Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిందెవరు?

ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిందెవరు?

0
Minister Perni Nani
Minister Perni Nani

ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిందెవరు?
మచిలీపట్నం : ప్రత్యేక హోదా (Special Status) అంశాన్ని కేంద్ర ప్రభుత్వం తన ఎజెండాలో చేర్చి, ఆ తర్వాత తొలగించడంపై ప్రతిపక్షాలు చేసిన విమర్శలను రాష్ట్ర రవాణా, సమాచార, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) తిప్పికొట్టారు. ఆయన మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడుతూ, ప్రత్యేక హోదాను ఎజెండాలో పెట్టటం దేశ ద్రోహ నేరం లాంటిదా అని ప్రశ్నించారు. అసలు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టంది చంద్రబాబునాయుడేనని ఆరోపించారు. ఏపీకి హోదా ఇవ్వకూడదన్నదే ఏపీలో ఉన్న టీడీపీ-బీజేపీ వర్గం వైఖరి అని, హోదాను హోల్‌సేల్‌గా అమ్మేసిన బాబు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు డైరెక్షన్‌ లోనే జీవీఎల్‌ కేంద్ర పెద్దల దగ్గర పట్టుబట్టి హోదా అంశాన్ని తీయించారని ఆరోపించారు.
మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…
నిన్న వీరంతా ఎక్కడ దాక్కున్నారు..?
విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)కు న్యాయం చేసేందుకు కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన సబ్‌ కమిటీ ఎజెండాలో తొలుత చేర్చిన ప్రత్యేక హోదా అంశాన్ని తొలగించామనేసరికి అప్పటిదాకా కలుగుల్లో దాక్కుని, ఒక్కసారిగా బయటకు వచ్చినట్టుగా, బీజేపీ, టీడీపీ వాళ్ళంతా ఇప్పుడు బయటకు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు. రాష్ట్ర బీజేపీలో ఆరెస్సెస్‌ కాలం నుంచి ఉన్న నిఖార్సైన వర్గం ఒకటి అయితే.. చంద్రబాబు సూచనలు, సలహాలు, ఆదేశాల మేరకు బీజేపీలోకి వెళ్ళి, రాష్ట్ర పార్టీని తమ గుప్పెట్లో పెట్టుకున్న నకిలీ బీజేపీ వర్గం మరొకటి. వీరితోపాటు ప్రత్యేక ప్యాకేజీ పేరుతో హోదాను హోల్‌ సేల్‌ గా అమ్మేసిన చంద్రబాబు… వీరందర్నీసూటిగా కొన్ని ప్రశ్నలు అడగదలచుకున్నాం.
1. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలోని కమిటీ ప్రత్యేక హోదా గురించి ఎజెండాలో పెట్టటం అన్నది దేశ ద్రోహ నేరం లాంటిదా?
2. హోదా అంశం ఎజెండాలో పెడితే జీవీఎల్‌ ఎందుకు అంతగా భయపడ్డాడు?. దాన్ని ఎజెండా నుంచి తీసేయటానికి జీవీఎల్‌ ఎందుకు తొందర పడ్డాడు?
3. ఏపీకి హోదా ఇవ్వకూడదన్నదే ఏపీ లో ఉన్న టీడీపీ-బీజేపీ వర్గం స్టాండా?
4. ప్రత్యేక హోదాను ఎజెండాలో పెట్టారని తెలిసిన తరవాత చంద్రబాబు ఎందుకు దాన్ని స్వాగతించలేదు?
5. ఈ రోజు ప్రెస్‌మీట్లు పెట్టి మమ్మల్ని తిట్టటానికి ముందుకు వచ్చిన పయ్యావుల, అచ్చెన్నాయుడు, కనకమేడల… వీరంతా నిన్న ఎక్కడ దాక్కున్నారు?
