సాయుధ రైతాంగ పోరాటం ప్రజా ఉద్యమాలకు స్ఫూర్తి: శ్రీరామ్
న్యూస్‌తెలుగు/ వనపర్తి :తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం తర్వాత వచ్చిన అనేక ప్రజా ఉద్యమాలకు స్ఫూర్తి అని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీరామ్ అన్నారు. ఈనెల ఒకటి నుంచి 17 వరకు జిల్లాలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను పురస్కరించుకొని గోపాల్పేట మండల కేంద్రం, ఏదుట్ల గ్రామాల్లో ఉత్సవాలను నిర్వహించారు. పార్టీ పతాకాలను ఎగరవేసి, తెలంగాణ సాయుధ పోరాట యోధుల చిత్రపటానికి పూలమాలలు వేసి ఇవాళ అర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంతో నిజాం నుంచి విముక్తి లభించడమే గాక వెట్టిచాకిరికి చలన గీతం పాడిందన్నారు. సాయుధ పోరాటంలో 10 లక్షల ఎకరాలను పేదలకు పంచిన ప్రభావంతో తెలంగాణలో పేదలకు వేల ఎకరాల ప్రభుత్వ భూములను కమ్యూనిస్టుల పోరాటంతో పేదలకు పెంచడం జరిగిందన్నారు. పేదల హక్కులను ఆస్తులను కాపాడేందుకు సిపిఐ నిరంతరం పోరాడుతుందన్నారు. ఎంతమంది పాలకులు వచ్చిన ఎన్ని ప్రభుత్వాలు మారిన చివరకు ఎర్రజెండాకు అధికారంతోనే న్యాయం జరుగుతుందన్నారు. ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ జిల్లా గౌరవ అధ్యక్షురాలు కళావతమ్మ, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జె. చంద్రయ్య, వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్, ఎన్ఎఫ్ఐ డబ్ల్యు జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి, వనపర్తి టౌన్ కన్వీనర్ జయమ్మ, గోపాల్పేట సిపిఐ మండల కార్యదర్శి మంకలి శాంతన్న, సహాయ కార్యదర్శి కురుమూర్తి, ఏదుట్ల గ్రామ కార్యదర్శి కోటయ్య, బుచ్చన్న, రహీం, తహర్, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.(Story:సాయుధ రైతాంగ పోరాటం ప్రజా ఉద్యమాలకు స్ఫూర్తి: శ్రీరామ్)

