పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం
న్యూస్ తెలుగు/ వనపర్తి : రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమంతో పాటు సామాజిక న్యాయంలో సైతం తెలంగాణ దేశానికి దిశా నిర్దేశం చేస్తుందని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ ఎన్ ప్రీతం అన్నారు. సోమవారం జిల్లా ఐడిఓసి ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రీతం హాజరయ్యారు. ముఖ్యఅతిథితోపాటు వేదికపై జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ రావుల గిరిధర్, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, వనపర్తి మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ముఖ్యఅతిథి ముందుగా కలెక్టర్, శాసనసభ్యులతో కలిసి తెలంగాణ అమరవీరుల స్థూపానికి పుష్పగుచ్చంతో నివాళి అర్పించారు. అనంతరం పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా యంత్రాంగం తరుపున ముఖ్య అతిథికి ఘన స్వాగతం పలికారు.అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, ప్రజలకు శుభాకాంక్షలను తెలిపారు. అనంతరం జయ జయ హే తెలంగాణ గీతాలాపన చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని వివరించారు. రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమంతో పాటు సామాజిక న్యాయంలో సైతం తెలంగాణ దేశానికి దిశా నిర్దేశం చేస్తుందని తెలిపారు.
రాష్ట్రం ఆవిర్భవించి నేటితో 11 ఏళ్ళు నిండాయని తెలిపారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా పయనిస్తోందన్నారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం, గృహాలకు ఉచితంగా విద్యుత్తును అందించే గృహజ్యోతి కల్పించినట్లు తెలిపారు. భూభారతి చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చి రాష్ట్రంలో భూ సమస్యలను గుర్తించి సత్వర పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ వేదికపై ఆవిష్కరించడంలో విజయం సాధించామని, అమెరికా, దక్షిణ కొరియా, సింగపూర్, దావోస్, జపాన్ దేశాలలో పర్యటించి భారీగా ప్రభుత్వం పెట్టబడులను సాధించిందన్నారు. హైదరాబాద్ వేదికగా ఏఐ గ్లోబల్ సమ్మిట్, బయో ఏషియా సదస్సు, ప్రపంచ సుందరీమణుల పోటీలను ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిందన్నారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధులకు, తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం పోరాడిన వారి కుటుంబ సభ్యులను సత్కరించి గౌరవించారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలలకు చెందిన చిన్నారులు చేసిన సాంస్కృతిక నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఐడిఓసి ఆవరణలో పోలీస్ శాఖ, ఎస్సీ కార్పొరేషన్, జిల్లా సంక్షేమ శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, జిల్లా వైద్యశాఖ, జిల్లా వ్యవసాయ శాఖ, పురపాలక, గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాళ్లను ముఖ్య అతిథితో పాటు, కలెక్టర్, ఎమ్మెల్యే సందర్శించి తిలకించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, సిబ్బంది, ప్రజలు, విద్యార్థులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఇతరులు పాల్గొన్నారు.(Story : పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం )

