ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన శిక్ష
న్యూస్ తెలుగు/వనపర్తి : జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన శిక్ష తప్పదని అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్యా నాయక్ హెచ్చరించారు.బుధవారం అదనపు కలెక్టర్ జిల్లాలోని శ్రీరంగాపూర్, వీపనగండ్ల మండలాల్లోని వివిధ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరియు రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేశారు.వీపనగండ్ల మండలం గోపాల్ దిన్నె ధాన్యం కొనుగోలు కేంద్రంలో (PPC) అక్రమాలు జరుగుతున్నాయన్న వార్తలపై అదనపు కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ అయిన వ్యక్తి పై తక్షణమే FIR నమోదు చేయాలని సెంటర్ ఇన్చార్జిలను ఆదేశించారు. ఈ విషయంలో సంబంధిత సబ్ ఇన్స్‌పెక్టర్ (SI) తో మాట్లాడి, కేసు నమోదు చేసి విచారణ చేయాలని సూచించారు. ధాన్యం కొనుగోలులో రైతులకు నష్టం కలిగిస్తూ అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదన్నారు. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా వారిని జైలుకు పంపిస్తాం అని అదనపు కలెక్టర్ హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు సజావుగా సాగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని తేమ శాతం పరీక్షించిన వెంటనే తూకం వేయాలని సూచించారు. తూకం పూర్తయిన ధాన్యాన్ని వెంటనే కేటాయించిన రైస్ మిల్లులకు తరలించాలన్నారు. రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు సకాలంలో జమ అయ్యేలా ఇన్చార్జిలు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. శ్రీరంగాపూర్ మండలం కంబాలాపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన రైస్ మిల్లును సందర్శించి మిల్లులోని సౌకర్యాలను, ధాన్యం నిల్వ సామర్థ్యాన్ని పరిశీలించి, మిల్లు యజమానులకు సీఎంఆర్, ధాన్యం దించుకోవడంపై తగిన సూచనలు చేశారు. జిల్లా పౌరసరఫరాల అధికారి కాశీ విశ్వనాధ్, డి ఎం జగన్, రెవెన్యూ సిబ్బంది మరియు సెంటర్ ఇన్చార్జిలు అదనపు కలెక్టర్ వెంట ఉన్నారు.(Story : ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన శిక్ష )

