UA-35385725-1 UA-35385725-1

తెలుగులోనే జీవం.. మన జీవితం

తెలుగులోనే జీవం.. మన జీవితం

• పిల్లలకు తెలుగులో బోధనే మేలు
• తెలుగు బోధకులకు జీవో 77ఇబ్బందిగా ఉంది
• శ్రీ సూర్యరాయాంధ్ర నింఘంటువు పునర్ముద్రించాలి
• మాతృ భాష బోధించేవారి వేతనం ఎక్కువ ఉండాలనేది నా వ్యక్తిగత ఆకాంక్ష
• తెలుగు పరిరక్షణను అందరి బాధ్యతగా తీసుకోవాలి
• జీవితాంతం భాష కోసం ఉద్యమం చేసిన శ్రీ గిడుగు వారు తెలుగువారికి స్ఫూర్తి ప్రదాత
• తెలుగుభాషా దినోత్సవం కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 
• జీవో 77, శ్రీ సూర్యారాయాంధ్ర నిఘంటువు పునర్ముద్రణపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 

న్యూస్‌తెలుగు/ అమ‌రావ‌తి : ‘తెలుగు భాష వెలుగులు మసకబారడానికి ప్రతి ఒక్కరూ కారణమే. ఎవరిని ఎవరూ నిందించవలసిన అవసరం లేదు. తెలుగు భాష మాట్లాడేవారిని, తెలుగు బోధించే వారిని అవహేళన చేయడం కొంతకాలంగా ఎక్కువయింది. దీన్ని వెంటనే మానుకోవాలి. తెలుగులో మాట్లాడేవారిని చిన్నచూపు చూసే ఆలోచన మారాలి. మాతృభాషలో బోధించే వారికి వేతనాలు అధికంగా ఉండాలని నేను వ్యక్తిగతంగా కోరుకుంటాను. మన మాతృభాషలోని విశిష్టతను పాఠంగా తెలియజేసే వారికి వేతనం ఎక్కువే ఉండాలి. భావితరాలకు తెలుగు భాషలోని సొగసు, గొప్పదనం, అందం తెలియజేయాల’ని ఉప ముఖ్యమంత్రివర్యలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. తెలుగులో మాట్లాడటం యువత నామోషీగా భావించడం, ఆంగ్లంలో మాట్లాడే వారే గొప్పవారు అనే భావన కలగడం వల్ల క్రమేపీ భాష పట్ల నిర్లక్ష్యం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యావహారిక భాష ఉద్యమకారుడు శ్రీ గిడుగు వెంకట రామమూర్తి గారి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలుగు భాషా దినోత్సవంగా గురువారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విశిష్ట అతిధులుగా హాజరయ్యారు. రాష్ట్ర పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖామంత్రి కందుల దుర్గేష్ గారు అధ్యక్షత వహించారు. తొలుత శ్రీ గిడుగు వెంకట రామమూర్తి గారి చిత్ర పటానికి  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ , పుష్పాంజలి ఘటించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలుగు భాష, సంస్కృతుల పరిరక్షణకు శ్రమిస్తున్న వివిధ రంగాల్లోని 25 మందిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సత్కరించారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ‘‘మరాఠీ, తమిళం మాట్లాడేవారు వారి భాషలో ఎక్కడా ఆంగ్ల పదాలు లేకుండా, వాటికి ప్రత్యామ్నాయం వెతికి మాట్లాడుతారు. దాన్ని క్రమేపీ వాడుకలోకి తీసుకొస్తారు. వచ్చే తరానికి పూర్తి స్థాయి తెలుగు నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలుగులోనూ ప్రత్యామ్నాయ పదాలను సృష్టించి వాటిని భావితరాలకు అందించాల్సిన అవసరం ఉంది. దీనిపై భాషావేత్తలు దృష్టి సారించాలి.
• శ్రీ గిడుగు రామమూర్తి గారి పోరాటం ఓ స్ఫూర్తి
స్వతహాగా ఆంగ్లం, చరిత్రను బోధించే శ్రీ గిడుగు రామ్మూర్తి గారు తెలుగు వ్యవహారిక భాష కోసం చేసిన పోరాటం ఎప్పటికీ చరిత్రలో నిలిచి ఉంటుంది. తనకు అర్ధం కాని భాషలో ఉన్న కొన్ని పురాతన పత్రాలు చదవడానికి ఎంతో పరిశోధన చేసి దాన్ని నేర్చుకున్న గొప్ప వ్యక్తి శ్రీ గిడుగు రామమూర్తి గారు. అడవుల్లో ఉండే సవర్లు దోపిడీకి గురి అవుతున్నారని తెలుసుకొని, వారి కోసం సవర లిపిని కనిపెట్టి వారి అభ్యున్నతి కోసం పోరాడిన గొప్ప పోరాటయోధులు శ్రీ గిడుగు వారు. వినికిడి సమస్యతో జీవితాంతం గడిపినా భాష ఉద్యమాన్ని వదలకుండా ముందుకు నడిపిన ఆయన తెగువ ఈ తరానికి స్ఫూర్తిమంత్రం. వ్యవహారిక భాషతోనే పామరులకు కూడా భాష సులభంగా అర్ధం అవుతుందని భావించి తెలుగుకు అపార సేవలు చేసిన శ్రీ గిడుగు వారికి తెలుగు జాతి ఎప్పటికీ రుణపడి ఉంటుంది.
