పాపం సవాంగ్‌!

0
Gautam Sawang
Gautam Sawang

పాపం సవాంగ్‌!

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) పోలీస్‌ బాస్‌ గౌతమ్‌ సవాంగ్‌ ఆకస్మిక బదిలీ తీవ్ర చర్చనీయాంశమైంది. రాజకీయ నాయకులు కచ్చితంగా పోలీసులను వాడుకొని వదిలేస్తారని మరోసారి ఈ ఉదంతం నిక్కచ్చిగా నిరూపించింది. పొమ్మనలేక పొగపెట్టి చివరకు ఇలా సాగనంపారని ఆంధ్రా మీడియా ఘోషిస్తున్నది. కనీసం ‘నువ్వెక్కడ పనిచేయాలి?’ అని చెప్పకుండా ఎలాంటి పోస్టింగ్‌ ఇవ్వకుండానే ప్రభుత్వం సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించి మరీ సవాంగ్‌పై బలమైన వేటు వేసింది. ఉత్తరాంధ్ర పర్యటనలో వున్న సవాంగ్‌ ఇంటికొచ్చేసరికి బదిలీ ఉత్తర్వులు చేతికందాయి. ఈస్థాయిలో అత్యంత అవమానకరీతిలో ఏ పోలీసు అధికారినీ, గతంలో ఏ ప్రభుత్వమూ ఇలా బదిలీ చేయలేదు. ఇన్నాళ్లూ గౌతమ్‌ సవాంగ్‌ ప్రజలపక్షాన కాకుండా కేవలం ప్రభుత్వ పక్షాన నిలిచినందుకు సర్కారు ‘భలే గిఫ్ట్‌’ ఇచ్చిందని ఏపీలో చెవులు కొరుక్కుంటున్నారు. జగన్‌ (YS Jagan) ప్రభుత్వం ఏరికోరి మరీ కొన్ని మాసాల క్రితం గౌతమ్‌ సవాంగ్‌ను డీజీపీగా నియమించుకుంది. పాపం సవాంగ్‌… ప్రభుత్వం ఏది చెపితే అదే చేశారు. ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రజల ముందు అభాసుపాలయ్యారు. సవాంగ్‌ డీజీపీగా వుండగా, హక్కుల గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరిపైనా కేసులు పెట్టారు. ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ విధానాలను, దాంట్లోని లోపాలను ప్రశ్నించే వారెవ్వరైనా వారిపై కేసులు బనాయించడంలో ముందున్నారు. (చిన్న వసరణ : పోలీసులు కేసులు బనాయించడమనేది ఈ ఒక్క ప్రభుత్వ హయాంలోనే కాదు…గత ప్రభుత్వ హయాంలోనూ జరిగింది. అలాంటి ఘటనలు కోకొల్లలు).అత్యంత వివాదాస్పదమైన డీజీపీగా ముద్ర వేసుకున్నారు.
పెద్దలు ఆదేశించారంటూ ప్రతిపక్షాల కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపారు. పైగా ప్రతిపక్షాల అభ్యర్థనలను ఏనాడూ పట్టించుకోలేదు. కాకపోతే అధికార పార్టీ వేలమందితో కార్యక్రమాలు నిర్వహించినా, నోరుమెదపలేదు. దాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా, కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా జరిగిన కార్యక్రమంగా బిల్డప్‌ ఇచ్చేవారు. వామపక్షాలు, ప్రజాసంఘాల కార్యక్రమాలపై మాత్రం కొవిడ్‌ నిబంధనలు రుద్దేవారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడుపై రెండుసార్లు దాడులు జరిగినా పట్టించుకోలేదు. ఒకటి అమరావతిలోనూ, ఇంకొకటి విశాఖపట్నంలోనూ. విశాఖలో చంద్రబాబును విమానాశ్రయానికే పరిమితం చేశారు. కనీసం బయటకు రానీయలేదు. నోటీసులిచ్చి అవమానించారు. దీనిపై సవాంగ్‌ కోర్టుకెళ్లి సంజాయిషీ చెప్పుకోవాల్సి వచ్చింది. ఇక రాజధాని రైతులపై పోలీసు లాఠీ రaుళిపించారు. (చిన్న సవరణ : రాజధాని రైతుల ఆందోళన వెనుక ఎవరున్నారు? ఈ అసమ్మతి నిజమైనదేనా?కాదా? అన్నది వేరే విషయం. దాన్ని తర్వాత చర్చించుకుందాం.)
