వనపర్తి జిల్లాను టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యం
న్యూస్ తెలుగు /వనపర్తి : వనపర్తి జిల్లాను టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో టిబి ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం కింద నాట్కో ఫార్మా ట్రస్ట్ వారి సహకారంతో టీబీ రోగులకు పోషకాహార కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైద్య ఆరోగ్యశాఖ టీబీ విభాగం జాయింట్ డైరెక్టర్ రాజేశం, నాట్కో ఫార్మా ట్రస్ట్ సి ఎస్ ఆర్ హెడ్ మదన్, టీబీ కన్సల్టెంట్ గణ జిల్లా కలెక్టర్ తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వనపర్తి జిల్లాను టీబీ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యమని చెప్పారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం జిల్లాలో టీబీ వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు మొబైల్ ఎక్స్రే మిషన్ ద్వారా స్క్రీనింగ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, దాదాపు 90 రోజుల నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతుండగా, ఈ స్క్రీనింగ్ లో 721 మందికి టీబీ గుర్తించినట్లు చెప్పారు. ఈ స్క్రీనింగ్ ప్రక్రియ నిర్వహణలో ఆశా కార్యకర్తల పాత్ర ఎంతో కీలకంగా నిలుస్తుందని చెప్పారు. క్షయ రోగులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ ఈ రోగము వచ్చినవారు ఆందోళన పడవలసిన పనిలేదని, ఆరు నెలలు క్రమం తప్పకుండా సరైన పోషకాహారము, వైద్యులు సూచించిన మందులు తీసుకున్నట్లయితే నయమవుతుందని చెప్పారు. పొగ త్రాగడం మద్యం సేవించడం వంటివి మానుకోవాలని సూచించారు. తగు జాగ్రత్తలు అన్నీ క్రమం తప్పకుండా ఆరు నెలల పాటు పాటిస్తే తప్పనిసరిగా ఈ జబ్బు నయమవుతుందని చెప్పారు. ఈ జబ్బు సోకినవారు జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటే ఇంట్లో వారికి కూడా సోకే ప్రమాదం ఉంటుందని కాబట్టి జాగ్రత్తలు తీసు కోవాలన్నారు. మన జిల్లాను టీబీ రహిత జిల్లాగా మార్చేందుకు రోగులందరికీ ఉచితంగా న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చిన నాట్కో ట్రస్టు వారికి కలెక్టర్ అభినందనలు తెలియజేశారు. ఒక్కో కిట్టు పై రూ. 600 వెచ్చించి అందజేస్తున్నారని చెప్పారు. జెడి రాజేశం మాట్లాడుతూ నాట్కో వారి సహకారంతో ప్రతి నెల రోగులకు న్యూట్రిషన్ కిట్లు అందజేయడం జరుగుతుందని, జాగ్రత్తలు పాటించి రోగులు నయం చేసుకునే దిశగా ముందుకెళ్లాలని చెప్పారు. నాట్కో సి ఎస్ ఆర్ హెడ్ మదన్ మాట్లాడుతూ అందరూ ఆరోగ్యంగా ఉంటేనే, నాణ్యమైన సమాజం ఏర్పాటవుతుందని ఉద్దేశంతో మా వంతు బాధ్యతగా 6 నెలల పాటు వనపర్తి జిల్లాలో టీబీ రోగులకు న్యూట్రిషన్ కిట్లు అందజేసి జిల్లాను టీబీ రహితంగా మార్చేందుకు ముందడుగు వేసినట్లు చెప్పారు. అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన రోగులందరికీ న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీనివాసులు, ఇతర వైద్యశాఖ అధికారులు సాయినాథ్ రెడ్డి, ఇతర అధికారులు, ఆశా వర్కర్లు, రోగులు తదితరులు పాల్గొన్నారు.(Story : వనపర్తి జిల్లాను టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యం )