నిబంధనలకు అనుగుణంగా విద్యాసంస్థల బస్సులు నడపాలి..
మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శివ నాగేశ్వరరావు
న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ పట్టణం, నియోజకవర్గంలోని అన్ని మండలాలలో తిరిగే విద్యాసంస్థల బస్సులు నిబంధనలకు అనుగుణంగా, మచి కండిషన్లో ఉండాలని, లేనిచో బస్సులు సీజ్ చేయడం జరుగుతుందని నరసరావుపేట మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎన్ శివ నాగేశ్వరరావు అన్నారు. బుధవారం స్థానిక ఎన్ఎస్పి గ్రౌండ్ ఆవరణలో విద్యాసంస్థల యాజమాన్యానికి, డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో విద్యా సంస్థలకు సంబంధించిన 60 బస్సులను ఎన్ఎస్పి గ్రౌండ్ కు రప్పించారు. ఈ సందర్భంగా వెహికల్ ఇన్స్పెక్టర్ శివ నాగేశ్వరరావు, బ్రేక్ ఇన్స్పెక్టర్లు పవన్ కుమార్, వంశీకృష్ణ లు బస్సులన్నింటినీ కండిషన్ ఎలా ఉన్నాయి తనిఖీలు నిర్వహించారు. బస్సులో విధిగా ఎమర్జెన్సీ డోర్స్, ఫైర్ నియంత్రణ బాక్స్ తప్పనిసరిగా ఉండాలని ఆయా బస్సుల యాజమాన్యాన్ని డ్రైవర్లను హెచ్చరించారు. అలాగే బస్సు డ్రైవర్లు 60 సంవత్సరాలు లోపు వారు మాత్రమే బస్ డ్రైవింగ్ చేయాలని, నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్సులు రద్దుచేసి వారిని తొలగించడం జరుగుతుందన్నారు. అలాగే ప్రతి బస్సుకు నిబంధనలకు అనుగుణంగా తగిన పత్రాలు ఉండాలన్నారు. బాల బాలికలు బస్సులు ఎక్కే సమయంలో, దిగే సమయంలో డ్రైవర్లు అతి జాగ్రత్తగా అవగాహన కలిగి ఉండాలన్నారు. బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్సులు విధిగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా కొన్ని కండిషన్స్ లోపం ఉన్న బస్సులను గుర్తించడం జరిగింది. ఆ లోపాలన్నీ పూర్తి చేసిన తర్వాత బస్సులను తిప్పాలని ఇన్స్పెక్టర్ శివ నాగేశ్వరరావు సూచించారు.(Story:నిబంధనలకు అనుగుణంగా విద్యాసంస్థల బస్సులు నడపాలి..)

