండేషన్ తో కలిసి నిర్వహించారు.

తెలుగుతల్లి కెనడా సంస్థ పబ్లిషింగ్ ద్వారా ఇప్పటికి 10 పుస్తకాలు ప్రచురించబడ్డాయి. ప్రచురించిన పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేయబడి, అందరూ చదవడానికి వీలుగా www.telugutalli.ca లో పొందు పరచబడ్డాయి.

భారతీయ కళలు, సంస్కృతి ప్రతిబింబించేలా, ప్రతి ఏటా కొన్ని కొత్త కార్యక్రమాల రూపకల్పన జరుగుతోంది. శ్రీవాణి ముప్పాళ్ళ, వాణీ ఉప్పుల , ఝాన్సీ గరిమెళ్ల, సౌమ్య లింగారెడ్డి, జ్యోతి రాచ, సూర్య ఉపాధ్యాయుల, సమత రాచమల్ల, శోభా వేదాంతం, షణ్ముఖ ప్రియ దేవరకొండ, హిమబిందు గుడుగుంట్ల , ప్రీతి ఎనుగంటి , హర్ష దీపిక రాయవరపు, భరణి పెండ్యాల, భాస్కర వర్మ ముదునూరు, సుప్రజహరి చల్లా , ఇందిర పమిడిఘంటం, సుజాత బలివాడ, రుక్మిణి మద్దులూరి, విజయలక్ష్మి సువర్ణ, కోరుకొండ ప్రవీణ్ , కోరుకొండ మానస, స్వామి నారాయణ మొదలైనవారు వివిధ కమిటీలలో సేవలు చేస్తుండగా, నిరంతరం నవ కల్పన జరగాలని తెలుగుతల్లి కమిటీ సభ్యుల ఆకాంక్ష. (Story: కెనడాలో ‘తెలుగు తల్లి’)

See Also: 

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

రెస్పాన్స్ బ‌ట్టి డెవిల్‌కు సీక్వెల్!

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version