చంద్రబాబు కాన్వాయ్‌పై కొందరు అధికార పార్టీ కార్యకర్తలు దాడిచేస్తే, అది భావస్వేచ్ఛగా సవాంగ్‌ అభివర్ణించారు. ఆ దాడిలో ఓ ఎమ్మెల్యే కూడా పాల్గొన్నారు. అయితే ఆ ఎమ్మెల్యేపై కేసుపెట్టకుండా వినతిపత్రం ఇచ్చేందుకు డీజీపీ ఆఫీసుకు వెళ్లిన టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టారు. రామతీర్థం ఘటనలో చేతులెత్తేశారు. వివిధ ఘటనల విషయంలో సవాంగ్‌కు కేంద్ర హోంశాఖ కూడా చీవాట్లు పెట్టినట్లు తెలిసింది. హైకోర్టు కూడా ఆయన పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా ఆయన మారలేదు. పైగా తన ప్రభుభక్తిని చాటుకున్నారు. అంతర్గతంగా పోలీసుశాఖలో కూడా ఆయన అసమ్మతిని కూడగట్టుకున్నారు. సవాంగ్‌ అసమర్ధుడనే నిందను భరించాల్సి వచ్చింది. కిందిస్థాయి అధికారులే ఆయన మాట వినేవారు కాదు. పోలీసులకు వీక్లీఆఫ్‌లు కూడా ఇవ్వలేకపోయారు. కానిస్టేబుల్‌ నుంచి హౌస్‌ఆఫీసర్‌ వరకు పోలీసుబాస్‌ పట్ల అసంతృప్తినే వ్యక్తం చేస్తూ వుండేవారు. ఆయన హయాంలో పోలీసుస్టేషన్లలో ప్రతిపాదిక సౌకర్యాలను సైతం మెరుగుపర్చలేకపోయారు. స్టేషన్లకు తగినన్ని వాహనాలను తెచ్చుకోలేకపోయారన్న ఆరోపణ కూడా వుంది. కేంద్ర నిధులు కోట్లాది రూపాయలు రావాల్సి వున్నా, ఆయన ఉపయోగించులేకపోయారు.
ఆరేళ్ల క్రితమే సవాంగ్‌పై బదిలీ వేటు పడాల్సిందని, కాకపోతే, ఇంకొన్నాళ్ల ఆయన వున్నందుకు సంతోషమని కొందరు సీనియర్‌ పోలీసు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల ‘ఛలో విజయవాడ’ పేరుతో ఉద్యోగులు చేసిన ఆందోళనను అడ్డుకోవడంలోనూ, కనీసం ఇంత జరుగుతుందన్న సమాచారాన్ని సేకరించడంలో విఫలమయ్యారు. కావాలనే ఆయన ఉద్యోగులకు మద్దతు ఇచ్చారన్న అపవాదును మూటగట్టుకొని, చివరకు ఉద్వాసనకు గురయ్యారు. 2019 జూన్‌ 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సవాంగ్‌కు వచ్చే ఏడాది జులై నెలాఖరు వరకు సర్వీసు వుంది. అప్పటివరకు ఆయనను ఏ పోస్టులో పెడతారో వేచిచూడాలి. లేదా ఏ పోస్టింగూ లేకుండా వదిలేస్తారో కాలమే సమాధానం చెప్పాలి. ‘‘ఏ పోలీసును కదిపినా…దానమ్మా జీవితం…ఎంత చేసినా ఈ రాజకీయనాయకులు ఇంకా తొక్కిపడేస్తున్నారండీ’’ అని అంటూ వుంటారు. సవాంగ్‌ కథ కూడా అంతే! ఏదేమైనప్పటికీ, రాజకీయ రథచక్రాల కింద నలిగిపోయిన మరో పోలీసు అధికారిగా గౌతమ్‌ సవాంగ్‌ మిగిలిపోయారు. పాపం పోలీసులకు ‘చివరకు మిగిలేది!’ ఇదేనేమో! (Story : పాపం సవాంగ్‌!)

Also See : ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిందెవరు?

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version