ఫోర్జరీ సంతకంతో పంచాయితీ నిధులు డ్రా చేసిన పొట్లూరు పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలి
న్యూస్ తెలుగు /వినుకొండ :
శావల్యాపురం మండలం పొట్లూరు వైసిపి గ్రామ సర్పంచ్ పోపూరి జ్యోతి సంతకాన్ని గ్రామ కార్యదర్శి ఫ్రాన్సిస్ ఫోర్జరీ చేసి 15వ ఆర్థిక సంఘానికి సంబంధించిన నిధులు 7 లక్షల రూపాయలు నిధులు డ్రా చేసుకున్నాడని, ఇది టిడిపి నేతలు సహకారంతోనే జరిగిందని, ఆదివారం వినుకొండ వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధిత సర్పంచ్ వాపోయారు. ఆమెతోపాటు వైసీపీ మండల కన్వీనర్ బోడిపూడి వెంకటేశ్వర్లు, వైసిపి రాష్ట్ర ప్రతినిధి జుజ్జురి ఐ. రామమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ. గ్రామ కార్యదర్శి తమ సంతకాన్ని ఫోర్జరీ చేసి విడతల వారీగా నగదు డ్రా చేసిన విషయం స్థానిక ఎమ్మెల్యే దృష్టి కూడా తీసుకువెళ్లామని, ఈ విషయాన్ని ఈనెల 18వ తేదీన లిఖిత పూర్వకంగా శావల్యాపురం ఎంపీడీవో కి ఫిర్యాదు కూడా చేశామన్నారు. తన భర్త గ్రామ కార్యదర్శి కి ఫోన్ చేసి ఈ విషయాన్ని అడగ్గా, నీకు చెప్పేది ఏంటి బెదిరింపు ధోరణితో మాట్లాడారని, దీనికి మండల టిడిపి నేతలు కార్యదర్శి కి కొమ్ము కాస్తున్నారన్నారు. 9వ నెల 22 తేదీ నుండి 11వ నెల 12వ తేదీ వరకు విడతల వారీగా 6 మార్లు 7 లక్షల రూపాయలు నిధులు డ్రా చేసినట్లు వైసిపి నేతలు వెల్లడించారు. చిన్న కులాలు గ్రామాల్లో ప్రజాప్రతినిధులుగా ఉంటే, ఇలా భయపెట్టి నిధులు డ్రా చేస్తారా, ఇదేనా గ్రామ స్వరాజ్యం అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గ్రామ కార్యదర్శి వల్ల తనకు తన కుటుంబానికి తీవ్ర ఇబ్బందులు, మానసిక ఒత్తిడి వస్తున్నది అన్నారు. కాగా తమ ఎస్సీ కాలనీలో డ్రైనేజీల కోసం జూలై నెలలో తీర్మానం తీసుకొని ఆగస్టు నెలలో పనులు ముగించి, సెప్టెంబర్ మాసంలో ఎం బుక్ రిజిస్టర్ చేయించినప్పటికి, నేటి వరకు తన బిల్లులను ప్రాసెస్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆమె వాపోయింది. తక్షణం ఉన్నతాధికారులు, ప్రభుత్వం జోక్యం చేసుకొని కార్యదర్శిని అరెస్టు మరియు సస్పెండ్ చేసి నిధులు రాబట్టి బాధిత సర్పంచ్ జ్యోతికి ఆత్మస్థైర్యం కలిగించే విధంగా చూడాలని, లేనిచో రాజ్యాంగ విలువల కోసం ఆందోళన చేయబడతామని ఐ. రామ్మూర్తి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.(Story:ఫోర్జరీ సంతకంతో పంచాయితీ నిధులు డ్రా చేసిన పొట్లూరు పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలి)

