సీఎంగా 7న రేవంత్ ప్రమాణ స్వీకారం
హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఎనుమల రేవంత్ రెడ్డి తెలంగాణ మూడవ ముఖ్యమంత్రి కానున్నారు. ఆయన ఈనెల 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తారు. సీఎల్‌పీ నేతగా రేవంత్‌రెడ్డిని ఎంపిక చేసినట్లు ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న మీదటే రేవంత్‌ను సీఎల్‌పీ నేతగా ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ విషయాన్ని భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలోనే వేణుగోపాల్ ప్రకటించడం విశేషం. రేవంత్‌ను సీఎల్‌పీ నేతగా ఎంపిక చేస్తున్నట్లు సోమవారమే లీకైంది. అయితే దీని పట్ల సీఎం పదవిని ఆశిస్తున్న కొంతమంది అగ్రనేతలు అసంతృప్తి వ్యక్తం చేయడంతో పరిశీలకుడు శివకుమార్ హుటాహుటిన ఢిల్లీ చేరుకొని సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌లతో సుదీర్ఘంగా భేటీ అయి చర్చించిన మీదట అధిష్ఠానం పూర్తిగా రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపింది. ఉత్తమ్, భట్టిలను కూడా పిలిపించి, వారిని ఒప్పించారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిచే అవకాశాలే లేని సమయంలో రేవంత్ రెడ్డి తన సరికొత్త వ్యూహరచన, వాగ్ధాటితో బీఆర్ఎస్ నేతలను ఎదుర్కొని కాంగ్రెస్‌ను గెలిపించారు. కాంగ్రెస్ విజయంలో రేవంత్ పాత్రే సింహభాగమని అందరికీ తెలుసు. సీఎం పదవి వచ్చేసరికి డిమాండ్లు చేయడం పరిపాటి. నాయకులంతా అర్థం చేసుకొని, రేవంత్‌కు సహకరించాలని రాహుల్ నేరుగా అసంతుష్టులను కోరినట్లు సమాచారం. దీంతో రేవంత్ ఎంపికకు క్లియర్ అయింది. ఈ నేపథ్యంలో కేసీ వేణుగోపాల్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి, భట్టి, ఉత్తమ్ తదితరుల సమక్షంలోనే రేవంత్ పేరును ప్రకటించి, ఆయనను సీఎల్‌పీ నేతగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈనెల 7వ తేదీన రేవంత్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ముందుగా ఆయనతోపాటు మరో 9 మంది క్యాబినెట్ కూడా ప్రమాణం చేసే అవకాశం వుంది.
ఢిల్లీకి రేవంత్ పిలుపు
సీఎంగా ప్రమాణం చేయనున్న రేవంత్ రెడ్డిని తక్షణమే ఢిల్లీ రావాల్సిందిగా కాంగ్రెస్ అధిష్ఠానం పిలుపునిచ్చింది. దీంతో రేవంత్ హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. ఆయనతోపాటు ఏర్పడబోయే క్యాబినెట్‌పై నిర్ణయం తీసుకునేందుకు పిలిచినట్లుగా తెలిసింది. రేవంత్ రెడ్డి ఢిల్లీలో ముందుగా సోనియా, రాహుల్, ఖర్గేలతో భేటీ అవుతారు. వారికి కృతజ్ఞతలు తెలియజేసిన మీదట, వారితో సమావేశమై, మంత్రివర్గ జాబితాను ఖరారు చేస్తారు. 5, 6 తేదీలు మంచి రోజులు కావన్న అభిప్రాయంతో 7వ తేదీన ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిసింది. కాగా, ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే ఇతర ప్రముఖ కాంగ్రెస్ నేతలు హాజరవుతారు. (Story: సీఎంగా 7న రేవంత్ ప్రమాణ స్వీకారం)
See Also :
కేసీఆర్ పై కక్షతీర్చుకుంటారా?
బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? హిందూ వనితకు నుదుట తిలకం తప్పదా?