విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల వివాదానికి దాదాపు తెరపడిరది. సిఎం జగన్‌తో గురువారం సినీ ప్రముఖులు జరిపిన సమావేశం సత్ఫలితాలను ఇచ్చింది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో సినీ ప్రముఖులు చిరంజీవి, ప్రభాస్, మహేశ్‌బాబు, రాజమౌళి, కొరటాల శివ, పోసాని కృష్ణమురళి, ఆర్ నారాయణ మూర్తి, నిరంజన్ రెడ్డి, అలీ తదితర ప్రముఖులు భేటీ అయ్యారు. టికెట్ ధరలు, సినీ ఇండస్ట్రీ సమస్యలపై సుమారు గంటకు పైగా సమావేశం జరిగింది. ముఖ్యంగా 17 అంశాలపై సినీ ప్రముఖులు ముఖ్యమంత్రితో చర్చించారు. ఎంపిక చేసిన కొన్ని చిత్రాలకు సబ్సిడీ, జీఎస్టీ మినహాయింపు, ప్రభుత్వ, చారిత్రక ప్రాంతాల్లో షూటింగ్‌లకు అద్దె మినహాయింపు, ఆన్‌లైన్ టికెట్‌ల విక్రయం అమలు ఫిల్మ్ చాంబర్‌కు అప్పగించడం, చిన్న, మధ్య సినిమాలకు కూడా ఐదో షోకి అనుమతి, టాలీవుడ్ పరిశ్రమ హోదా ఇవ్వడం, ఏటా నంది అవార్డులు అందజేయడం, డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లకు చార్జీల మినహాయింపు, విద్యుత్ సబ్సిడీ, థియేటర్లకు ప్రాపర్టీ ట్యాక్స్ మినహాయింపు వంటి ప్రతిపాదనలు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. చర్చల అనంతరం మంత్రి పేర్ని నానితో సహా, సమావేశానికి హాజరైన నటులంతా మీడియాతో మాట్లాడారు.
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) మాట్లాడుతూ ‘‘ఇద్దరికీ నచ్చేలా సీఎం నిర్ణయం బాగుంది. సంతృప్తిగా ఉంది. చాలా సంతోషంగా ఉన్నాం. టికెట్ రేట్లు, ఇతరత్రా విషయాల్లో చాలా ఎక్సర్‌సైజ్ చేశారు. ఓటీటీ, పైరసీ తదితర మాకున్న సమస్యలన్నీ సీఎం దృష్టికి తీసుకెళ్లాం. ఆయన సానుకూలంగా స్పందించారు. అందరికీ ఆమోదయోగ్యంగా వారం రోజుల్లో జోఓ వస్తుందని ఆశిస్తున్నాం’’ అని అన్నారు. మహేష్‌బాబు (Super Star Mahesh Babu)మాట్లాడుతూ, ‘‘కోవిడ్ కారణంగా సినిమా పరిశ్రమకు పెద్ద ఇబ్బంది వచ్చింది. దీంతో రెండేళ్ల నుంచి తీవ్ర సంక్షోభం కొనసాగుతోంది. ఏపీ ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య ఉన్న గ్యాప్ ఈ తరహా చర్చలు వల్ల తొలగిపోయాయి. మా అందరికీ రెండేళ్లు చాలా కష్ట కాలం. ఇవాళ చాలా సంతోషకరమైన రోజు’’ అని వ్యాఖ్యానించారు.
దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) మాట్లాడుతూ, ‘‘సినీ పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య ఒక అగాధం ఏర్పడిరదని ఇప్పటివరకు ఒక భ్రమ ఉండేది. ఈరోజు అది తొలగిపోయింది. సీఎం మాతో కలిసి నేరుగా మాట్లాడినందుకు సంతోషంగా ఉంది’’ అని చెప్పారు. ఆర్.నారాయణ మూర్తి స్పందిస్తూ, ‘‘సగటు సినిమా బతకాలి. పండుగ వచ్చినా, సెలవులు వచ్చినా… పెద్ద సినిమాలకే అవకాశాలు వస్తున్నాయి. హిట్ అయితేనే సినిమాలు చూస్తారు. చిన్న సినిమాలకు నూన్ షో ఉండాలని కోరుతున్నాం. భారీ సినిమా ఎలాంటి ఫలితాలు అనుభవిస్తుందో.. సగటు సినిమా కూడా అలాంటి ఫలితాలు అనుభవించాలి’’ అని తెలిపారు. పోసాని కృష్ణమురళి, ఆలీ కూడా మాట్లాడారు.