ప్రజలే దేవుళ్లుగా పనిచేస్తున్న ఏకైక రాజకీయపార్టీ తెలుగుదేశం
వినుకొండలో ఘనంగా నియోజకవర్గస్థాయి మహానాడు
మహానాడులో పాల్గొన్న తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ లావు, చీఫ్ విప్ జీవీ
మహానాడులో పాల్గొన్న ఎమ్మెల్సీ ఆలపాటి, డీసీసీబీ చైర్మన్ మక్కెన, కొమ్మాలపాటి శ్రీధర్
న్యూస్ తెలుగు/వినుకొండ : దేశంలోనే ప్రజలే దేవుళ్లుగా పనిచేస్తున్న ఏకైక రాజకీయపార్టీ తెలుగుదేశం మాత్రమే అంటూ ముక్తకంఠంతో పల్నాడు జిల్లా ముఖ్యనాయకులంతా నినదించారు. పేదవాడికి పట్టెడన్నం, ఆత్మ గౌరవం, ఆర్థిక అభ్యున్నతే లక్ష్యంగా ఎన్టీఆర్ ఏ ఆశయాలతో పార్టీని ప్రారంభించారో, వాటినే ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకు తీసుకుని వెళ్తున్నారని తెలిపారు. ఈ నెల 27నుంచి కడప వేదికగా జరగబోతున్న తెలుగుదేశం పార్టీ మహానాడుకి సన్నాహాకంగా సోమవారం వినుకొండలో నియోజకవర్గ స్థాయి మహానాడును నిర్వహించారు. గడిచిన ఏడాది సాగించిన పోరాటాలు, సాధించిన విజయాలు గుర్తుచేసుకుంటునే రానున్న ఏడాదికి సన్నద్ధం కావడానికి ఈ సందర్భాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వినుకొండలో ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆధ్వర్యంలో నియోజకవర్గస్థాయి మహానాడు నిర్వహించారు. తిమ్మాయపాలెం రోడ్డులోని వై కన్వెన్షన్ హాలులో నియోజకవర్గ స్థాయి మహానాడు సోమవారం ఘనంగా జరిగింది. ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్, జీడీసీసీబీ ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, తదితరులు పాల్గొన్నారు. ముందుగా తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం తెదేపా వ్యవస్థాపకులు దివంగత నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో అంతా కలిసి ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. 27 నుంచి 29వ తేదీ వరకు కడపలో జరగనున్న రాష్ట్ర మహానాడును విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. ఐదేళ్ల పాటు రాక్షస పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాడిన మన నాయకులు, కార్యకర్తలకు తగిన గుర్తింపు లభిస్తుందని.. కాస్త ఓపిక పట్టాలని పేర్కొన్నారు. తెదేపా పేద, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పుట్టిందని, ప్రజల సంక్షేమం ఓ వైపు.. రాష్ట్ర అభివృద్ధి మరోవైపుతో తనదైన ముద్ర వేసుకుంటుందని అభిప్రాయపడ్డారు నేతలు. రాష్ట్రంలో పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నారని అలాగే నియోజకవర్గంలోనూ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు, సైనికుల్లా పనిచేయాలని జీవీ ఆంజనేయులు పిలుపునిచ్చారు. పలు తీర్మానాలపై చర్చించి నియోజకవర్గ, మండలస్థాయి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధుల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఎన్టీఆర్ కు భారతరత్న, వరికపూడిశెల ప్రాజెక్టు నిర్మాణం, అగ్రికల్చర్, వెటర్నరీ కళాశాలల ఏర్పాటు, లెదర్ పార్కు, బొల్లాపల్లిలో ఇండస్ట్రియల్ పార్కు అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులందరికీ బోర్లు, ఎస్టీ గిరిజన ఆశ్రమ పాఠశాల మంజూరు, పి.ఎం.జి.ఎస్.