ప్రతి కుటుంబానికి నాణ్యమైన సన్న రకం బియ్యం
న్యూస్తెలుగు/వనపర్తి : రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డులు ఉన్న ప్రతి కుటుంబానికి నాణ్యమైన సన్న రకం బియ్యాన్ని ఉచితంగా ఇవ్వడం చారిత్రాత్మకమైనది. ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన ప్రభుత్వంలో నిరుపేదలు సైతం సన్న రకం బియ్యంతో నాణ్యమైన భోజనం చేయాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిమతమని వనపర్తి శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం ఘనపూర్ మండలంలోని 3వ నెంబర్ చౌక ధర దుకాణంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు తో కలిసి వనపర్తి జిల్లాలో సన్న రకం బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పేదలకు మూడు పూటల భోజనం పెట్టాలనే ఉన్నత ఆశయంతో ప్రారంభించిన బియ్యం పంపిణీ కార్యక్రమం కాలక్రమేణ ప్రజలు దొడ్డు రకం బియ్యం తినకుండా అమ్ముకోవడంతో తిరిగి మిల్లులకు చేరి రీసైక్లింగ్ కావడం జరిగిందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో శ్రీమంతులు తినే సన్న రకం బియ్యం ప్రతి పేదవాడు సైతం తినాలి అనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో జాతీయ ఉత్పత్తి పంపిణీ పథకం కింద తెల్ల రేషన్ కార్డుల వారికి ఉచితంగా సన్న రకం బియ్యం సరఫరా చేయడం జరుగుతుందన్నారు. దీని కొరకు కేంద్ర ప్రభుత్వం పై రూ . 5481 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం పై రూ.5173 కోట్ల భారం పడుతుందని తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా 1,59,353 తెల్ల రేషన్ కార్డులు ఉండగా 5,22,367 మంది కుటుంబ సభ్యులు ఉన్నట్లు వెల్లడించారు. రేషన్ కార్డులోని ఒక్కో కుటుంబ సభ్యునికి నెలకు 6 కిలోల చొప్పున సన్న రకం నాణ్యమైన బియ్యం ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లాలోని మొత్తం 324 చౌక ధర దుకాణాల్లో సన్న బియ్యం ఉచిత పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఇందుకు 3309 మెట్రిక్ టన్నుల సన్న రకం బియ్యం అవసరం ఉంటుందనీ తెలియజేశారు. రాష్ట్రంలో ఆర్థిక స్థితిగతులు అంతగా బాగ లేకపోయినప్ప్పటికీనీ ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ వస్తున్నామని తెలియజేశారు. త్వరలోనే అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం జరుగుతుందని తెలిపారు.
అనంతరం పెద్దమందడి మండలంలోని ఒకటవ నెంబర్ రేషన్ షాపు, వనపర్తి మున్సిపాలిటీలోని 1,9,20వ నెంబర్ జాతీయ ఉత్పత్తి పంపిణీ కేంద్రాల్లో , గోపాల్ పేట, పెబ్బేరు మండలాల్లో సైతం సన్న రకం బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అదనపు కలెక్టర్ రెవెన్యూ జి. వెంకటేశ్వర్లు, ఆర్డీఓ సుబ్రమణ్యం, స్థానిక తహశీల్దార్లు, ప్రజా ప్రతినిధులు తదితరులు శాసన సభ్యుల వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు. (Story : ప్రతి కుటుంబానికి నాణ్యమైన సన్న రకం బియ్యం)