ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్ గొప్ప అవకాశం
న్యూస్తెలుగు/వనపర్తి : ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్ గొప్ప అవకాశమని వనపర్తి జిల్లా జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం.ఆర్. సునీత అన్నారు. శనివారం వనపర్తి జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ ను ప్రారంభించిన న్యాయమూర్తి, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సివిల్, క్రిమినల్ కేసులను, వివాదాలను పరిష్కరించుకోవచ్చు అన్నారు. లోక్ అదాలత్ ద్వారా కోర్టులకు వెచ్చించే సమయాన్ని ఆదా చేసుకోవడమే కాకుండా, కోర్ట్ ఫీజు కూడా వాపస్ పొందవచ్చు అని చెప్పారు. ఏదైనా కేసు ఒకసారి లోక్ అదాలత్ పరిష్కారం అయ్యింది అంటే అది శాశ్వతంగా పరిష్కారమైనట్లేనని చెప్పారు. నేటి లోక్ అదాలత్ ఏడు బెంచ్ ల ద్వారా మొత్తం 6,266 కేసులను పరిష్కరించినట్లు న్యాయమూర్తి చెప్పారు. వాటిలో 2,663 క్రిమినల్ కేసులు కాగా, 8 సివిల్ కేసులు, 3,595 ప్రీ లిటిగేషన్ కేసులో ఉన్నట్లు చెప్పారు. జాతీయ లోక్ అదాలత్ లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వీ రజనీ, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ కే కవిత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ బి రవి కుమార్, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ వై జానకి, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ బి శ్రీలత, న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు. (Story : ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్ గొప్ప అవకాశం)