వై. పథకం కింద మైనర్ ఇరిగేషన్ చెరువులను ఆర్ఆర్ఆర్ పథకం కింద అభివృద్ధి చేయాలని తీర్మానించారు. ఈ సందర్భంగా మొదట మాట్లాడిన తెలుగుదేశం పార్టీ లోక్‌సభా పక్ష నాయకుడు, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎన్టీఆర్ హయాం నుంచి తెలుగుదేశం పార్టీ అంటే అభివృ ద్ధి, సంక్షేమానికి పర్యాయపదంగా నిలిచిందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా అదే స్ఫూర్తిని ముందుకు తీసుకుని వెళ్లాలని సూచించారు. భవిష్యత్‌లోనూ ఆ పేరు నిలబెట్టాలన్నారు. వ్యక్తిగతంగా మనకేం కావాలి అన్నదానికంటే మన ఊరికి, ప్రాంతానికి అవసరమైన వాటిపై దృష్టి పెట్టాలని సూచించారు. కేంద్రపథకాలు సద్వినియోగం చేసుకోవాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఉన్న రాయితీలను ఉపయోగించు కోవాలన్నారు. అనంతరం చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ సమాజంలో వెనకబడిన వర్గాల అభ్యున్నతి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశంలో ఉన్నందుకు ప్రతిఒక్కరు ఎంతో గర్వపడాలన్నారు. మహిళలకు ఆస్తిహక్కు, రూ.2కే కిలోబియ్యం వంటి కార్యక్రమాల ద్వారా ఎన్టీఆర్ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అన్నమాటకు నిజమైన అర్థం చెప్పారన్నారు. తెలుగునాట బీసీలకు రిజర్వే షన్లు కల్పించి వారి రాజకీయ చైతన్యం, నాయకత్వానికి బాటలు వేసింది ఎన్టీఆర్, చంద్రబాబే అన్నారు. ఎన్టీఆర్ ఏ ఆశయాలైతే సాధించాలని అనుకున్నాదే అదే దిశగా పార్టీని చంద్రబాబు నడిపిస్తున్నారని తెలిపారు. తెలుగుదేశం ఈ దఫా ప్రభుత్వంలో బీసీల రక్షణకు ప్రత్యేకచట్టం చేసిన చంద్రబాబు పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతుందన్నారు. రాష్ట్రంలో పేదల పింఛన్ రూ.4వేలు చేసిన ఘనత తెలుగుదేశం, చంద్రబాబుకే చెందుతుందన్నారు. ఇలాంటి తరుణంలో ఎన్టీఆర్ జయంతి సందర్భంగానే జరగబోతున్న కడప మహానాడుకు పెద్దఎత్తున స్వచ్ఛందంగా తరలిరావాలని పిలుపునిచ్చారు. అనంతరం పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ మాట్లాడుతూ తెలుగునాట రాజకీయ చైతన్యం, అన్నివర్గాలకు అధికారం తెలుగుదేశం పార్టీ ద్వారానే సాకారమైందన్నారు. అలాంటి చైతన్యవంతమైన పార్టీలో ఉన్నవారంతా అదే విలువలతో పనిచేస్తున్నారన్నారు. లక్ష్యాలు పెట్టుకోవాలి. వాటి చేరుకునే ప్రణాళికలు ఉండాలి. మహానాడు ద్వారా అందుకు అవకాశం చిక్కుతుంది. మహానాడు ద్వారా తీసుకునే నిర్ణయాలు పార్టీ, రాష్ట్ర అబివృద్ధికి ఉపయోగ పడతాయన్నారు. కష్టపడినవారికి ఎప్పుడూ పార్టీలో మంచి స్థానం లభిస్తుందన్నారు. ఏ స్థాయికి చేరినా ఎప్పుడూ పార్టీకి విధేయులై ఉండా లన్నారు. సామాజిక న్యాయానికి ఎప్పుడూ పార్టీ అధిష్ఠానం పెద్దపీట వేస్తుందన్నారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎన్నో కష్టాలు దాటుకుని వచ్చిందని, ఎప్పుడూ ప్రజల్లో ఉండాలనేదే సీఎం చంద్రబాబు సంకల్పమమన్నారు. జగన్ రెడ్డి తెదేపానే లేకుండా చేయాలని చూశారని, వైకాపా ఉంటుందో లేదో తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఒక్క హామీ అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వైసీపీ నేతలు హామీల అమలుపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా వైసీపీ నేతలు చేశారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మానుకొండ శివప్రసాద్, గంగాధర్, మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.(Story : ప్రజలే దేవుళ్లుగా పనిచేస్తున్న ఏకైక రాజకీయపార్టీ తెలుగుదేశం )

