కార్పొరేట్ల అనుకూల లేబర్ కోడ్ ల అమలుతో కార్మిక వర్గానికి చీకటి రోజులు
కార్మిక హక్కులు కాలరాసే లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలి పాత కార్మిక చట్టాలను అమలు చేయాలి
న్యూస్ తెలుగు/కర్నూలు : కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులు కాలరాసి కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో తెచ్చిన కార్పొరేట్లకు అనుకూలమైన 4 లేబర్ కోడ్ లను అమలు చేయనున్న 2026 ఏప్రిల్ 1 కార్మిక వర్గానికి బ్లాక్ డే* చీకటి రోజులు మొదలైనట్లేనని అందుకే కార్మిక హక్కులు కాలరాసే లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని పాత కార్మిక చట్టాలను అమలు చేయాలని ఏఐటీయూసీ,సిఐటియు సంఘాలు డిమాండ్ చేశాయి.లేబర్ కోడ్ ల అమలును నిరసిస్తూ బ్లాక్ డే పాటించాలన్న అఖిల భారత ట్రేడ్ యూనియన్ లు ఇచ్చిన పిలుపులో భాగంగా బుధవారం ఏఐటీయూసీ,సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక కోట్ల సర్కిల్ లో నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బి. రాజు, సిపిఎం మండల కార్యదర్శి గఫుర్ మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్‌ల అమలు పేరుతో ఇప్పటి వరకు ఉన్న కార్మిక చట్టాల రక్షణ కవచాన్ని కార్మిక ద్రోహులు నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆయనకు వంత పాడుతున్న నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాలు చిద్రం చేస్తున్నాయని ఎన్నో పోరాటాలు,ప్రాణ త్యాగాలతో కార్మిక వర్గం రక్తం చిందించి సాధించుకున్న హక్కులపై కార్పొరేట్లకు లాభాలను దోచిపెట్టడమే లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ కనుసన్నలలోని కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తున్నదన్నారు.ఇది యూనియన్ల ఏర్పాటుకు అడ్డంకులు,సమ్మె హక్కుపై ఆంక్షలు,8 గంటల పని విధానాన్ని తుంగలో తొక్కడం పని గంటల పెంపు,శాశ్వత ఉద్యోగాల స్థానంలో కాంట్రాక్టు,గిగ్ పనులు,భద్రతా చర్యలకు తూట్లు పొడవడం తదితర చర్యలతో తెచ్చిన లేబర్ కోడ్ లు దేశ వ్యాప్తంగా కార్మికుల జీవితాలకు ప్రమాద ఘంటికలు మోగించబోతున్నాయి అన్నారు.కార్మిక వర్గం మనుగడ సాగించాలంటే లేబర్ కోడ్‌ల రద్దు తప్ప మరో మార్గం లేదని వారు అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను విడినాడాలని లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలని,పాత కార్మిక చట్టాలనే అమలు చేయాలని,విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని,గ్రామీణ పేదల ఉపాధి హక్కును దిగమింగిన కేంద్రం తీరు గర్హనీయమని మహాత్మా గాంధీ పేరుని తొలగించడం హేయమైన చర్య అని దానిని యథాతతంగా పునరుద్ధరించాలని,ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలని,సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని,కనీస వేతనం 26,000 ఇవ్వాలని,స్కీం వర్కర్లను కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని,రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని,రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని,సిపిఎస్ రద్దు చేయాలని పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని,ప్రభుత్వ సంస్థల విక్రయాలను ఆపాలని,బ్యాంకు ఉద్యోగులకు వారంలో ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.కార్పొరేటు-మతతత్వ కూటమి ప్రభుత్వాలు సాగిస్తున్న కార్మిక ప్రజా కంటక పాలనకు వ్యతిరేకంగా కార్మికులు ఉద్యోగులు ఉపాధ్యాయులు రైతులు వ్యవసాయ కార్మికులతో సహా సమస్త శ్రమజీవులు ఐక్య పోరాటాలకు సిద్ధం కావలసిన సమయం ఆసన్నమైందన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ, సీఐటీయూ సంఘాల నాయకులు మద్దూర్ చిన్న రాముడు, వీరన్న, మధు, విశ్వనాధ్, సులోచన,చేనేత రాష్ట్ర నాయకులు మాధవ స్వామి, సిపిఐ జిల్లా సమితి సభ్యులు కృష్ణ,హమాలీ, ఆటో యూనియన్, జీపు డ్రైవర్స్ అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.(Story : కార్పొరేట్ల అనుకూల లేబర్ కోడ్ ల అమలుతో కార్మిక వర్గానికి చీకటి రోజులు )

