మూడో విడత పూర్తికాగా మిగిలిన ఇంజనీరింగ్ సీట్లు ఎన్నంటే?
ఇంజనీరింగ్ తుది, మూడవ విడతలో 5707 సీట్లు భర్తీ
సాంకేతిక విద్యా శాఖ సంచాలకులు గణేష్ కుమార్
న్యూస్తెలుగు/అమరావతిః ఇంజనీరింగ్ ప్రవేశాలకు నిర్దేశించిన ఎపిఈఎపిసెట్ 2024 కౌన్సిలింగ్ ప్రక్రియలో భాగంగా సోమవారం తుది, మూడవ విడత సీట్ల కేటాయింపును పూర్తి చేసినట్లు సాంకేతిక విద్యా శాఖ సంచాలకులు, ప్రవేశాల కన్వీనర్ గుమ్మల గణేష్ కుమార్ తెలిపారు. విధ్యార్ధులు ఆగస్టు 26 నుండి 30వ తేదీ లోపు తమకు నిర్దేశించిన కళాశాలల్లో ఆన్ లైన్ రిపోర్టింగ్ తో పాటు, వ్యక్తిగతంగా కళాశాలలో నమోదును పూర్తి చేయవలసి ఉందన్నారు. అయితే జులై 19 నుండే తరగతులు ప్రారంభం అయ్యాయని వివరించారు. కన్వీనర్ కోటా కింద 24 విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాలల్లో 7047 సీట్లు ఉండగా, 5920 సీట్లు భర్తీ అయ్యాయన్నారు. 215 ప్రవేటు కళాశాలల్లో 1,24,491 సీట్లు ఉండగా, 1,02, 669 భర్తీ అయ్యాయని, 9 ప్రవేటు విశ్వవిద్యాలయాల్లో 7950 సీట్లు ఉండగా, 7744 సీట్లు భర్తీ చేసామని తెలిపారు. మొత్తంగా 248 కళాశాలల్లో 1,39,488 సీట్లు ఉండగా, 1,16, 333 సీట్లు భర్తీ అయ్యాయని, 23,155 సీట్లు మిగిలి ఉన్నాయని గణేష్ కుమార్ వివరించారు. (Story : మూడో విడత పూర్తికాగా మిగిలిన ఇంజనీరింగ్ సీట్లు ఎన్నంటే?)