వాస్తవాలు దాచి ప్రజల్ని తప్పుదోవ పట్టించే కుట్రలు
వైసీపీ అధ్యక్షుడు జగన్ విమర్శలపై చీఫ్ విప్ జీవీ ధ్వజం
న్యూస్ తెలుగు /వినుకొండ : వైసీపీ ఐదేళ్ల పాపాలు దాచిపెట్టి కూటమి ప్రభుత్వంపై బురదజల్లుతూ ఏదో జరిగిపోతోందని జగన్ రెడ్డి ప్రజల్ని తప్పుదోవ పట్టించే కుట్రలు చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం, అమరావతి పరుగులు ఒకవైపు, సామాజిక పింఛన్లకే ఏటా రూ.34వేల కోట్లు చేస్తున్న ఖర్చు మరోవైపు ఉండగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కనిపించడం లేదంటే అతడి కళ్లు ఎంతగా మూసుకుని పోయాయో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు, వ్యవసాయ మంత్రి గురించి మాట్లాడుతున్న ఇదే జగన్, వైసీపీని ప్రజలు అధికారం నుంచి దించి పాతరేసిన సంగతి మరిచిపోతే ఎలా అని చురకలు వేశారు. బుధవారం ప్రెస్మీట్లో కూటమి ప్రభుత్వంపై జగన్ విమర్శలకు చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు కౌంటర్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడేముందు జగన్ 5ఏళ్ల నిర్వాకాలు అద్ధంలో చూసుకోవాలన్నారు. జగన్ 5ఏళ్ల పాలనలో ఏపీ రైతుల తలసరి అప్పుల్లో ఏపీ నంబర్-1లో నిలిచిందని, నాటికి ఒక్కొక్క రైతు నెత్తిన రూ.2.43లక్షల చొప్పున అప్పులు ఉన్నట్లు గణాంకాలే చెప్పాయన్నారు. అదే 5ఏళ్లు రైతు ఆత్మహత్యల్లో ఏపీ దేశంలో 3వ స్థానంలో, కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో ఎందుకు నిలిచిందో చెప్పాలన్నారు. కరవు కోరల్లో చిక్కుకున్న రాయలసీమ రైతాంగంపై కనీస కనికరం చూపలేదని, ఆప్రాంతానికి 5 ఏళ్లలో ఒక్కటంటే ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయకుండా చరిత్రహీనులుగా మిగిలిపోయింది అప్పుడే మరిచిపోతే ఎలా అని తూర్పారబట్టారు. ఆర్బీకేల గురించి గొప్పగా చెప్పిన ఇదే జగన్ పాలన లో ధాన్యం కొనుగోళ్లకు కనీసం గోనె సంచులు ఇవ్వని దుస్థితి చూశామన్నారు. వారి పాలనలో ఉచితపంటల బీమాను గందరగోళంగా మార్చిన కారణంగా పదిసార్లు వివిధ రకాల ప్రకృతి విపత్తులతో 60 లక్షల ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిని రూ.30 వేల కోట్ల నష్టం వాటిల్లినప్పు కూడా రైతులకు సరైన పరిహారం దక్కలేదన్నారు. అవేగాక నాటి ఎన్నికలకు ముందు రూ.3వేల కోట్లతో ధరల వ్యవసాయ ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని మాట తప్పారని, ఇప్పుడు మళ్లొచ్చి ధరలస్థిరీకరణకు 7వేల కోట్లు ఖర్చు చేశామని నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. వైకాపా బకాయిలు పెట్టి పోయిన ధాన్యం డబ్బులు రూ.1674కోట్లు కూటమి వచ్చాక చెల్లించడమే ఎవరేం చేశారో, చేయలేదో చెప్పడానికి నిదర్శన మన్నారు. రాష్ట్రంలో ప్రతిపంటకు మద్దతుధరలు అందిస్తున్నామని, ధరలు లేనప్పుడు ప్రభుత్వమే కొంటు న్నామని, ఆ వాస్తవాలన్నీ కూడా జగన్ ప్రెస్మీట్లో చెప్పి ఉంటే బావుండేదన్నారు. అలానే 17 మెడికల్ కాలేజీలపైనా శుద్ధ తప్పుడు ప్రచారం చేస్తున్నారని తిప్పికొట్టారు. వారి హయాంలో 17 మెడికల్ కాలేజీలు మొదలు పెట్టామని చెప్పుకుంటున్న జగన్ వాటిని ఎందుకు పూర్తి చేయలే దో కూడా వివరించి ఉండాల్సిందన్నారు. 8వేల 480కోట్లు అవసరమైన చోట కనీసం 1500కోట్లు కూడా ఖర్చు చేయకుండా కేవలం అయిందింటి మమా అనిపించి మిగిలిన వాటిని గాలికి వదిలేయడం నిజమో కాదో తెలియజేయాలన్నారు. చివరకు పులివెందుల మెడికల్ కాలేజీకే ఎన్ఎంసీ గుర్తింపు రాలేదంటే వాటి విషయంలో జగన్ విజన్, చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చన్నారు. నాడు ఆగిపోయిన వైద్యకళాశాలల్ని ఎలాగైనా పూర్తి చేయాలని సంకల్పిస్తేదానిపైనా బురద జల్లడం జగన్ చెల్లిందన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో వైద్య రంగానికి 4% బడ్జెట్ కేటాయిస్తే దాన్ని వైసీపీ ప్రభుత్వం 1%కి తగ్గించిందని… ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని, జగన్, వైకాపా తీరుకు సరైన సమయంలో సమాధానం చెబుతారన్నారు.(Story:వాస్తవాలు దాచి ప్రజల్ని తప్పుదోవ పట్టించే కుట్రలు)

