జనం తిరుగుబాటు: శ్రీలంకలో ఎమర్జెన్సీ
కొలంబో: శ్రీలంక దేశం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఎన్నడూలేని అత్యయిక పరిస్థితులు నెలకొన్నాయి. ఆకలిని తట్టుకోలేక జనం తిరగబడ్డారు. నిరసనకారులు అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టారు. శ్రీలంక అధ్యక్ష భవనం బయట ప్రజల నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారడంతో పోలీసులు కర్ఫ్యూ విధించారు. టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. ఆహారం, చమురు ధరలు భయంకరంగా పెరిగిపోవడంతో పాటు విద్యుత్ కోతలను నిరసిస్తూ ప్రజలు రోడ్లపైకి వచ్చారు. బారికేడ్లను తోసుకుంటూ వచ్చిన ఆందోళనకారుల సమూహం, గురువారం రాత్రి ఒక బస్సును తగులబెట్టిందనే ఆరోపణలు ఉన్నాయి. అధ్యక్షుడు గొటాబయ రాజపక్స ఈ సంఘటనలను ‘’ఉగ్రవాద చర్యలు’’గా అభివర్ణించారు. శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత దేశంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారని స్థానిక మీడియా తెలిపింది. ప్రజలకు రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ, అత్యవసర సరకులు, సేవల నిర్వహణ కోసం ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వ గెజిట్‌లో పేర్కొన్నారని ‘డెయిలీ మిర్రర్’ రిపోర్ట్ చేసింది. ఇప్పటికే, శ్రీలంక ప్రభుత్వం పశ్చిమ రాష్ట్రంలో ఆరు గంటల కర్ఫ్యూ విధించింది. అర్థరాత్రి నుంచి ఉదయం 6 గంటల వరకు పశ్చిమ ప్రావిన్సులో కర్ఫ్యూ అమల్లో ఉంటుందని పోలీసు శాఖ ప్రతినిధి ప్రకటించారని డెయిలీ మిర్రర్ వెల్లడిరచింది. శనివారం దేశవ్యాప్తంగా ప్రభుత్వం రెడ్‌అలెర్ట్ ప్రకటించింది. అయితే ప్రజలకు ఎక్కడికక్కడ తిరుగుబాట్లు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ తిరుగుబాట్ల వెనుక ఉగ్రవాద కుట్రలు వున్నాయని లంక ప్రభుత్వం నెట్టేసే ప్రయత్నం చేస్తున్నది. నిజానికి, అధ్యక్ష భవనం ఎదుట నిరసన కార్యక్రమాలు శాంతియుతంగానే మొదలయ్యాయి. కానీ, పోలీసులు వాటర్ కేనన్స్, టియర్ గ్యాస్‌ను ప్రయోగించడంతో పాటు అక్కడున్న వారిని కొట్టారని నిరసనల్లో పాల్గొన్న వారు చెప్పారు. కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. దేశ ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైన విషయం తెల్సిందే. శ్రీలంకలో విదేశీ మారక సంక్షోభం కారణంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. అక్కడి ప్రజలు ఏకబిగిన 13 గంటల పాటు విద్యుత్ కోతను ఎదుర్కొన్నారు. చమురు, కనీస అవసరాలైన ఆహారం, మందులు కొరత కారణంగా ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహం తారా స్థాయికి చేరింది. దేశ పాలనలో స్థిరత్వం తెస్తానంటూ వాగ్దానాలు చేసిన రాజపక్స 2019లో అత్యధిక మెజార్టీతో అధికారంలోకి వచ్చారు. కానీ, అవినీతి, బంధుప్రీతి వల్ల ప్రభుత్వం భ్రష్ఠుపట్టిపోయింది. రాజపక్స మంత్రివర్గంలోని అనేక కీలక శాఖలు ఆయన సోదరులు, మేనల్లుడు వద్ద ఉన్నాయి. (Story: జనం తిరుగుబాటు: శ్రీలంకలో ఎమర్జెన్సీ)
See Also: ఐఏఎస్‌లకు జైలుశిక్ష ఎలా వుందంటే!
మేకపాటి గౌతమ్‌రెడ్డి స్థానంలో మంత్రి ఎవరో తెలుసా?
మాకొద్దీ మంత్రిగిరీ! Special Story)
రామ్‌చరణ్‌తో బిగ్ డీల్ నిజమేనా?
క్యాబినెట్ విస్తరణ ముహూర్తం కుదిరింది!
ఇకపై ఇంటర్వ్యూలు లేకుండానే ఉద్యోగాలు!
వావ్! లేపాక్షికి యునెస్కో గుర్తింపు!
రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్ : బడ్జెట్ రూ.800 కోట్లు
ఆ 10 మందికీ మంత్రిపదవులు ఖాయం!)