6. ఏపీ బీజేపీ(టీడీపీ వర్గం) ఒక్క విషయం స్పష్టం చేయాలి. ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఇవ్వాలా వద్దా? ఇవ్వాలని మీరు కేంద్రంలోని మీ ప్రభుత్వాన్ని ఒప్పిస్తారా? లేదా?
7. ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టినందుకు చంద్రబాబు నాయుడు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి.
ప్రత్యేక హోదా మీద జీవీఎల్‌, సోము వీర్రాజు కూడా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.
1. పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తాం అని 2014 బీజేపీ మేనిఫెస్టోలో వాగ్దానం చేశారా? లేదా?
2. ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటారా? లేదా?
3. ఇప్పటికీ దేశంలో అనేక రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉందా? లేదా?
4. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వటం మీకు ఇష్టం ఉందా? లేదా?
తెలుగుదేశం పార్టీ కూడా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.
1. ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టినది మీరు అవునా.. కాదా?
2. 2014-19 మధ్య మీరూ, బీజేపీ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో పంచుకున్నారా.. లేదా.. అక్కడాఇక్కడా పార్టనర్లు అవునా కాదా?
3. మీరు ప్రత్యేక ప్యాకేజీయే మంచిదని హోదాను తాకట్టు పెట్టారా.. లేదా?
4. మీరు అధికారం నుంచి దిగిపోయేనాటికి, ఎలాంటి ప్యాకేజీ కూడా తీసుకురాకుండా చేతులు ఎత్తేశారా లేదా?
రాష్ట్రం బాగుపడుతుంటే ఎందుకు మీకు ఈర్ష్యాద్వేషాలు?
– జగన్‌ మోహన్‌ రెడ్డిగారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ బాగుపడుతుంటే.. చూసి, ఓర్వలేక ఈర్ష్యా, అసూయలతో రగిలిపోతూ, మీరు చేస్తున్న నీచ స్థాయి రాజకీయాలను కట్టిపెట్టాలని బీజేపీ రాష్ట్ర శాఖ, టీడీపీలకు హెచ్చరిక చేస్తున్నాం.
– ఇటీవల ముఖ్యమంత్రి జగన్‌ (YS Jagan) గారు ప్రధానమంత్రిని కలిసి విభజన హామీలు, రాష్ట్ర పరిస్థితిపై చర్చించాక, విభజన హామీల గడువు తీరిపోతుంది, ఇప్పటికైనా రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది, నష్టం పూరించి, న్యాయం చేయాలని కోరిన మీదట.. కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసి, ఈనెల 17న సబ్‌ కమిటీ చర్చించే ఎజెండా అంశాలను వెల్లడిరచారు. అయితే ఇంతలోనే రాష్ట్ర బీజేపీ నేతలు, టీడీపీ నేతలు కంగారుపడిపోయి.. ఎజెండాలో ప్రత్యేక హోదాను ఎలా చేరుస్తారంటూ హైరానాపడిపోయి కుట్ర రాజకీయాలకు తెరలేపారు.
ఎజెండాలో చేర్చినప్పుడు ఒక్క మాట మాట్లాడని బాబు..
