భూసేకరణ సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
న్యూస్‌తెలుగు/అనంతపురం : జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జాతీయ రహదారులు, ఏపీ ట్రాన్స్‌కో, జెన్కో, రైల్వే, పవర్ గ్రిడ్, తదితర ప్రాజెక్టులకు భూసేకరణపై ఆయా శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్.హెచ్ 544డి, ఎన్.హెచ్ 67, ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్కో, రైల్వే, పవర్ గ్రిడ్, ఏపీఐఐసీ, హెచ్ఎన్ఎస్ఎస్, తదితర ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, భూమి అప్పగింత పనులను వేగంగా చేపట్టాలని ఆదేశించారు. ఆయా ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణలో నెలకొన్న చిన్నపాటి, ముఖ్యమైన సమస్యలను పరిష్కరించాలన్నారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రత్యేక దృష్టి సారించి జాతీయ రహదారుల పనులు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డిఆర్ఓ ఏ.మాలోల, ఆర్డీఓ కేశవనాయుడు, తహసీల్దార్ లు హరికుమార్, మోహన్ కుమార్, కలెక్టరేట్ ఈ సెక్షన్ సూపరింటెండెంట్ రియజుద్దీన్, ఎన్.హెచ్ పిడి తరుణ్ కుమార్, ఆయా శాఖల అధికారులు, కాంట్రాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు. (Story : భూసేకరణ సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలి)