ముంపు ప్రాంతాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జెసి
స్ధానిక సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
ఏలూరు/పెదపాడు, సెప్టెంబరు : వరద ప్రభావిత బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి స్పష్టం చేశారు. పెదపాడు మండలం అప్పనవీడులోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆదివారం స్ధానిక శాసన సభ్యులు చింతమనేని ప్రభాకర్ తో కలిసి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్, జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి పర్యటించారు. లోతట్టు ప్రాంతంలో ఇంకా ఉన్న బాధితులు పునరావాస కేంద్రానికి రావాలని కలెక్టర్ వెట్రిసెల్వి కోరారు. ముంపు ప్రభావం తగ్గిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్లవచ్చన్నారు. ఈ సందర్బంగా వరద సహాయక చర్యలను పునరావాస శిబిరాన్ని, వైద్య శిబిరాన్ని వారు సందర్శించారు. పునరావాస కేంద్రంలో భోజన ఏర్పాట్లకు సంబంధించి ఆహార పదార్ధాల నాణ్యతను పరిశీలించారు. అక్కడ ఉంచిన వాటర్ ప్యాకెట్లను పరిశీలించి వాటిపై ముద్రించిన వివరాలను పరిశీలించారు. అనంతరం అక్కడ హౌసింగ్ కాలనీని సందర్శించారు. కాలనీ వాసుల నివాసయోగ్యంగా శాశ్వత పరిష్కారం చూపుతామని కలెక్టర్ తెలిపారు.
జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ వరద ముంపుకు గురైన కుటుంబాలకు చెందిన వారందరూ పునరావాస కేంద్రానికి రావాలన్నారు. ఏవిషయాన్ని తెలికగా తీసుకోకుండా అదికారుల సూచనలను పాటించి సురక్షిత ప్రాంతంలో ఉండాలన్నారు. అక్కడ అవసరమైన వసతి, భోజన సౌకర్యాలను కల్పించడం జరుగుతుందన్నారు.
ఆదివారం తెల్లవారు జామునుంచి అప్పనవీడులోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను, పునరావస శిబిరాల్లో సౌకర్యాలను పర్యవేక్షిస్తున్న దెందులూరు శాసన సభ్యులు చింతమనేని ప్రభాకర్ స్ధానికంగా ఉన్న పలు సమస్యలను జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీల దృష్టికి తీసుకువచ్చారు. ఎన్ డి ఆర్ఎప్ బృందాలతో కలిసి అప్పన వీడు, హౌసింగ్ కాలనీలోని ప్రజలను బోటులద్వారా పునరావాస కేంద్రానికి తరలించడం జరిగిందన్నారు.
తొలుత అప్పనవీడు రహదారిపై ప్రవహిస్తున్న వరదనీరు మళ్లింపు చర్యలను వారు పరిశీలించారు.
వీరి వెంట ఏలూరు ఆర్డిఓ ఎన్ ఎస్ కె ఖాజావలి, పెదపాడు మండల ప్రత్యేక అధికారి డిపివో టి.శ్రీనివాస విశ్వనాధ్, ఆర్ డబ్ల్యూఎస్ ఎస్ఇ సత్యనారాయణ, స్ధానిక తహశీల్దారు, ఎంపిడివో తదితర అధికారులు ఉన్నారు. (Story : ముంపు ప్రాంతాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జెసి)