– వాస్తవానికి రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి సంబంధించి, ఏజెండా నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వమే. విభజన అంశాలతో పాటు ప్రత్యేక హోదాను కూడా ఒక అంశంగా ఎజెండాలో చేరిస్తే.. అప్పుడు ఒక్క మాట మాట్లాడటానికి ఇష్టపడని చంద్రబాబు, అలానే రాష్ట్ర బీజేపీ పెద్దలు.. దాన్ని తొలగించాక ఏవేవే మాటలు మాట్లాడుతున్నారు. రాష్ట్ర బీజేపీకి చిత్తశుద్ధి ఉంట.. తామే మోడీ గారికి చెప్పామని, ప్రత్యేక హోదా అంశాన్ని చేర్పించామని చెప్పుకోవచ్చు. అలాకాకుండా, ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని గోతి కాడ నక్కల్లా కాచుకు కూర్చున్నట్టు… చంద్రబాబు సలహా మేరకు, ఆయన డైరెక్షన్‌ లో జీవీఎల్‌ కేంద్ర పెద్దల దగ్గర పట్టుబట్టి, మీరు ప్రత్యేక హోదాకు జీవం పోస్తే.. రాష్ట్రంలో బీజేపీ చచ్చిపోతుందని చెప్పి, ఆ అంశాన్ని తీయించి… ఈరోజు మళ్ళీ ఈ దయ్యాలు అన్నీ వేదాలు వల్లిస్తున్నాయి.
– హోదా అంశాన్ని ఎజెండాలో చేర్చినప్పుడు చంద్రబాబు, టీడీపీ నోటికి తాళం వేసుకుంటే.. బీజేపీనేత జీవీఎల్‌ రాష్ట్రానికి మంచిచేసేందుకు కృషి చేయకపోయినా, నష్టం చేసేందుకు చేసిన కృషి వల్ల ఆ అంశాన్ని ఎజెండా నుంచి తొలగించినట్టున్నారు. చంద్రబాబు డైరెక్షన్‌ లో జీవీఎల్‌ ఇటువంటి పాత్ర పోషించడానికి సిగ్గు లేదా అని ప్రశ్నిస్తున్నాం.
హోదా ఇవ్వటం సోము, జీవీఎల్‌ కు ఇష్టమా.. లేదా?
– 2014 బీజేపీ మేనిఫెస్టోలో పదేళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామని వాగ్దానం చేశారా.. లేదా.. ఏపీ ప్రజలను మోసం చేశారా లేదా.. అని నిలదీస్తున్నాం. ఇప్పటికైనా ప్రత్యేక హోదా హామీని బీజేపీ నేతలు నిలబెట్టుకుంటారా.. లేక చేతులెత్తేస్తారా.. లేక ఇంకా పిల్లి మొగ్గలు వేస్తారా.. ?
– దేశంలో చాలా రాష్ట్రాలకు ప్రత్యేక హోదా అర్హత కొనసాగుతుందా లేదా.. ఆ ఫలాలను వారు అనుభవిస్తున్నారా.. లేదా..?- ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వటం సోము వీర్రాజు, జీవీఎల్‌ కు ఇష్టం ఉందా… లేదా..? చెప్పాలి. వీళ్ళకు ఏపీపై బఠాని గింజ అంత చిత్తశుద్ధి, ప్రేమ ఉన్నా మీ స్టాండ్‌ ఏమిటో సూటిగా చెప్పండి.
– ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టింది టీడీపీనా.. కాదా.. మీ ప్యాకేజీలకు హోదాను అమ్మినవాళ్ళు.. కేంద్రం ఎజెండాలో పెడితే మాట్లాడకుండా, తీయగానే మాట్లాడే మిమ్మల్ని ఏమనాలి, రాష్ట్రానికి మీరు చేస్తున్నది ద్రోహం కాదా..? హోదాను మోడీకి హోల్‌ సేల్‌ గా అమ్మేసింది టీడీపీ అవునా.. కదా.. ? పోనీ, ప్యాకేజీలో ఒక్క పైసా అయినా రాష్ట్రానికి తెచ్చారా.. దిగి పోయేనాటికి ఒక్క పైసా కూడా నిధులు తేని మీరు అసమర్థులా కాదా..?
– ఎజెండాలో ప్రత్యేక హోదా అంశాన్ని తీసేయడానికి జీవీఎల్‌ ఎందుకు ఆత్రం. అది తీస్తే గానీ మీకు నిద్ర పట్టలేదా..? హోదాను ఎజెండాలో నుంచి తీయించి.. మళ్ళీ మాపై నోరు పారేసుకుంటారా..?. ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టినందుకు చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని పేర్ని నాని అన్నారు. (Story : ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిందెవరు?)

Also See : డోసు పెంచిన కేసీఆర్‌

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version