• తెలుగు బోధకులకు అండగా నిలుస్తాం
భాష భావి తరాలకు అందించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. తెలుగు బోధకులకు పదోన్నతుల్లో జరుగుతున్న అన్యాయంపై ఇటీవల కొందరు తెలుగు పండితులు నన్ను కలిశారు. గతంలో తీసుకొచ్చిన జీవో నంబరు 77 వల్ల తెలుగు బోధకులకు ఇబ్బందికరంగా ఉందని చెప్పారు. దీనిపై సమగ్ర పరిశీలన చేసి వారికి తగిన న్యాయం చేసేలా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నారు. అలాగే ఎంతో పాశస్త్యం ఉన్న శ్రీ సూర్యరాయంధ్ర నిఘంటువును తిరిగి పునర్ ముద్రించి, వ్యాప్తిలోకి తీసుకురావాలన్నది నా అభిలాష. పిఠాపురం మహారాజా సహకారంతో ఏడు భాగాలుగా శ్రీ సూర్యారాయాంధ్ర నిఘంటువు రూపుదిద్దుకుంది. తరవాతి కాలంలో పలు ముద్రణలు చేశారు. 1982 తరవాత ముద్రించలేదు. ఆ నిఘంటువును ముద్రింపచేయాలని నేను కొన్ని ప్రయత్నాలు చేశాను. ఆ నిఘంటువు ఈ తరానికి అందాలి. తెలుగును పూర్తిస్థాయిలో అర్ధం అయ్యేలా భావితరాలకు ఈ నిఘంటువు ఉపయోగపడుతుంది. భాష అనేది మన గుర్తింపు. భాష అనేది మన ఉనికి. దాన్ని పరిరక్షించుకోకపోతే మనకు, భావితరాలకు తీవ్రమైన నష్టం తప్పదు. భాషా పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది’’ అన్నారు.
• రాష్ట్ర ముఖ్యమంత్రివర్యుల సానుకూల స్పందన
ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జీవో 77, శ్రీ సూర్యారాయాంధ్ర నిఘంటువు పునర్ముద్రణపై సానుకూలంగా స్పదించారు. ముఖ్యమంత్రివర్యులు ప్రసంగిస్తూ “భారతదేశంలో ఎక్కువమంది మాట్లాడే నాలుగో భాషగా తెలుగుకు గుర్తింపు ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో ప్రజలు ఎక్కువగా మాట్లాడే 11వ భాషగా తెలుగు వర్ధిల్లుతోంది. తెలుగు వారు ఎక్కడికి వెళ్లినా తమ మూలాలు మర్చిపోరు. విదేశాల్లో నివసించే వారికి తెలుగు గొప్పదనం, మన సంస్కృతి సంప్రదాయాలంటే మక్కువ ఎక్కువ. తెలుగు బోధకులకు గతంలో తీసుకొచ్చిన జీవో నంబరు 77 వల్ల పదోన్నతుల్లో అన్యాయం జరుగుతోందని శ్రీ పవన్ కళ్యాణ్ గారు నా దృష్టికి తీసుకొచ్చిన విషయాన్ని వెంటనే పరిశీలిస్తాను. అలాగే ఆయన కోరినట్లు శ్రీ సూర్యరాయంధ్ర నిఘంటువును రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పునర్ముద్రించే ఏర్పాట్లు చేస్తాం. భాష మన మూలం. దాన్ని కాపాడుకోవడానికి అంతా కట్టుబడి ఉందాం. నాది తెలుగు నేల. మాది ఆంధ్రప్రదేశ్ అని గొప్పగా చెప్పుకొనే రోజులు త్వరలోనే వస్తాయి’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీ గిడుగు రామ్మూర్తి పంతులు గారి మునిమనవడు శ్రీ గిడుగు నాగేశ్వరరావు, మునిమనవరాలు శ్రీమతి గిడుగు క్రాంతికృష్ణలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున సత్కరించారు. కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్, ఎక్సైజ్, గనుల శాఖ మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర, ఎంపీ శ్రీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. (Story : తెలుగులోనే జీవం.. మన జీవితం)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1