అడుగడుగునా అరెస్టులు…ఎగసిపడ్డ ఎర్రజెండా
సీపీఐ చలో సెక్రటేరియట్‌కు అనూహ్య స్పందన
CPI Chalo Secretariat: రాష్ట్రంలో ఎర్రజెండా ఎగసిపడింది. సీపీఐ పిలుపునిచ్చిన ‘చలో సెక్రటేరియట్’కు ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. సీపీఐ కార్యకర్తలు, నాయకులు పెద్దఎత్తున సచివాలయ ముట్టడికి బయలుదేరారు. వారికి ప్రజల తోడ్పాటు కూడా లభించడం గమనార్హం. అయితే పోలీసులు అన్ని జిల్లాల్లోనూ ఎక్కడికక్కడే రంగంలోకి దిగి సీపీఐ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి, పోలీసుస్టేషన్లకు తరలించారు. అయినప్పటికీ, సీపీఐ కార్యకర్తలు రహస్యంగా బయలుదేరి అమరావతి చేరుకోవడానికి ప్రయత్నం చేశారు. పోలీసులు కనిపెట్టి మరీ అరెస్టులు చేశారు. సీపీఐ నాయకులు సెల్‌ఫోన్లు మార్చి, రహస్యంగా, పోలీసులకు దొరక్కుండా వెళ్లడానికి యత్నించారు. ఇబ్రహీంపట్నంలో ఎన్టీయార్ జిల్లా పార్టీ కార్యదర్శి కోటేశ్వరరావు నాయకత్వంలో నదిలో పడవల ద్వారా చేరుకొని, రహస్యంగా చేరుకున్నారు. అయినా పోలీసులు అలర్టయ్యారు. కాకపోతే సీపీఐ కార్యకర్తలు మాత్రం అనుకున్నట్టుగానే అమరావతికి చేరుకున్నారు. కాకపోతే అక్కడ అరెస్టయ్యారు. గుంటూరు జిల్లా నుంచి సీపీఐ సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరావు నాయకత్వంలో బస్సుల్లో బయలుదేరారు. పోలీసులకు దొరికినా తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అరెస్టులు చేసి స్టేషన్లకు తరలించారు. కార్యదర్శి కె.రామకృష్ణ అనంతపురంలో బయలుదేరి నిన్ననే అరెస్టయ్యారు. అయితే అక్కడే వారు రోడ్లపై రాత్రిపూట కూడా నిరసనలు తెలిపారు. ఉదయం మళ్లీ అమరావతికి బయలుదేరి అరెస్టయ్యారు. రాజమండ్రి, శ్రీకాకుళం, తణుకు ప్రాంతాల నుంచి బయలుదేరి సీపీఐ బృందాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంలో పోలీసులు కాస్త బలప్రయోగం చేయాల్సి వచ్చింది. ఏదేమైనప్పటికీ, ఇటీవలకాలంలో ఒక లెఫ్ట్ పార్టీ నుంచి ఇంత పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరగడం ఇదే మొదటిసారి. (Story: అడుగడుగునా అరెస్టులు…ఎగసిపడ్డ ఎర్రజెండా)




