అధికారుల అలసత్వంతో మున్సిపల్ చట్టాలు నిర్వీర్యం
భూ కబ్జాల దారులపై చర్యలు తీసుకోవాలి
న్యూస్‌తెలుగు/ వనపర్తి : కాసుల వేటలో కళంకితలుగా మారిన అధికారుల అలసత్వంతో మున్సిపల్ చట్టాలు పూర్తిగా నిర్వీర్యం అవుతున్నాయని ఏఐటీయూసీ రాష్ట్ర నేత పి.సురేష్ ధ్వజమెత్తారు. ఆత్మకూరు మున్సిపల్ కేంద్రంలో భూ కబ్జాలు రోడ్లపై అక్రమ నిర్మాణాలను నిరసిస్తూ బంగారు శీను ను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరవధిక ఆందోళన గురువారం కూడా కొనసాగింది.
సిపిఐ నిరవధిక ఆందోళన శిబిరాన్ని సందర్శించి పి.సురేష్ మాట్లాడుతూ:- ఆత్మకూరు మున్సిపల్ కేంద్రంలో కబ్జాదారుల ఆగడాలు మితిమీరి పోతున్నాయని వారిపై చర్యలు తీసుకొని ప్రభుత్వ ఆస్తులను భూములను పరిరక్షించి పారదర్శకంగా ప్రజలకు ప్రభుత్వానికి జవాబుదారితనంగా మున్సిపల్ శాఖ అధికారులు వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఉన్నదని మండిపడ్డారు.మాజీ ఎంపీపీ బంగారు శీను అవినీతి అక్రమాలతో పోగు చేసుకున్న ధన బలంతో చట్టాలను తుంగలో తొక్కి ప్రభుత్వానికి సమాంతరంగా తన ఆగడాలు అరాచకాలు పెరిగిపోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. వారం రోజులపాటు భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న చర్యలు తీసుకోకపోవడం వెనక ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు. స్థానిక శాసనసభ్యులు జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని ప్రభుత్వ భూములు రోడ్లను భవిష్యత్ తరాలకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా పోరాటాల ముందు నియంతలే కాలగర్భంలో కలిసిపోయినారని గుర్తు చేశారు. ఈకార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె విజయరాములు, సిపిఐ నేతలు టి.శ్రీహరి,ఏ.భాస్కర్, ఎస్,శ్యాంసుందర్, రవీందర్,ఆర్.ఎన్.కుమార్,సౌలు,వినోద్,ఎండి.కుతుబ్, రంగన్న, లక్ష్మి నారాయణ తదితరులు పాల్గొన్నారు. (Story : అధికారుల అలసత్వంతో మున్సిపల్ చట్టాలు నిర్వీర్యం)