ఫిబ్రవరి 19న నిర్వహించనున్న “రచ్చ బండ” కార్యక్రమానికి వైఎస్ షర్మిల రాక
న్యూస్ తెలుగు/వినుకొండ : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి ఉపాధి హామీ పథకం పరిరక్షణలో భాగంగా ఫిబ్రవరి 19 గురువారం ఉదయం 10 గంటలకు వినుకొండ నియోజకవర్గం శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామంలోని కళామందిర్ సెంటర్లో నిర్వహించనున్న “రచ్చ బండ” కార్యక్రమానికి విచ్చేయనున్నట్లు పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గార్నెపూడి అలెగ్జాండర్ సుధాకర్, వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బోయపాటి రామాంజనేయులు సంయుక్తంగా తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ. ఉపాధి హామీ పథకం విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పథకం పేరును మార్చి, 60:40 నిష్పత్తిలో నిధుల విడుదల విధానాన్ని అమలు చేస్తూ రాష్ట్రాలపై ఆర్థిక భారం మోపుతున్నదని వారు విమర్శించారు. దీని వల్ల కార్మికులకు సమయానికి వేతనాలు అందకపోవడం, పనుల ఆమోదంలో ఆలస్యం జరుగుతుండడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ కార్మికుల హక్కుల పరిరక్షణ, పెండింగ్ బకాయిల చెల్లింపులు, నిధుల పూర్తిస్థాయి విడుదల వంటి అంశాలపై చర్చించి, ప్రజల అభిప్రాయాలను సేకరించడానికి ఈ “రచ్చ బండ” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. కావున వినుకొండ నియోజకవర్గ ప్రజలు, ఉపాధి హామీ కార్మికులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి రెడ్డిబోయిన ప్రసన్నకుమార్, జిల్లా అసంఘటిత కార్మిక జిల్లా అధ్యక్షులు పిడుగు విజయకుమార్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జనరల్ సెక్రటేరి పఠాన్ కరిముల్లా ఖాన్, తదితరులు పాల్గొన్నారు.(Story : ఫిబ్రవరి 19న నిర్వహించనున్న “రచ్చ బండ” కార్యక్రమానికి వైఎస్ షర్మిల రాక )

