లేబర్ కోడ్ల తో కార్మికుల హక్కులకు
విఘాతం: నరసింహ
న్యూస్తెలుగు/వనపర్తి : కేంద్రం నాలుగు లేబర్ కోడుల అమలుతో కార్మికుల హక్కులకు తీవ్ర విఘాతం కలుగుతుందని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి నరసింహ అన్నారు. వనపర్తి ఏఐటీయూసీ జిల్లా ఆఫీసులో కే శ్రీరామ్ అధ్యక్షతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కార్మికులు దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర బిజెపి ప్రభుత్వం నాలుగు కోడలుగా విభజించి ఏప్రిల్ ఒకటి నుంచి అమలుకు పూనుకుందన్నారు. పారిశ్రామికవేత్తలకు కార్మికుల శ్రమను దోచి పెట్టేందుకే కోడులను తెచ్చిందన్నారు. కోడ్లను అమలు చేస్తే కార్మికులుసమ్మె చేసే హక్కు కోల్పోతారన్నారు. ప్రస్తుతం కార్మికులు రోజుకి ఎనిమిది గంటలు పని చేస్తున్నారని 12 గంటలు పనిచేయవలసి వస్తుందన్నారు. వందమంది సభ్యులు ఉంటేనే సంఘం ఏర్పాటు చేసుకోవలసి వస్తుందన్నారు. గ్రామాలలో ప్రతి రంగంలోమంది కార్మికులు లభించరన్నారు.లేబర్ కోడ్లఅమలును దేశంలోని కార్మిక సంఘాలన్నీ వ్యతిరేకిస్తున్నాయన్నారు. బిజెపి కి అనుబంధ కార్మిక సంఘమైన బిఎంఎస్ కూడా రెండు కోడ్ల అమలను వ్యతిరేకిస్తోందన్నారు. కార్మికులు ఏఐటీయూసీ కింద సంఘటితమై పోరాడాలన్నారు. మార్చి 29, 30 తేదీల్లో ఏఐటీయూసీ క్లాసులను వనపర్తి లో నిర్వహించాలన్నారు భవనిర్మాణ కార్మిక సంఘం హమాలీ సంఘం జిల్లా మహాసభలను వనపర్తి లో జరపాలన్నారు. ఏఐటీయూసీకి జిల్లాలో చైతన్యవంతమైన బలమైన నాయకత్వం ఉందన్నారు. అసంఘటిత రంగంలోని కార్మికులను సమీకరించి కొత్త సంఘాలు ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటికే ఉన్న సంఘాలలో అధికంగా కార్మికులను చేర్చి బలోపేతం చేయాలన్నారు. జిల్లాలో ఏఐటీయూసీ అనుబంధ సంఘాల పరిస్థితిని సమీక్షించారు. ఏఐటియుసి వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి కే మోష ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు టి శ్రీహరి, ఉపాధ్యక్షుడు కే శ్రీరామ్, , ఉప ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ, సహాయ కార్యదర్శులు శ్యాంసుందర్, లక్ష్మమ్మ, గౌరవ అధ్యక్షులు భరత్ తదితరులు పాల్గొన్నారు. (Story : లేబర్ కోడ్ల తో కార్మికుల హక్కులకు విఘాతం: నరసింహ)